Telangana: ప్రజలారా జాగ్రత్త.. దొంగలున్నారు అంటూ దగ్గరికి వస్తారు.. ఆ తర్వాత గులకరాళ్లు ఇచ్చి..
మహిళలు, వృద్ధులే వారి టార్గెట్.. తాము పోలీసులం... దొంగలున్నారు జాగ్రత్త.. అంటూ చెబుతారు. బంగారం తీయమంటారు.. కవర్ లో పెట్టిస్తాం అంటారు. గులకరాళ్ళు ఇచ్చి.. పరార్ అవుతారు. ఇలా వరుస దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు ఈ దొంగలు.. రద్దీ ప్రాంతాల్లో మాటు వేసి.. అమాయక ప్రజల పసిడినీ కొట్టేస్తున్నారు.

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఓ దొంగల ముఠా పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. పోలీసులమని చెప్తూ నగరం నడిబొడ్డున వరుస దోపిడీలకు పాల్పడుతున్నారు. మహిళలు, వృద్ధులను టార్గెట్ చేస్తూ వంటి మీద ఉన్న బంగారాన్ని మాయం చేస్తున్నారు. దొంగలున్నారు జాగ్రత్త అంటూ దోపిడీలకు స్కెచ్ వేస్తూ ఖాకీలకు సవాల్ విసురుతున్నారు. అది జిల్లా కేంద్రంలో రద్దీగా ఉండే ప్రాంతం.. మిట్ట మధ్యాహ్నం… ముగ్గురు వ్యక్తుల దోపిడి స్కెచ్. ఒంటరిగా వెళ్తోన్న మహిళను ఒకడు వెళ్ళి ఆపాడు.. తాము పోలీసులం.. మఫ్టీలో ఉన్నామని చెప్పాడు. పెద్ద సార్ అక్కడ ఉన్నాడు.. రమ్మంటున్నారు అన్నాడు . నిన్న రాత్రి కత్తితో బెదిరించి.. ఓ మహిళ వద్ద బంగారం చోరి చేశారని నమ్మించారు. ఇలా బంగారం మెడలో వేసుకొని వెళ్లవద్దని ఒంటిపై నాలుగున్నర తులాల మంగళసూత్రం తీయించారు. అంతే సీన్ కట్ చేస్తే ఓ కాగితంలో బంగారం పెట్టీ ఏమార్చి… గులక రాళ్ళ కాగితం ఇచ్చారు. అక్కడ నుంచి వెంటనే పరారయ్యారు. రెండు నెలల క్రితం వృద్ధ జంటను సైతం ఇలాగే మోసం చేసిన ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు..
నాడు పోలీసులమంటూ.. సుమారు 8 తులాల బంగారం ఎత్తుకెళ్లారు. వృద్ధ దంపతులను బురిడి కొట్టించారు. తాజాగా శ్రీనివాస కాలనీలోను ఇదే తరహా దోపిడి చేశారు దొంగలు. ఆరోగ్యం బాగోలేదని హాస్పిటల్ కి పోయి వచ్చే సందర్భంలో సుకన్య అనే మహిళను పోలీసులమంటూ ట్రాప్ చేశారు కేటుగాళ్ళు. నకిలీ ఐడి కార్డ్ చూపించి నమ్మించారు. సేమ్ సీన్ మెడలోని ఉన్న బంగారాన్ని తీసి తన బ్యాగులోని వేసుకున్నట్లు చేసి బంగారాన్ని కాజేశారు. తన బ్యాగులోని రెండున్నర తులాలు కనిపించకపోవడంతో బాధితులు కంగారుపడ్డారు. వెంటనే స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.
వీడియో చూడండి..
ఇక వరుస ఘటనలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. రాత్రుళ్ళ తో పాటు పగలు పహరా పెంచారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. ఘటన జరిగిన ప్రాంతాల్లో సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. త్వరలోనే దొంగలను పట్టుకుంటామని చెబుతున్నారు. ఇలాంటి వారిని గమనిస్తే సమాచారం అందించాలని కోరారు. పోలీసుల పేరుతో జరుగుతున్న వరుస దోపిడి ఘటనలతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. పోలీసుల పహారా పెంచి.. దోపిడీలను నిరోధించాలని పట్టణ వాసులు కోరుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
