AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫాతిమా కాలేజ్‌ కూల్చివేతపై హైడ్రా U టర్న్‌..!

హైదరాబాద్ హైడ్రా కమిషనర్ రంగనాథ్, ఎంఐఎం నేతలకు చెందిన ఫాతిమా కాలేజీ కూల్చివేతపై మాట మార్చారు. ముందుగా చెరువు ఎఫ్టీఎల్లో ఉన్న కాలేజీని కూల్చేస్తామని ప్రకటించిన కమిషనర్, విద్యార్థుల సంక్షేమం దృష్ట్యా కూల్చివేత చేయడం లేదని అన్నారు. ఈ నిర్ణయంపై విస్తృత చర్చ జరుగుతోంది.

ఫాతిమా కాలేజ్‌ కూల్చివేతపై హైడ్రా U టర్న్‌..!
Av Ranganath
Laxmikanth M
| Edited By: |

Updated on: Jul 10, 2025 | 7:55 PM

Share

ఫాతిమా కాలేజీ కూల్చివేతలపై హైడ్రా యూటర్న్ తీసుకుంది. ఎంఐఎం నేతలకు చెందిన ఫాతిమా కాలేజ్‌ని కూల్చబోమని హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంచలన ప్రకటన చేశారు. చెరువు ఎఫ్టీఎల్‌లో ఎంఐఎం నేతలకు చెందిన ఫాతిమా కాలేజ్ నిర్మాణాలు ఉన్నట్లు గతంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ నిర్ధారించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అకాడమిక్ ఇయర్ అయిపోగానే ఫాతిమా కాలేజీ నిర్మాణాలను కూల్చివేస్తామని సెప్టెంబర్ 2025న ప్రెస్ మీట్ లో వెల్లడించారు. ఏమైందో ఏమో కానీ ఇప్పుడు ఈ మాటను వెనక్కి తీసుకున్నారు కమిషనర్ రంగనాథ్.

ఫాతిమా కాలేజ్ నిర్మాణాలు కూల్చమని మీడియా గ్రూపులో కమిషనర్ రంగనాథ్ అఫీషియల్ గా పోస్ట్ చేశారు. ఫాతిమా కాలేజీలో పేద విద్యార్థులకు ఉచితంగా చదువులు చెబుతున్నారని, సామాజిక కోణంలో ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. ఈ మొత్తం వ్యవహారం ఇలా ఉంటే ఫాతిమా కాలేజీ కూల్చివేతలపై ఎలాంటి అధికారిక జీవోలు లేకుండా సొంత నిర్ణయాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రకటించడం హాట్ హాట్ గా మారింది.

చెరువులు, నాళాలు కుంటలు, నదులు, వాటర్ బాడీలలో ఎఫ్టిఎల్ బఫర్ జోన్లలో ఎలాంటి కబ్జాలు చేయరాదని, ఒకవేళ కబ్జాలు చేసిన వాటిని నిర్దాక్షిణ్యంగా కూల్చివేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలు ఉన్నాయి. హైదరాబాద్ మహానగరంలో ఔటర్ రింగ్ రోడ్డు వరకు 1,023 చెరువులను కబ్జాల నుంచి విముక్తి కలిగించడానికి హైడ్రాకు సర్వాధికారాలు కట్టబెడుతూ ప్రభుత్వం ప్రత్యేక 99జీవో జారీ చేసింది. హైదరాబాద్‌లో ప్రభుత్వ ఆస్తులు, చెరువుల పరిరక్షణ కోసం హైడ్రాను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జూలై 19, 2024 న జీవో నెం. 99 ను తీసుకువచ్చింది. దీనితో జూలై 26, 2024 నుండి కూల్చివేతలు ప్రారంభమయ్యాయి.

అలాంటి అధికారం హైడ్రాకు ఉందా?

చెరువులను కబ్జా చేసి చేపట్టిన నిర్మాణాలను కూల్చబోమని ప్రకటించే అధికారం కానీ, ప్రత్యేక జీవోలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కానీ హైడ్రాకు ఎలాంటి అధికారిక ఆదేశాలు లేవు. కానీ హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాత్రం సల్కం చెరువు ఎఫ్ టి ఎల్ పరిధిలో ఎంఐఎం నేతలకు చెందిన కేవలం ఒక ఫాతిమా కాలేజ్ ని మాత్రమే కూల్చే ప్రసక్తే లేదని మీడియా గ్రూపులో అఫీషియల్ గా పోస్ట్ లు చేయడం సంచలనంగా మారింది. పేద విద్యార్థులు చదువుతున్నారు కాబట్టే సామాజిక కోణంలో ఫాతిమా కాలేజ్ ని కూల్చమని రంగనాథ్ పేర్కొన్నారు. కానీ ఇప్పటివరకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా చెరువు ప్రాంతాల్లో నివాసం ఉంటున్న పేదల షెడ్లను కమిషనర్ రంగనాథ ఆదేశాలతో హైడ్రా ఫోర్స్ చాలా చోట్ల కూల్చివేసింది. సున్నం చెరువు, తమ్మిడి కుంట చెరువు, గాజులరామారం, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చెరువుల దగ్గర ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌లో ఉన్న వేలాది మంది పేదల పూరీయిండ్లను నేలమట్టం చేసింది హైడ్రా. మరి దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి