Kishan Reddy: పేదల కోసం కేంద్రానికి సహకరించండి.. సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ.. ఏ విషయంలో అంటే..
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర బోగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. పేదలకు సొంతింటి కల సాకారమయ్యేలా.. పీఎం ఆవాస్ యోజన పథకం తెలంగాణలోని పేదలందరికీ అందేలా చూడాలని కిషన్ రెడ్డి కోరారు. పేదల ఇళ్ల విషయంలో కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించి సర్వేలో పాల్గొనాలని సూచించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర బోగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. పేదలకు సొంతింటి కల సాకారమయ్యేలా.. పీఎం ఆవాస్ యోజన పథకం తెలంగాణలోని పేదలందరికీ అందేలా చూడాలని కిషన్ రెడ్డి కోరారు. పేదల ఇళ్ల విషయంలో కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించి సర్వేలో పాల్గొనాలని సూచించారు. ఈ సందర్భంగా కేంద్రప్రభుత్వం ఇళ్ల కోసం నిర్వహించే సర్వేలో పాల్గొనాలని కోరారు. ఈ మేరకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి మంగళవారం లేఖ రాశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత ప్రభుత్వం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన – గ్రామీణ పథకాన్ని2016లో ప్రారంభించినట్లు తెలిపారు. ఇది మార్చి, 2024 నాటికి గ్రామీణ భారతదేశంలోని భూమిలేని పేద కుటుంబాల కోసం 2.95 కోట్ల పక్కా గృహాలను నిర్మించాలనే లక్ష్యంతో రూపుదిద్దుకున్నట్లు వెల్లడించారు. 09.08.2024న జరిగిన కేంద్ర మంత్రుల సమావేశంలో రెండో దశలో భాగంగా 2024 నుంచి 2029 మధ్య పేద కుటుంబాలకు అదనంగా 2 కోట్ల పక్కా ఇళ్లు నిర్మించాలని నిర్ణయించారు. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల అవసరం ఉన్న కనీసం 10 కోట్ల మందికి ప్రయోజనం చేకూరనుందని తెలిపారు.
అయితే.. PMAY-గ్రామీణ 2.0 కోసం లబ్ధిదారుల గుర్తింపు 2011 సామాజిక ఆర్థిక కుల గణన (SECC) 2011.. శాశ్వత నిరీక్షణ జాబితా (PWL), Awaas+ (2018) జాబితా ఆధారంగా ఉంటుంది. ఇది ఇళ్ల కేటాయింపులకు ఆధారం అవుతుంది. పై రెండు జాబితాల ఆధారంగా, ఇప్పటికే కొన్ని ఈశాన్య రాష్ట్రాలు, పర్వత రాష్ట్రాలలో వివరాలు సేకరించారని తెలిపారు. అయితే కొన్ని రాష్ట్రాల్లో సర్వే జరగలేదని.. PMAY గ్రామీణ 2.0 దీనిని పరిష్కరించడానికి లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. అస్సాం, బీహార్, గుజరాత్, హర్యానా, జార్ఖండ్, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక వంటి రాష్ట్రాలు ఇప్పటికీ గ్రామీణ గృహ నిర్మాణ పథకానికి అర్హులైన లబ్ధిదారులను కలిగి ఉన్నాయని తెలిపారు.
తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో లక్షలాది పేద కుటుంబాలు ఇళ్లు అవసరమైనప్పటికీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న గత ప్రభుత్వం ఆవాస్ 2018+ సర్వేలో పాల్గొనలేదని కిషన్ రెడ్డి తెలిపారు. అందువల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి లబ్ధిదారుల జాబితాను కేంద్ర ప్రభుత్వానికి పంపలేదన్నారు. దీంతో ఇళ్లు అవసరమైన తెలంగాణ గ్రామీణ పేద కుటుంబాలకు ఎలాంటి ఆసరా లభించక, ఇళ్ల నిర్మాణ కల కలగానే మిగిలిపోయిందన్నారు. రాష్ట్రంలో 2014 నుంచి 2023 వరకు అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం ఇళ్లు నిర్మించకుండా డబుల్ బెడ్ రూం ఇళ్ల పేరుతో పేద ప్రజలను మోసం చేసిందన్నారు.
ప్రజాప్రతినిధిగా, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా, కేంద్రమంత్రిగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా తాను చేసిన అనేక యాత్రల్లో ఇళ్లస్థలాల విషయంలో ప్రభుత్వం నుంచి మద్దతు కోరిన వారు చాలా మంది ఉన్నారని కిషన్ రెడ్డి గుర్తుచేశారు. ఇదే విషయాన్ని 09.08.2024న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ప్రధాన మంత్రి, కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు. సొంత ఇల్లు కావాలని ఆకాంక్షిస్తున్న తెలంగాణ పేద ప్రజలకు పూర్తి సహకారం అందిస్తామని ఇద్దరూ హామీ ఇచ్చారన్నారు..
కావున ఈ విషయాన్ని పరిశీలించి కేంద్రప్రభుత్వానికి సహకరించి సర్వేలో పాల్గొని తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లు అవసరమైన పేద కుటుంబాల జాబితాను వీలైనంత త్వరగా సిద్ధం చేయవలసిందిగా కోరుతున్నానని.. కిషన్ రెడ్డి లేఖలో ప్రస్తావించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..