KCR: చాన్నాళ్ల తర్వాత మీడియా ముందుకు కేసీఆర్..
బీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు కేసీఆర్. చెక్‌డ్యామ్‌లు బాంబులు పెట్టి పేలుస్తారా అని మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చాక పేల్చినోడు పాతాళంలో ఉన్నా పట్టుకొస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వంపై ప్రజలు ఆవేశంగా ఉన్నారన్న కేసీఆర్.. ప్రతిపక్షంగా మన బాధ్యతను నిర్వహిద్దామని నేతలకు పిలుపునిచ్చారు. మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాలకు నీళ్లిచ్చామన్న కేసీఆర్..90 శాతం పూర్తయిన పాలమూరును..ఇంకా ఎందుకు పూర్తి చేయలేదో ప్రభుత్వాన్ని నిలదీద్దామన్నారు.
తనను దూషించడం, అవమానించడమే కాంగ్రెస్ ప్రభుత్వ విధానమని మండిపడ్డారు కేసీఆర్. పంచాయితీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించామని..ఈ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపించిందన్నారు కేసీఆర్. పార్టీ గుర్తులతో జరిగే ఎన్నికలయితే BRS సత్తా ఇంకా తెలిసేదన్నారు. గర్వంతో ఎగిరెగిరిపడుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు..పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పారన్నారు కేసీఆర్. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా ఇలాంటి అహంకారపూరిత హింస ప్రయత్నాలు చేయలేదన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మనం ఎట్లా ప్రతిపక్షాలతో వ్యవహరించాలో నేర్పుతోందని చెప్పారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు సంవత్సరాల్లో ఒక కొత్త పాలసీ కూడా తేలేదని విమర్శించారు కేసీఆర్. తీసుకువచ్చిన పాలసీ అంతా రియల్ ఎస్టేట్‌కు సంబంధించిందే అయినా రాష్ట్రంలో ప్రజల ఆస్తుల విలువ పూర్తిగా తగ్గిందన్నారు. ఒకప్పుడు యూరియా ఇంటికి, చేను వద్దకు డైరెక్టుగా వచ్చేదని కానీ ఇప్పుడు ఒక్క యూరియా బస్తా కోసం కుటుంబం అంతా లైన్లలో నిలబడే పరిస్థితి వచ్చిందన్నారు కేసీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తది పథకం ఒకటి ప్రకటించకపోగా ఉన్న వాటిని ఆపేసిందని విమర్శించారు.
తెలంగాణ భవన్‌లో BRS అధినేత KCR అధ్యక్షతన జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో.. మాజీమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్య సభ్యులు హాజరయ్యారు. సమావేశంలో ప్రధానంగా సాగునీటి ప్రాజెక్టుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై చర్చించారు. అలాగే పార్టీ నిర్మాణం, అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు కేసీఆర్.




