Hyderabad: పిడుగు ప్రకోపం.. తీవ్ర విధ్వంసం.. ప్రకృతి కన్నెర్ర చేస్తే ఇలా ఉంటుందా…

పంజాగుట్టలోని అపార్టుమెంట్‌ సుఖ్‌ నివాస్‌ అపార్టుమెంటుపై పిడుగు పడి కారు ధ్వంసమయింది. దీంతోపాటు విద్యుత్‌ తీగలు తెగిపడ్డాయి. అపార్ట్ మెంట్ రెయిలింగ్ గోడ ధ్వంసం అయ్యింది

Hyderabad: పిడుగు ప్రకోపం.. తీవ్ర విధ్వంసం.. ప్రకృతి కన్నెర్ర చేస్తే ఇలా ఉంటుందా...
Thunderstorm
Follow us
Ram Naramaneni

|

Updated on: Aug 21, 2024 | 1:33 PM

పైన ఫోటోలో మీరు చూస్తోన్న ప్లేస్‌లో చిన్న సైజు యుద్ధం జరగలేదు. ఆకతాయిల దాడి కూడా కాదు. మనుషులు చేసిన పని కాదు ఇది. ఇదో అనూహ్య పరిణామం. ప్రకృతి ప్రకోపించి మెరుపు దాడి చేస్తే ఇలా అయిపోయింది. హైదరాబాద్‌ నగరం నడిబొడ్డున పిడుగు పడితే ఎలా ఉంటుందో తెలుసా? ఇదిగో ఇలా ఉంటుంది? హైదరాబాద్‌ నగరంలో ఇంతకు ముందెన్నపుడు జరగని ప్రకృతి విధ్వంసం. ఇటీవల కాలంలో కనీవినీ ఎరుగని పిడుగు దాడి ఇది. దీంతో నగరవాసులకు పిడుగు పడితే ఎలా ఉంటుందో అర్థమైంది.

అపార్ట్‌మెంట్‌పై పిడుగు పడింది

ఉదయం 6 గంటలకు భారీ వర్షం పడుతున్న వేళ…సిటీ సెంటర్‌లో ఉన్న పంజాగుట్టలోని సుఖ్‌ నివాస్‌ అపార్ట్‌మెంట్‌ ఆరో అంతస్తుపై పిడుగు పడింది. దాని ధాటికి బాల్కనీ రెయిలింగ్‌ గోడ కూలి కింద పడడంతో…అపార్ట్‌మెంట్‌ ఎంట్రన్స్‌ గేటు తుక్కుతుక్కయిపోయింది. గేటు ధ్వంసమైపోయింది. ఐరన్‌ గేట్‌ ముక్కలైపోయి మెలితిరిగిపోయింది. కారు పార్కింగ్‌ షెడ్ రెండు భాగాలుగా చీలిపోయింది. ఇక పార్క్‌ చేసిన కారు కూడా ధ్వంసమైంది. దాని విండ్‌ షీల్డ్స్‌ పూర్తిగా ధ్వంసమయ్యాయి. అయితే అదృష్టవశాత్తూ ఆ టైమ్‌లో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది.

ఉదయం 6 గంటలకు భారీ శబ్దంతో పిడుగు పడడంతో అపార్ట్‌మెంట్‌ వాసులు ఉలిక్కిపడ్డారు. మొదట ట్రాన్స్‌ఫార్మర్‌ పేలిపోయిందనుకున్నారు. ఆ తర్వాత అసలు విషయం తెలిసి చిగురుటాకులా వణికిపోయారు. తమ నెత్తినే పిడుగు పడిందని తెలిసి నిర్ఘాంతపోయారు.

మెరుపు దాడిని ఆపడం మనం చేతుల్లో లేదు. పిడుగు బారి నుంచి కాపాడుకోవడం మాత్రం మన చేతుల్లోనే ఉంది. మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతున్నప్పుడు బయట ఉండడం శ్రేయస్కరం కాదు. అలాగే ఎత్తయిన చెట్లు, టవర్లు కింద ఉండడం మంచిది కాదు. సాధ్యమైనంత త్వరగా సురక్షిత ప్రదేశంలోకి చేరాలి.