Telangana: తల్లితో సహా కాంగ్రెస్ నేత ఆత్మహత్య.. జనగామలో తీవ్ర విషాదం!
జనగామ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. స్థానిక కాంగ్రెస్ నేత, మాజీ కౌన్సలర్ దయాకర్ రెడ్డి, ఆయన తల్లి ఆత్మహత్యకు పాల్పడడం స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఒంటరి జీవితం, అనారోగ్య సమస్యల కారణంగానే తల్లి కొడుకులు ఆత్మహత్య చేసుకుని ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఒంటరి జీవితం.. వెంటాడుతున్న అనారోగ్య సమస్యలు.. వారిని మానసికంగా కుంగిపోయేలా చేశాయి. ఆర్థికంగా పరిపుష్టిగా ఉన్నా మానసిక ప్రశాంతత కరువై తల్లి కొడుకులు ఆత్మహత్యకు పాల్పడిన విషాద సంఘటన జనగామ జిల్లా కేంద్రంలో వెలుగు చూసింది. తల్లి కొడుకులు ఒకరి వెంట మరొకరు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం కుటుంబ సభ్యులతో పాటు స్థానిక ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
వివరాల్లోకి వెళితే.. జనగామ జిల్లా కేంద్రంలోని గిర్నిగడ్డ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు, మాజీ కౌన్సిలర్ దయాకర్ రెడ్డి(55) ఆయన తల్లి అహల్యదేవి(85)తో పాటు నివాసం ఉంటున్నారు. ఇన్నాళ్లు రాజకీయ జీవితంలో ఉండడంతో దయాకర్ రెడ్డి వివాహం కూడా చేసుకోలేదు. దీంతో తన తల్లి బాగోగులు చూసుకోవడం కోసం దయాకర్ రెడ్డి తన స్వగ్రామంలోనే తల్లితో కలిసి ఉంటున్నాడు. అయితే కొద్దిరోజుల క్రితం అహల్యదేవిపై కొన్ని కోతులు దాడి చేశాయి. కోతుల దాడిలో ఆమె కిందపడి తీవ్రంగా గాయపడి వెన్నుముక ఇరిగింది. దీంతో ఆమెకు వెన్నుముక ఆపరేషన్ చేయించారు. అదే సమయంలో దయాకర్ రెడ్డి కూడా వెన్నునొప్పితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. ఇద్దరు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇంట్లో వాళ్లను చూసుకోవడానికి ఎవరూ లేరు. దీంతో అతనే ఎలానో అలా తల్లి బాగోగులు చూసుకుంటూ ఉన్నారు.
అయితే గురువారం ఉదయం వీరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. గమనించిన స్థానికులు వెంటనే దయాకర్ రెడ్డి అన్నయ్యకు సమాచారం ఇచ్చారు. దయాకర్ రెడ్డి అన్నయ్య వాసుదేవారెడ్డి వృత్తి రీత్యా హైదారాబాద్‌లో స్తిర పడ్డాడు. స్థానికుల సమాచారంతో ఆయన వెంటనే స్వగ్రామానికి చేరుకున్నారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వారు రాగిజావలో పురుగుల మందు కలుపుకొని తాగి ఆత్మహత్యకు పాల్పడినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వీరి మృతి పై ఎలాంటి అనుమానాలు లేవని, అనారోగ్య సమస్యలు, ఒంటరితనమే ఆత్మహత్యకు కారణమని పోలీసులు మృతుల కుటుంబ సభ్యులు భావిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




