Telangana: పోస్ట్ ఉంది ఓకే.. మరి అభ్యర్థి ఏరి? ఆ గ్రామంలో పంచాయతి ఎన్నికలపై నెలకొన్న సస్పెన్స్!
పల్లె పోరులో ఎన్నెన్నో సిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. పోటీ కోసం పోరాటం ఒక వైపు అయితే కొన్ని పంచాయతీల్లో రిజర్వేషన్లు గందరగోళంగా మారాయి. అసలు ఆ సామాజికవర్గానికి చెందిన ఒక్క ఓటరు లేక పోయిన వారికే వార్డులు, సర్పంచ్ స్థానాలు కేటాయిస్తున్నారు. దీంతో గ్రామంలో ఎన్నికలు పరిపాలన ప్రశ్నార్ధకంగా మారింది.

మహబూబ్ నగర్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు చిత్ర విచిత్రాలకు వేదికలు అవుతున్నాయి. జడ్చర్ల మండలం శంకరాయపల్లి గ్రామ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికపై నీలి నీడలు కమ్మాయి. ఇక్కడ సర్పంచ్ స్థానం, వార్డుల రిజర్వేషన్లు గందరగోళంగా మారడంతో ఈ పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా ఎస్టీ ఓటర్లు లేని ఈ గ్రామంలో .. సర్పంచ్‌తో పాటు, కొన్ని వార్డుల వారికే రిజర్వ్ అయ్యాయి. మొత్తం 64మంది ఓటర్లు ఉన్న చిన్న గ్రామ పంచాయతీ శంకరాయపల్లి గ్రామం. జడ్చర్ల మున్సిపాలిటీ ఏర్పడక ముందు శంకరాయపల్లి గ్రామం, శంకరాయపల్లి తండా రెండు కలిసి ఉండేవి. ఇందులో శంకరాయపల్లి తండాను మున్సిపాలిటీలో కలిపారు. అనంతరం శంకరాయపల్లి గ్రామం పంచాయతీగా ఏర్పడింది. గ్రామంలో మొత్తం కేవలం బీసీలు మాత్రమే ఉన్నారు. ఒక్క ఓటరు కూడా ఎస్సీ, ఎస్టీలు ఒక్క ఓటరు సైతం లేరు.
అయితే ఇటీవలి పంచాయతీ ఎన్నికల్లో శంకరాయపల్లి గ్రామం సర్పంచ్ స్థానం ఎస్టీ మహిళగా రిజర్వ్ అయ్యింది. అంతే కాకుండా ఉన్న 8 వార్డుల్లో నాలుగు ఎస్టీలకు, రెండు బీసీ, రెండు జనరల్ కు కేటాయించారు. అసలు ఎస్టీ ఓటర్లు లేని గ్రామంలో సర్పంచ్, నాలుగు వార్డులు రిజర్వ్ కావడంతో గ్రామంలో గందరగోళం నెలకొంది. ఎన్నికల ఎలా నిర్వహిస్తారనేది ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది. ఈ రకంగా రిజర్వేషన్ వస్తె ఏం చేయాలని గ్రామస్థులు ఆందోళనలో ఉన్నారు.
ఇక రిజర్వేషన్ల అంశంలో ఎక్కడో తప్పు జరిగిందని అధికారులు చెబుతున్నారు. ఎన్నికల విషయంలో మాత్రం అధికారులు ముందుకే వెళ్ళే అవకాశం ఉంది. నాలుగు వార్డులకు నామినేషన్లు స్వీకరించి డిప్యూటీ సర్పంచ్ ను ఎన్నుకుంటారా? లేక రిజర్వేషన్ల విషయంలో పునరాలోచన చేస్తారా స్పష్టత లేదు. మూడో దశలో ఉన్న ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు ఏం జరుగుతుందో చూడాలి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
