AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఎవర్రా మీరంతా.. ఇలా కూడా మోసం చేస్తారా.. ఇది తెలిస్తే నోరెళ్లబెడతారు..

సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త రూపం దాల్చుతున్నారు. నిన్నటి వరకు డిజిటల్ అరెస్ట్ అంటూ చట్టం పేరుతో భయపెట్టిన వీరు.. ఇప్పుడు నమ్మకం అనే ఆయుధంతో మన జేబులు ఖాళీ చేస్తున్నారు. మీ పక్క షాపు యజమాని పేరుతోనో, ఎదురింటి వ్యక్తిలానో ఫోన్ చేసి.. అర్జెంట్ అన్నా.. కొంచెం యూపీఐ చేయవా? అంటూ లూటీ చేస్తున్నారు. తాజాగా కొవ్వూరులో ఇలాంటి ఘటనే జరిగింది.

Andhra Pradesh: ఎవర్రా మీరంతా.. ఇలా కూడా మోసం చేస్తారా.. ఇది తెలిస్తే నోరెళ్లబెడతారు..
Cyber Scam In Kovvur
Ch Murali
| Edited By: |

Updated on: Mar 19, 2026 | 12:37 PM

Share

సైబర్ నేరగాళ్లు రూటు మార్చారు. నిన్నటి వరకు డిజిటల్ అరెస్ట్ అంటూ భయపెట్టి లక్షలు కొల్లగొట్టిన కేటుగాళ్లు, ఇప్పుడు నమ్మకం పేరుతో నయవంచనకు తెరలేపారు. మీ పక్కింటి వ్యక్తిలానో, ఎదురు షాపు యజమానిలానో ఫోన్ చేసి అత్యవసరం అంటూ చిన్న మొత్తాల్లో డబ్బులు లాగేస్తున్నారు. ఒక్కసారి ఆ ఉచ్చులో పడ్డారో మీ జేబు ఖాళీ అవ్వడం ఖాయం. తాజాగా నెల్లూరు జిల్లా కోవూరు ప్రాంతంలో వెలుగు చూసిన ఈ కొత్త రకం మోసాలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి.

అచ్చం పక్కింటి వ్యక్తిలాగే మాటలు..

ఈ కేటుగాళ్లు చేసే మోసం చాలా పక్కాగా ఉంటోంది. ముందుగా మీ షాపు లేదా ఇంటి పరిసరాల్లో ఉన్న వ్యక్తుల పేర్లు, వారి వృత్తిని ఆరా తీస్తారు. ఆ తర్వాత మీకు ఫోన్ చేసి.. “అన్నా.. నేను మీ పక్క షాపు సంపత్‌ను మాట్లాడుతున్నా అనో, లేదా మీ ఎదురుగా ఉన్న మహేష్ మెడికల్ వాడిని అన్నా అంటూ మాటలు కలుపుతారు. ‘‘నేను ప్రస్తుతం బయట ఉన్నాను.. అర్జెంట్‌గా కొంత డబ్బు కావాలి. మీరు నా నంబర్‌కు UPI చేస్తే, మావాళ్లతో వెంటనే మీకు క్యాష్ పంపిస్తాను” అని నమ్మిస్తారు. అనుమానం రాకుండా ఉండటానికి వీరు పెద్ద మొత్తంలో కాకుండా కేవలం 5 వేలు లేదా 8 వేల రూపాయలు మాత్రమే అడుగుతారు. చిన్న మొత్తమే కదా అని చాలామంది మొహమాటానికి పోయి వెంటనే పంపేస్తున్నారు. ఒకవేళ మీరు అనుమానించి ప్రశ్నిస్తే.. నమ్మకం లేదా అన్నా? కావాలంటే వీడియో కాల్ చేయమంటారా? అని ఎదురుదాడి చేసి నమ్మబలుకుతారు.

కోవూరులో వరుస ఉదంతాలు

ఈ తరహా మోసాలు ప్రస్తుతం కోవూరు నియోజకవర్గ వ్యాప్తంగా ముమ్మరంగా సాగుతున్నాయి. పది నిమిషాల్లో డబ్బులు పంపుతానని చెప్పిన వ్యక్తి.. గంటలైనా, రోజులైనా కనిపించకపోవడంతో బాధితులు తీరిగ్గా పక్క షాపు యజమానిని అడిగితే గానీ అసలు విషయం అర్థం కావడం లేదు. నేను ఫోన్ చేయలేదే.. అని వారు సమాధానం చెప్పడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. ఇలాంటి వందలాది కేసులు నిత్యం నమోదవుతుండటం గమనార్హం.

పోలీసుల హెచ్చరిక

సైబర్ నేరగాళ్ల నెట్‌వర్క్ చాలా లోతుగా ఉందని, వీరిని పట్టుకోవడం సవాలుగా మారుతోందని పోలీసులు చెబుతున్నారు. ప్రధానంగా ఈ క్రింది జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. తెలిసిన వ్యక్తి పేరుతో ఫోన్ వచ్చి డబ్బులు అడిగితే, వెంటనే ఆ వ్యక్తికి ఉన్న పాత నంబర్‌కు ఫోన్ చేసి నిర్ధారించుకోండి. అత్యవసరం అన్నంత మాత్రాన గుర్తు తెలియని నంబర్ల నుండి వచ్చే అభ్యర్థనలను మన్నించవద్దు. ఫోన్‌లో మీ వ్యక్తిగత లేదా ఆర్థిక సమాచారాన్ని ఎవరికీ చెప్పవద్దు. ఒకవేళ మీరు మోసపోయినట్లు గుర్తిస్తే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా 1930 నంబర్‌కు ఫోన్ చేయండి లేదా సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించండి. కాగా నేరగాళ్లు ఎంత తెలివిగా ఆలోచించినా, మన అప్రమత్తతే వారికి చెక్ పెడుతుంది. “పక్కన వారే కదా” అనే చిన్న మొహమాటం మీ కష్టార్జితాన్ని ఆవిరి చేయకుండా జాగ్రత్త పడండి.

Follow Us