ముగిసిన సమతాకుంభ్ 2025.. ఆధ్యాత్మిక జాతరను తలపించిన తృతీయ బ్రహ్మోత్సవాలు
సమతాకుంభ్ 2025 బ్రహ్మోత్సవాలు ముగిశాయి. తృతీయ వార్షికోత్సవాలకు తరలివచ్చిన భక్తులు ఉత్సవాలలో పాల్గొని తరించారు. శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన జీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో పది రోజుల పాటు సాగిన ఉత్సవాలు.. సకల జనుల సంబురంగా సాగాయి. జగమంతా పులకించిన వైదికోత్సవం.. మదినిండా భక్తి భావాన్ని నింపింది.

శ్రీ రామానుజాచార్య – 108 దివ్యదేశాల తృతీయ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. భక్త కోటిని పరవశింపచేసేలా అద్భుత, అద్వీతయ ఘట్టాలు కళ్లకు కట్టాయి. ఫిబ్రవరి 9 నుంచి 19 వరకు వైభవంగా కొనసాగాయి. ఆధ్యాత్మిక పండుగ 10 రోజుల పాటు సాగింది. ప్రతి సంవత్సరం సమతాకుంభ్ పేరుతో ఈ ఉత్సవాలను నిర్వహిస్తూ వస్తున్నారు. అంకురార్పణతో ఆరంభమైన బ్రహ్మోత్సవాలు.. శ్రీపుష్పయాగం, మహాపూర్ణాహుతితో పూర్తయ్యాయి. బ్రహ్మోత్సవాల చివరి రోజు శ్రీపుష్ప యాగం జరిగింది. ఉత్సవాదులలో సంభవించిన దోషపశాంతికై పుష్పాలతో మండలాన్ని తయారుచేసి, పెరుమాళ్ళకి ద్వాదశారాధనలతో పుష్ప యాగాన్ని వైభవంగా నిర్వహించారు.
మహా పూర్ణాహుతి శాస్త్రోక్తంగా జరిగింది. పూర్ణాహుతి పవిత్రద్రవ్యాలను యాగశాలకు ప్రదక్షిణంగా తీసుకుని వచ్చి ఆయా కుండాలలో మంత్రపూతంగా సమర్పించారు. శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామిని అనుసరించి యాగశాల చుట్టూ ప్రదక్షిణ చేశారు. ఓ పత్రమో, పుష్పమో ఫలమో.. భక్తితో సమర్పిస్తే చాలు.. సంతోషంగా స్వీకరించే కారుణ్య మూర్తి ఆ విభువు. అలాంటిది మనసును పువ్వులుగా సమర్పిస్తే.! భక్తుల కోసం ఆ భగవంతుడు దివి నుంచి భువికి రాకుండా వుంటాడా! పువ్వులో వైవిధ్యం..మాలలో అమరితే.. ఆ పరిమళాలు ఎంతో మాధుర్యం. జీవకోటిలో వైవిధ్యం సమతతో అమరితే.. అది సకల జగత్తుకు శుభప్రదం. పువ్వుల్ని కలిపే మాలకు దారం ఆధారమైతే… భగవంతుడిని దర్శింప చేసే మహాద్వారమే గురువు.
రంగురంగుల పుష్పాలతో చక్ర మండల రచన చేసి శ్రీపుష్ప యాగం ఘనంగా నిర్వహించారు. శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో ద్వాదశ ఆరాధన కార్యక్రమం జరిగింది. పుష్పాలతో వరుసగా 12 ఆరాధనలు చేశారు. ఇలా సుప్రభాతం నుంచి శయనోత్సవం వరకు 12 సార్లు ఆరాధనలు జరిపించారు. అర్చకమూర్తులు శ్రీపుష్పయాగాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. తర్వాత పెరుమాళ్లను యాగశాలకు తీసుకొచ్చి మహాపూర్ణాహుతి జరిపించారు. చివరిరోజు కలశ తీర్థాన్ని తీసుకెళ్లి దివ్యసాకేత క్షేత్రంలోని వైకుంఠనాథుడు, రంగనాథుడు, ఆంజనేయస్వామి, ఆళ్వార్లకు ప్రోక్షణ జరిపించారు. మూలమూర్తికి ఉత్సవాన్త స్నపనము నిర్వహించారు. ఆ తర్వాత యాగ కార్యక్రమాన్ని నిర్వహించడానికి విచ్చేసిన దేవతాగణానికి పూజా కార్యక్రమాలు జరిపించారు.
ఉత్సవాల చివరి రోజున భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆవాహన చేసిన దేవతలందరికీ ఆరాధన చేసి బలిహరణలు పూర్తయ్యాక దేవతా ఉద్వాసన చేశారు. పుష్పయాగ మహోత్సవం వైభవంగా సాగింది. మలయప్పస్వామి, అమ్మవార్ల ఉత్సవర్లను పట్టు వస్త్రాభరణాలతో అలంకరించి వేదమంత్రాల నడుమ పుష్ప కైంకర్యం సాగింది. చామంతి, సంపంగి, నూరు వరహాల పుష్పాలతో స్వామి, అమ్మవార్లను అలంకరించారు. వేదపండితులు రుగ్వేదం, శుక్లయజుర్వేదం, కృష్ణయజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదాలను పఠించారు. దేవతా బలిహరణ, వేద విన్నపాలు పూర్తి కాగానే నవాహ్నిక యజ్ఞ కార్యక్రమం సుసంపన్నమైంది. ఋత్విక్కులు అందరికి యజ్ఞ రక్షను సమర్పించారు.
మహాపూర్ణాహుతి తర్వాత యజ్ఞంలో అగ్నిరూపంలో ఆరాధించిన ఆ స్వామి శక్తిని చక్రాబ్జ మండలంలోకి తీసుకొచ్చి, మండలంలో ఆ శక్తిని కుంభంలోకి, కుంభం నుండి బింబం – అర్చా మూర్తిలోకి, తిరిగి ఆ శక్తిని తీసుకురావడం అనేది ఆచారం. లక్ష్మి ఆరాధన చేసి స్వామి పుష్పార్చన చేశారు. సాకేత రామచంద్ర స్వామి పట్టు వస్త్రాలు, ఆభరణాలతో అలంకరించి వేదమంత్రాల నడుమ పుష్పకైంకర్యం కొనసాగింది. పూల బుట్టలతో గుట్టలుగా ఈ అభిషేకం జరిగింది. ఆ తర్వాత మహా పూర్ణాహుతి ఉంటుంది. గరుత్మంతుడిని యధాస్థానానికి రమ్మని ఆహ్వానిస్తూ ధ్వజారోహణం చేశారు. అంకురాలను పెరుమాళ్ల సన్నిధిలో సమర్పించి సంప్రోక్షణ నిర్వహించారు. పెరుమాళ్లకు ఉత్సవం పూర్తయిందని తెలియజేస్తూ ఉత్సవాన్తస్నపనం జరిపారు. ఉత్సవాలు అయిపోయాక కూడా పెరుమాళ్లకు అభిషేకం నిర్వహించారు. ఆ శక్తిని అలా చేసిన ప్రక్రియని, కుంభజలాలను 108 దివ్య దేశాల పెరుమాళ్ళకి చినజీయర్ స్వామి సంప్రోక్షణ చేశారు. అలానే స్వర్ణ రామానుజులుకి, సమతామూర్తికి కూడా కుంభప్రోక్షణని చేశారు. తర్వాత శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి భక్తులందరికీ స్వయంగా కుంభ జలాలతో సంప్రోక్షణ చేసి, మంగళాశాసనములని అనుగ్రహించారు.
కార్యక్రమం మొత్తాన్ని నడిపించిన గరుడ్మంతుడి దగ్గరికి వెళ్లి స్వామి ఆజ్ఞతో వారిని కిందకి దించారు. గరుడ పటాన్ని శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి అవరోహణం చేశారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ సమానమే అనే స్ఫూర్తిని ప్రపంచం మొత్తానికి చాటి చెప్పిన ఆ సమతా మూర్తి రామానుజాచర్యుల వారిని స్మరించుకుంటూ ఈ బ్రహోత్సవాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఉత్సవాలకు హాజరైన ప్రతి భక్తుడికీ తీర్థ ప్రసాదాలను అందజేశారు. ద్వాదశ ఆరాధన కార్యక్రమంలో 12 ప్రసాదాలు నివేదించారు. ప్రపంచ ప్రజలకు సమతాజ్ఞనాన్ని ప్రసాదించిన అపూర్వ సమతామూర్తి శిఖరం రామానుజాచార్య 108 దివ్యదేశాల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సమతామూర్తి ప్రాంగణం భగవన్నామ స్మరణతో మార్మోగింది. ముచ్చింతల్‌లో భక్తజనం మనసుల్ని రంజింపజేసిన బ్రహ్మోత్సవాలు కనులపండువను తలపించాయి. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తజనం మదినిండా ఆధ్యాత్మిక భావనతో తన్మయత్వం పొందారు. ద్వితీయ వార్షికోత్సవాల్లో దేశ, విదేశాల నుంచి లక్షలాది మంది సమతా మూర్తి, ఆశ్రమాన్ని దర్శించుకున్నారు. మహా పూర్ణాహుతి తర్వాత తీర్థ, ప్రసాద వినియోగంతో కార్యక్రమం సుసంపన్నమైనది.
