AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: వామ్మో.. వీడు మామూలోడు కాదు.. ఫైనాన్స్ ఎగవేతకు లారీ ఓనర్ పెద్ద స్కెచ్..!

తీసుకున్న డబ్బును రుణ వాయిదా చెల్లించకుండా ఏగవేతకు స్కెచ్ వేశాడు. పోలీసులను పక్కదారి పట్టించి లారీని సొంతం చేసుకోవాలని ప్రయత్నించాడు. అతడు వేసిన ప్లాన్ బెడిసికొట్టి పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడో ప్రబుద్ధుడు.

Telangana: వామ్మో.. వీడు మామూలోడు కాదు.. ఫైనాన్స్ ఎగవేతకు లారీ ఓనర్ పెద్ద స్కెచ్..!
Lorry Owner Arrest
M Revan Reddy
| Edited By: Balaraju Goud|

Updated on: Aug 21, 2024 | 1:26 PM

Share

తీసుకున్న డబ్బును రుణ వాయిదా చెల్లించకుండా ఏగవేతకు స్కెచ్ వేశాడు. పోలీసులను పక్కదారి పట్టించి లారీని సొంతం చేసుకోవాలని ప్రయత్నించాడు. అతడు వేసిన ప్లాన్ బెడిసికొట్టి పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడో ప్రబుద్ధుడు. అతడి స్కెచ్ ను చూసి పోలీసులే అవాక్కయ్యారు.

నల్లగొండ జిల్లా మాడ్గులపల్లి మండలం ధర్మాపురానికి చెందిన నాగార్జున కొంత కాలంగా మిర్యాలగూడ మండలం దుర్గానగర్‌లో నివాసం ఉంటూ లారీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఐదేళ్ల క్రితం ఇండో స్టార్ ఫైనాన్స్ సంస్థ నుండి రూ.13లక్షలు రుణం తీసుకుని, ఓ లారీని కొనుగోలు చేశాడు. ఇందుకు గానూ నెలకు రూ.54వేల వాయిదా చెల్లించేలా అగ్రిమెంట్‌ చేసుకున్నాడు. అయితే ఈ ఏడాది మే నెల నుంచి నెలసరి రుణ వాయిదాలను ఫైనాన్స్ సంస్థకు చెల్లించకుండా ఎగ్గొట్టేందుకు పథకం వేశాడు. లారీని దొంగలు ఎత్తుకెళ్లినట్టు నమ్మించేందుకు ప్రయత్నించాడు. అందులో భాగంగా పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు రిజిస్టర్‌ చేయిస్తే లారీపై ఉన్న ఫైనాన్స్ మొత్తం రద్దవుతుందని భావించాడు.

తన స్కెచ్ లో భాగంగా ఈ ఏడాది మే 22న విశాఖపట్నం నుంచి రూ.12లక్షల విలువైన ఐరన్ స్క్రాప్‌ లోడుతో బయలుదేరి మహారాష్ట్ర కొల్లాపూర్‌లోని జె.కె కంపనీలో అన్ లోడ్ చేయాల్సి ఉంది. వైజాగ్ నుండి బయలుదేరిన నాగార్జున మే నెల 23వ తేదీన మార్గమధ్యలో తన ఇంటి వద్దకు చేరుకున్నాడు. అయితే మే 24న తాను పార్కింగ్‌ చేసిన చోట లారీ కనపడట్లేదని మిర్యాలగూడ రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. అదే నెల 25న లారీ ఎవరికీ కనపడకుండా ఉండేందుకు నంబర్‌ ప్లేట్‌, ఛాసిస్ పై పసుపు రంగు పూశాడు. కనగల్‌ మండలం చిన్న మాదారంలోని తన అల్లుడు బొడ్డుపల్లి అనిల్‌కు అసలు విషయం దాచి పెట్టి, అతడి బత్తాయి తోటలో లారీని నిలిపి ఉంచాడు.

లారీని ఇక్కడ ఉంచడంతో తనకు సమస్య వస్తుందని అనిల్‌ చెప్పినప్పటికీ కొద్దిరోజుల్లోనే లారీని తీసుకెళ్తానని బతిమాలుకుని తోటలో ఉంచి వెళ్లాడు. లారీ చోరీకి గురైనట్లు ఎఫ్‌ఐఆర్‌ నమోదైతే ఫైనాన్స్ రద్దు కావడంతో పాటు మహారాష్ట్రలోని జేకేస్టీల్‌ కంపెనీకి డెలివరీ ఇవ్వాల్సిన రూ.10లక్షల విలువైన ఐరన్ స్ర్కాప్‌తో పాటు లారీ మిగిలిపోతుందన్న ఆత్యాశతో తన పథకం అమలుకు ప్రయత్నించాడు.

మిర్యాలగూడ రూరల్ పోలీసులు లారీ మిస్సింగ్ పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు. నిందితుడి వ్యవహార శైలిపై అనుమానం వచ్చిన పోలీసులు నిఘా పెట్టారు. కనగల్ మండలం చిన్న మాదారం తోటలోని ఇనుము స్క్రాప్‌ లోడుతో ఉన్న లారీని స్వాధీనం చేసుకుని లారీ యాజమానీ గుట్టురట్టు చేశారు. అతడిని అరెస్టు చేయడంతో పాటు రూ. 12లక్షల విలువ చేసే ఐరన్ స్క్రాప్, రూ.10 లక్షల విలువ గల లారీ, యాజమాని సెల్ పోన్ స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..