BRS: బీఆర్ఎస్‌కు సెంటిమెంట్‌గా మారిన కరీంనగర్.. గులాబీ విజయ ప్రస్థానంలో కీలకపాత్ర..!
నాటి తెలంగాణా రాష్ట్ర సమితి అయినా.. నేటి భారత రాష్ట్ర సమితి అయినా.. ఆ పార్టీ సెంటిమెంట్ అడ్డా కరీంనగర్. నాడు 2001లో పార్టీ ఆవిర్భావం తర్వాత.. తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు కొరకు ఉద్యమానికి ఉపిరిపోయిన సింహగర్జన సభ ఇక్కడే మొదలైంది. నాటి టీఆర్ఎస్‌కు, నేటి బీఆర్ఎస్‌కు పార్టీ చరిత్రలో ఓ మైలురాయి.

నాటి తెలంగాణా రాష్ట్ర సమితి అయినా.. నేటి భారత రాష్ట్ర సమితి అయినా.. ఆ పార్టీ సెంటిమెంట్ అడ్డా కరీంనగర్. నాడు 2001లో పార్టీ ఆవిర్భావం తర్వాత.. తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు కొరకు ఉద్యమానికి ఉపిరిపోయిన సింహగర్జన సభ ఇక్కడే మొదలైంది. నాటి టీఆర్ఎస్‌కు, నేటి బీఆర్ఎస్‌కు పార్టీ చరిత్రలో ఓ మైలురాయి. అంతేకాదు, 2009, డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ప్రకటన చేసిన తర్వాత మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో మలి దశకు ఉపిరి పోసింది ఇక్కడే. ఆంధ్రాలో ఊపందుకున్న ఉద్యమంతో నాటి కేంద్రంలోని కాంగ్రెస్ సర్కార్ యూటర్న్ తీసుకోవడంతో.. తెలంగాణాలో ఉద్యమం మరింత తీవ్రమైంది.
తెలంగాణ సాధనలో భాగంగా 2009, డిసెంబర్ 29న ఉద్యమ నేత కేసీఆర్.. సిద్ధిపేట శివార్లలోని రంగధాంపల్లి వద్ద ఆమరణ దీక్షకు సిద్ధమయ్యారు. కరీంనగర్ ఉత్తర తెలంగాణా భవన్ నుంచి సిద్ధిపేటకు బయల్దేరిన కేసిఆర్ ను.. కరీంనగర్ శివార్లలోని అల్గనూరు వద్ద పోలీసుల అరెస్ట్ చేయడం.. ఖమ్మం తరలించడం.. ఆసుపత్రిలో కూడా కేసీఆర్ తన ఆమరణ దీక్ష కొనసాగించడం వంటి ఎన్నో కీలక ఘట్టాలకు.. కరీంనగర్ సాక్షిభూతంగా నిల్చింది. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సాధన.. ఉద్యమ నేత కేసీఆర్ రెండు పర్యాయాలు సీఎం అవ్వడం బీఆర్ఎస్ పార్టీ ప్రస్థానంలో మరిచిపోలేని చరిత్ర.
అయితే, గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమితో కాంగ్రెస్ అధికారం చేజిక్కించుకోవడంతో.. రాష్ట్రంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన ప్రభావం డెఫినెట్‌గా పార్లమెంట్ ఎన్నికల్లో ఉంటుందని బీఆర్ఎస్ అంచనా వేసింది. పైగా కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ హవా.. రామజన్మభూమి కల సాకారం కావడం.. దేశవ్యాప్తంగా ప్రతిపక్ష కాంగ్రెస్ పరిస్థితి బలహీనపడటం.. ఇండియా పేరిట జట్టు కట్టిన ఇతర మిత్రపక్షాలు పుంజుకోకపోవడంతో.. బీజేపీ గాలి బలంగా వీస్తోంది. ఒకవైపు బలంగా ఉన్న బీజేపీని ఎదుర్కోవాలన్నా, మరోవైపు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ను ఢీకొట్ఠాలన్నా కచ్చితంగా బీఆర్ఎస్ ఇప్పుడు పెద్ద సవాళ్లనే ఫేస్ చేయాల్సి ఉంది.
పైగా సెంటిమెంట్ బేస్డ్ గా పాలిటిక్స్ చేయడంలో బీఆర్ఎస్ ది అందే వేసిన చేయి అనే టాక్ ఉంది. ఈ క్రమంలో మరోసారి పరీక్ష ఎదుర్కొంటున్న వేళ, బీఆర్ఎస్ పార్టీ తన పార్లమెంట్ ఎన్నికల శంఖారావానికి కరీంనగర్‌లోని ఎస్‌ఆర్ఆర్ మైదానాన్ని ఎంచుకుంది. మార్చి 12వ తేదీన గులాబీ బాస్ కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల ప్రచార సభలో ఏం మాట్లాడబోతున్నారన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది. మళ్లీ బీఆర్ఎస్ పునర్ వైభవం కోసం వచ్చే పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి ఆ పార్టీ కరీంనగర్ ను వేదిక చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆ సభను సక్సెస్ చేసేందుకు బీఆర్ఎస్ శ్రేణులు నడుం బిగించాయి. మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తో పాటు, మాజీ ఎంపీ వినోద్ కుమార్ తదితరులు ఎస్ఆర్ఆర్‌లో సభా ఏర్పాట్లు పరిశీలించారు.
ఇప్పటికే ప్రతీ నియోజకవర్గంలో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సమావేశాలను ఏర్పాటు చేస్తున్న బీఆర్ఎస్ నాయకులు.. కరీంనగర్ సభతో మరింత దూకుడు పెంచాలని భావిస్తున్నారు. కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ లో బీజేపీతో ఢీ అంటే ఢీ అనేందుకు సిద్ధపడుతున్నట్టు కనబడుతోంది. కాంగ్రెస్ తమ అభ్యర్ధి ఎవరో ఇంకా ప్రకటిఃచని నేపథ్యంలో.. పోటీలో బీజేపీని ఢీకొనేలా ప్రణాళిక రచిస్తోంది. మరి సెంటిమెంట్ గా కలిసి వచ్చిన కరీంనగర్ గడ్డ ఈసారి బీఆర్ఎస్ కు ఎలాంటి ఫలితాన్ని రుచి చూపించబోతోందన్న ఎన్నో అంశాలు ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…
