Hyderabad: బ..బ..బాహుబలి విమానం.! హైదరాబాద్‌లో ల్యాండ్.. ప్రత్యేకతలు తెలిస్తే మతిపోవాల్సిందే
బాహుబలి విమానం హైదరాబాద్‌లో ల్యాండ్ అయింది. ఉక్రెయిన్‌కు చెందిన ఆంటోనోవ్ తయారు చేసిన AN-124 ప్రపంచంలో అత్యంత భారీ కార్గో జెట్‌లలో ఒకటి. మరి ఈ భారీ విమానం ప్రత్యేకతలు ఏంటో ఓ సారి లుక్కేయండి మరి. ఈ స్టోరీ మీకోసమే..

శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం గురువారం భారీ ఏవియేషన్ అద్భుతానికి వేదికైంది. ప్రపంచంలో అతిపెద్ద, అతి బరువైన కార్గో విమానాల్లో ఒకటైన ఆంటోనోవ్ AN-124 రస్లాన్ RGIA రన్‌వేపై దిగింది. ఈ అరుదైన ల్యాండింగ్‌ను చూసి విమానాశ్రయ సిబ్బంది, ఏవియేషన్ ప్రేమికులు థ్రిల్ ఫీల్ అయ్యారు. దీనిపై ఓ ప్రకటన విడుదల చేసింది ఎయిర్‌పోర్ట్. AN-124 ల్యాండింగ్ తమ ప్రత్యేక కార్గో హ్యాండ్లింగ్ సామర్థ్యాన్ని మరోసారి నిరూపించిందని పేర్కొంది. ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఓవర్‌సైజ్‌డ్ కార్గోను హ్యాండిల్ చేయగల సామర్థ్యం తమ వద్ద ఉందని, ఈ మహా విమానాన్ని స్వాగతించడం ఎప్పుడూ ఒక ప్రత్యేక అనుభూతి అని తెలిపింది.
ఉక్రెయిన్‌కు చెందిన ఆంటోనోవ్ తయారు చేసిన AN-124 ప్రపంచంలో అత్యంత భారీ కార్గో జెట్‌లలో ఒకటి. భారీ యంత్రాలు, రక్షణ పరికరాలు, విపరీత పరిమాణంలో పరిశ్రమలకు సంబంధించిన సరుకును తరలించేందుకు ఈ విమానాన్ని ప్రత్యేకంగా రూపుదిద్దారు. ఇదే విమానం చివరిసారి అక్టోబర్ 10న హైదరాబాద్‌కు రాగా, ఈసారి ఇది కొలంబో బండరనాయకే అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వచ్చింది. AN-124 ల్యాండింగ్‌తో RGIA జటిలమైన కార్గో ఆపరేషన్లను నిర్వహించగలిగే సామర్థ్యం మరింత బలపడింది. గ్లోబల్ కార్గో ట్రాఫిక్‌లో హైదరాబాద్ తన పాత్రను పెంచుకుంటోందనే సంకేతాలు ఈ విజిట్ ఇస్తోంది.
2016లో ప్రపంచంలోనే అతి పెద్ద కార్గో విమానమైన ఆంటోనోవ్ AN-225 మారియా RGIAలో ల్యాండ్ అయిన దృశ్యం ఇప్పటికీ ఏవియేషన్ అభిమాలకు గుర్తుండే సంఘటన. ఆరు టర్బోఫ్యాన్ ఇంజిన్ల శక్తితో నడిచే AN-225 ప్రపంచంలోనే అత్యంత పొడవైన, అత్యంత బరువైన విమానం. 640 టన్నుల గరిష్ఠ టేకాఫ్ వెయిట్, అత్యంత వెడల్పైన రెక్కల విస్తీర్ణం, ఖండాంతరాల వరకు 180–230 టన్నుల కార్గోను తీసుకెళ్లే సామర్థ్యంతో అది ఏవియేషన్ ప్రపంచంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. 2016 సందర్శన సమయంలో AN-225 టుర్క్‌మెనిస్తాన్ నుంచి హైదరాబాదుకు చేరింది. ఇప్పుడు AN-124 మళ్లీ రావడంతో, RGIAలో ప్రత్యేక కార్గో ఆపరేషన్లకు మరొక ముఖ్యమైన రోజుగా మారింది. అలాగే ఇది 640 టన్నుల బరువు ఉంటుందని సమాచారం.
