AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KCR: ఆనాడైనా.. ఈనాడైనా.. తెలంగాణకు ప్రధాన శత్రువు కాంగ్రెస్ః కేసీఆర్

ప్రజలను మభ్యపెట్టి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, పరిపాలనలో విఫలమైందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన అవసరం తమకు లేదన్నారు. అయితే ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. ప్రజల పక్షాన పోరాడుతామన్నారు. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీని ఆపడం ఎవరి తరం కాదన్నారు.

KCR: ఆనాడైనా.. ఈనాడైనా.. తెలంగాణకు ప్రధాన శత్రువు కాంగ్రెస్ః కేసీఆర్
Kcr In Brs Silver Jubilee Celebration
Balaraju Goud
|

Updated on: Apr 27, 2025 | 9:14 PM

Share

ప్రజలను మభ్యపెట్టి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, పరిపాలనలో విఫలమైందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన అవసరం తమకు లేదన్నారు. అయితే ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. ఒకప్పుడు రాష్ట్రంలో భూములు రేట్లు ఎలా ఉండేవి. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే భూములు రేట్లు పడిపోతాయా అని కేసీఆర్ ప్రశ్నించారు.

హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడుతూ.. ముందుగా జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడి మృతులకు నివాళులర్పించారు. కన్నతల్లి, జన్మభూమిని మించిన స్వర్గం లేదని అన్నారు. వీరులను కన్న గడ్డ మీద బీఆర్ఎస్ సభ పెట్టుకోవడం సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. సరిగ్గా 25 ఏళ్ల క్రితం ఇదే రోజున గులాబీ జెండా ఎగిరిందని కేసీఆర్ గుర్తు చేశారు. ఆనాటి నుంచి నేటికి గులాబీ జెండాను ఆదరిస్తున్నారని తెలిపారు. నిర్విరామంగా పోరాటం చేసి స్వరాష్ట్రాన్ని సాధించామని అన్నారు. ఉద్యమం జెండా ఎట్టి పరిస్థితుల్లో దించే ప్రసక్తే లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. జెండా దించితే నన్ను రాళ్లతో కొట్టాలని స్వయంగా చెప్పానని గుర్తుచేశారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చినా జెండా దించలేదని అన్నారు.

నిరాదరణకు గురైన తెలంగాణలో చీకట్లను పారద్రోలి వెలుగులు నింపామని కేసీఆర్ అన్నారు. వలసవాదుల నుంచి తెలంగాణకు విముక్తి కల్పించామని తెలిపారు. అధికారంలోకి వచ్చాక విధ్వంసమై తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించామని చెప్పారు. అనేక ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మించుకున్నాం.. మూడేళ్లలో కాళేశ్వరం కట్టాం, పంజాబ్‌ను తలదన్నేలా పంటలు పండించామన్నారు. ప్రతి రైతును కళ్లలో పెట్టుకుని చూసుకున్నామని కేసీఆర్ తెలిపారు. రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు రైతుబంధు పథకం తీసుకొచ్చామన్న కేసీఆర్, రైతుబీమా అమలు చేసి రైతు కుటుంబాలను ఆదుకున్నామన్నారు. అన్ని పంటలకు సకాలంలో రైతుబంధు జమచేశామని, ఎన్నికల అజెండాలో చెప్పని ఎన్నో పథకాలను అమలు చేశామన్నారు.

దళితబంధు, రైతుబంధు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, రైతుబీమా వంటి అనేక చారిత్రాత్మక పథకాలు తీసుకొచ్చి అన్ని వర్గాల ప్రజల రూపురేఖలు మార్చుకున్నామని కేసీఆర్ అన్నారు. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రజలు ఎంతో గోసపడ్డారని తెలిపారు. ఆనాడైనా, ఈనాడైనా, ఏనాడైనా తెలంగాణకు శత్రువు కాంగ్రెస్ పార్టీనే అన్నారు. తెలంగాణ సాధించుకొస్తామని బయల్దేరిన ఉద్యమకారుల్ని ఇందిరా గాంధీ ప్రభుత్వం పిట్టల్లా కాల్చేసిందని కేసీఆర్ గుర్తు చేశారు. మళ్లీ అలాంటి కాంగ్రెస్ ప్రభుత్వమే రాష్ట్రంలో అధికారంలో ఉండి.. మరోసారి ప్రజలను మోసం చేస్తుందన్నారు.

పాలన చేతకాక రాష్ట్రాన్ని ఆర్థికంగా కాంగ్రెస్ పాలకులు దివాలా తీయించారని కేసీఆర్ మండిపడ్డారు. 80-90శాతం పూర్తయిన ప్రాజెక్టులను పూర్తి చేయకుండా పక్కన పెట్టారన్నారు. పేద మహిళల కోసం తీసుకువచ్చిన కేసీఆర్‌ కిట్‌ పథకం నిలిపివేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి కొన్నాళ్లు సమయం ఇవ్వాలని ఇన్నాళ్లు బయటకు రాలేదు. ఇప్పటి నుంచి ప్రజా సమస్యలపై అందరి తరఫున పోరాడతానని స్పష్టం చేశారు. రాష్ట్రా అభివృద్ధి కోసం భూములు అమ్మొచ్చు.. అభివృద్ధి చేయొచ్చు కానీ, ఏది అమ్మాలో విచక్షణ ఉండాలన్నారు. ఎక్కడైనా యూనివర్సిటీ భూములు అమ్ముతారా?’ అని కేసీఆర్‌ ప్రశ్నించారు. కమిషన్ల పేరుతో జనాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దోచుకుంటుందని కేసీఆర్ మండిపడ్డారు.

ఎవరు తెచ్చినా.. బాగున్న పథకాన్ని కొనసాగించాలని కేసీఆర్ అన్నారు. వైఎస్‌ఆర్‌ తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ పథకాన్ని రద్దు చేయలేదన్న కేసీఆర్.. అదే పేరుతో ఆ పథకాన్ని కొనసాగించామన్నారు. సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని, పోలీసులకు చెబుతున్నా.. డైరీల్లో రాసుకోండి.. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీని ఆపడం ఎవరి తరం కాదన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. బీఆర్ఎస్ ప్రభంజనాన్ని ఎవరూ ఆపలేరన్నారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వైఖరిపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అంతా భభ్రమానం..భజగోవిందం. శుష్క ప్రియాలు.. శూన్య హస్తాలని విరుచుకుపడ్డారు. ఆపరేషన్‌ కగార్‌ అనే పేరుతో ఛత్తీస్‌గఢ్‌లో గిరిజనులు, యువతను ఊచకోత కోస్తున్నారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్చలకు పిలవాలని నక్సలైట్లు కోరుతున్నారు. వాళ్ల విజ్ఞప్తి మేరకు నక్సలైట్లను చర్చలకు పిలవాలన్నారు. బలగాలు ఉన్నాయని అందర్నీ చంపుతూ వెళ్తే.. ప్రజాస్వామ్యం అనిపించుకోదన్న కేసీఆర్.. ఆపరేషన్‌ కగార్‌ తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఆపరేషన్‌ కగార్‌ ఆపాలని రజతోత్సవ సభ వేదికగా తీర్మానం చేసి ఢిల్లీకి పంపుదాం అని కేసీఆర్‌ పిలుపునిచ్చారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..