AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TSPSC ఎగ్జామ్ పేపర్ లీక్‌లో సంచలన విషయాలు.. పోలీసుల అదుపులో యువతి, ప్రవీణ్‌ సహా 13మంది నిందితులు..

Telangana Public Service Commission: తెలంగాణలో TSPSC పేపర్‌ లీక్‌ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఒక్కరి కోసం వేలాది మంది జీవితాలతో చెలగాటం ఆడాడు ఓ ఉద్యోగి. టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ పరీక్ష పేపర్ లీక్‌ అంశంలో హనీ ట్రాప్‌ కారణమన్న విషయం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.

TSPSC ఎగ్జామ్ పేపర్ లీక్‌లో సంచలన విషయాలు.. పోలీసుల అదుపులో యువతి, ప్రవీణ్‌ సహా 13మంది నిందితులు..
Tspsc
Venkata Chari
|

Updated on: Mar 13, 2023 | 6:46 AM

Share

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌లో టౌన్‌ ప్లానింగ్‌ పేపర్‌లీక్‌ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌లో పనిచేసే ఉద్యోగి ప్రవీణ్‌కుమారే పేపర్‌లీక్‌కి కారణమని పోలీసులు గుర్తించారు. ఈ కేసులో హనీట్రాప్‌ కీలకంగా మారింది. ఓ యువతి కోసమే ప్రవీన్‌ ఇదంతా చేశాడని తెలిసి అధికారులే షాకయ్యారు. తరచూ ప్రవీన్‌ను కలిసేందుకు ఆ యువతి వచ్చేదని, ఇదంతా యువతికోసమే చేశాడన్న విషయం కలకలం రేపుతోంది. TSPSC సెక్రటరీ వద్ద పీఏగా పనిచేసే ప్రవీణ్‌.. ఆ యువతి కోసం గుట్టుచప్పుడు కాకుండా టౌన్‌ప్లానింగ్‌ పేపర్‌ని లీక్‌ చేశాడు.

ప్రవీణ్‌ టీఎస్పీఎస్సీలో ఉద్యోగి. అంతకు మించి.. బోర్డు చైర్మన్‌కి పీఏగా ఉన్నాడు. ఆ యువతి కోసం ఎందాకైనా వెళ్దామనుకున్న ప్రవీణ్‌.. అక్కడ పనిచేసే రాజశేఖర్‌ అనే ఉద్యోగికి భారీగా డబ్బు ఆశ చూపాడు. అనంతరం అతడి కంప్యూటర్‌ నుంచి టీఎస్పీఎస్సీ చైర్మన్‌ పేరుతో.. లాగిన్‌ అయ్యాడు. అతడికి ఐడీ, పాస్‌వర్డ్‌ ముందే తెలిసి ఉండడంతో మొత్తం వ్యవహారం క్షణాల్లోనే కానిచ్చేశాడు. అయితే ప్రశ్నాపత్రం డౌన్‌లోడ్‌ అయితే అందరికీ తెలిసిపోతుంది. కాబట్టి.. అలా కాకుండా.. ఫొటోలు తీసుకున్నాడు. టీఎస్‌పీఎస్సీలో ఉద్యోగి ప్రవీణ్ విధులు దుర్వినియోగం చేసి పేపర్‌ లీక్‌ చేసినట్లు స్పష్టమైన ఆధారాలను గుర్తించారు. దీంతో వేలాది మంది జీవితాలతో చెలగాటమాడిందెవరన్న దాన్ని తేల్చేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. దీంతోపాటు లీక్ చేసిన క్వశ్చన్‌పేపర్‌ ప్రవీన్‌ ఎంతమందికి ఇచ్చాడనేదానిని పరిశీలిస్తున్నారు. ప్రశ్నాపత్రాన్ని ఫొటోలు తీసుకుని.. వాటిని యువతికి వాట్సాప్‌ చేశాడు ప్రవీణ్‌.

ఇక్కడే అసలు ట్విస్టు బయటికివచ్చింది. యువతి తన తమ్ముడి కోసమే ఇదంతా చేసిందని.. ప్రవీణ్‌ చెబుతుంటే.. ఆమెమాత్రం అత్యాశతో మరో అడుగు ముందుకేసి పేపర్‌ని బేరానికి పెట్టింది. అభ్యర్థులకు ఒక్కొక్కరికి పేపర్‌ని రూ.14లక్షలకు బేరానికి పెట్టింది. ఈ మాట ఆనోటా.. ఈనోటా పడడంతో అసలు విషయం బయటకు వచ్చింది. ఓ అభ్యర్థి ఈ వ్యవహారాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. తీగలాగితే ఈ డొంకంతా కదిలింది. ప్రస్తుతం పోలీసుల అదుపులో యువతి, ప్రవీణ్‌ సహా 13మంది ఉన్నారు.

ఇవి కూడా చదవండి

ఈ వ్యవహారంతో.. రెండు ఉద్యోగ నియామక పరీక్షలు వాయిదా వేశారు. షెడ్యూల్ ప్రకారం నిన్న జరగాల్సిన టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ పరీక్ష, ఈ నెల 15,16 తేదీల్లో జరగాల్సిన వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ నియామక పరీక్షను వాయిదా వేశారు. ఈ పరీక్షలను తిరిగి ఎప్పుడు నిర్వహించేది తర్వాత ప్రకటిస్తామని TSPSC వెల్లడించింది.

మొత్తానికి టీఎస్‌పీఎస్సీలో సంచలనంగా మారిన హనీట్రాప్‌ వ్యవహారం ఇప్పుడు యావత్‌ తెలంగాణలో ప్రకంపనలు రేపుతోంది. మరోవైపు నిరుద్యోగులు ఏం జరుగుతుందో తెలియక అల్లాడిపోతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..