AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: చిన్నారులపై కుక్కలు దాడులు చేస్తుంటే.. మీరేం చేస్తున్నారు?.. అధికారులపై HRC సిరియస్

ఖైరతాబాద్‌లో చిన్నారిపై వీధి కుక్క దాడి ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయింది. ఘటనపై సుమోటోగా విచారణ చేపట్టింది. పిల్లల భద్రత, జీవించే హక్కును కాపాడాలని పేర్కొంది. వీధి కుక్కల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు, భవిష్యత్తు ప్రణాళికలపై సమగ్ర నివేదిక సమర్పించాలని GHMCకి ఆదేశాలు జారీ చేసింది. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.

Hyderabad: చిన్నారులపై కుక్కలు దాడులు చేస్తుంటే.. మీరేం చేస్తున్నారు?.. అధికారులపై HRC సిరియస్
Hrc Orders Ghmc Report On Street Dog Control And Child Safety
Vijay Saatha
| Edited By: |

Updated on: Jan 28, 2026 | 7:16 PM

Share

ఖైరతాబాద్‌లో చిన్నారిపై వీధి కుక్క దాడి చేసిన ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా స్పందించింది. కేసును సుమోటోగా స్వీకరించింది. చిన్నారి శర్విన్‌పై జరిగిన దాడి తీవ్రతను పరిగణలోకి తీసుకుని సమగ్ర విచారణ జరపాలని కమిషన్ ఆదేశించింది. ఈ ఘటన పిల్లల భద్రత, జీవించే హక్కును ప్రభావితం చేసే అంశమని కమిషన్ అభిప్రాయపడింది. చిన్నారిని తీవ్రంగా గాయపరిచిన ఈ దాడిపై బాధ్యత ఎవరిది అనే అంశంపై స్పష్టత తీసుకురావాలని పేర్కొంది. ఈ మేరకు కమిషన్ జ్యుడీషియల్ సభ్యులు శివాడి ప్రవీణ అధికారులను అప్రమత్తం చేశారు.

జిహెచ్ఎంసి పరిధిలో జరుగుతున్న వీధి కుక్కల దాడులు, వాటి నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై సమగ్ర నివేదిక సమర్పించాలని కమిషన్ ఆదేశించింది. వీధి కుక్కల నియంత్రణకు చేపడుతున్న చర్యలు, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకునే చర్యల వివరాలను తెలియజేయాలని స్పష్టం చేసింది. ఈ నివేదికను వచ్చే నెల 24వ తేదీలోగా సమర్పించాలని జిహెచ్ఎంసి కమిషనర్‌కు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని కమిషన్ వెల్లడించింది.

ఖైరతాబాద్ ఘటనతో నగరంలో వీధి కుక్కల సమస్య మరోసారి చర్చనీయాంశంగా మారింది. పాఠశాలల పరిసరాలు, నివాస ప్రాంతాల్లో పిల్లల భద్రతపై తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగినప్పటికీ సరైన నియంత్రణ చర్యలు లేకపోవడం వల్లే ప్రమాదాలు పునరావృతమవుతున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మానవ హక్కుల కమిషన్ ఆదేశాలతో జిహెచ్ఎంసి అధికారులపై ఒత్తిడి పెరిగింది. వీధి కుక్కల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై స్పష్టత ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. చిన్నారుల భద్రతే లక్ష్యంగా తక్షణ చర్యలు తీసుకోవాలని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కమిషన్ హెచ్చరించినట్లు సమాచారం.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.