AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sankranti Special Buses: సంక్రాంతికి ఊరెళ్లే వారికి అదిరిపోయే న్యూస్.. ఏపీకి ప్రత్యేక బస్సులు.. బుకింగ్ ప్రారంభం

హైదరాబాద్ లో రద్దీ ప్రాంతాలైన ఎంజీబీఎస్‌, జేబీఎస్‌, ఉప్పల్‌ క్రాస్‌ రోడ్స్‌, ఆరాంఘర్‌, ఎల్బీనగర్‌ క్రాస్‌ రోడ్స్‌, కేపీహెచ్‌బీ, బోయిన్‌పల్లి, గచ్చిబౌలి, తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను సంస్థ నడుపుతోంది. ఆయా ప్రాంతాల్లో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా స్పెషల్ బస్సులు ఏర్పాటు చేసేలా ప్రత్యేక అధికారులను నియమించింది.

Sankranti Special Buses: సంక్రాంతికి ఊరెళ్లే వారికి అదిరిపోయే న్యూస్.. ఏపీకి ప్రత్యేక బస్సులు.. బుకింగ్ ప్రారంభం
Tgsrtc
Shaik Madar Saheb
|

Updated on: Dec 31, 2024 | 7:06 PM

Share

సంక్రాంతి పర్వదినం సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే వారి కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ( టీజీఎస్ఆర్టీసీ) యాజమాన్యం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రయాణికులకు సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు 6432 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. అందులో 557 సర్వీస్ లకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పించింది. గత సంక్రాంతికి 4484 ప్రత్యేక బస్సులను ప్లాన్ చేయగా.. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా 5246 బస్సులను సంస్థ నడిపింది. గత సంక్రాంతి అనుభవం దృష్ట్యా ఈసారి 6432 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. జనవరి 9వ తేది నుంచి 15 వ తేది వరకు ఈ ప్రత్యేక బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి.

హైదరాబాద్ లో రద్దీ ప్రాంతాలైన ఎంజీబీఎస్‌, జేబీఎస్‌, ఉప్పల్‌ క్రాస్‌ రోడ్స్‌, ఆరాంఘర్‌, ఎల్బీనగర్‌ క్రాస్‌ రోడ్స్‌, కేపీహెచ్‌బీ, బోయిన్‌పల్లి, గచ్చిబౌలి, తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను సంస్థ నడుపుతోంది. ఆయా ప్రాంతాల్లో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా స్పెషల్ బస్సులు ఏర్పాటు చేసేలా ప్రత్యేక అధికారులను నియమించింది.

హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక బస్సులను సంస్థ నడుపుతోంది. ప్రధానంగా అమలాపురం, కాకినాడ, కందుకూరు, నర్సాపురం, పోలవరం, రాజమండ్రి, రాజోలు, ఉదయగిరి, విశాఖపట్నం, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, విజయవాడ, శ్రీశైలం, తిరుపతి, తదితర ప్రాంతాలకు ఈ బస్సులు నడుస్తాయి. అలాగే, తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ నుంచి తిరుగుపయనమయ్యే వారి కోసం కూడా ప్రత్యేక బస్సులను సంస్థ ఏర్పాటు చేసింది.

ఈ సంక్రాంతికి కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ నుంచి ఎలక్ట్రిక్ బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంచేలా ప్లాన్ చేస్తుంది.

సంక్రాంతి ఆపరేషన్స్ టీజీఎస్‌ఆర్టీసీకి ఎంతో కీలకమని, ఆ మేరకు పూర్తిగా సన్నద్ధం  కావాలని క్షేత్ర‌స్థాయి అధికారుల‌కు ఇప్పటికే టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం సూచించింది. హైదరాబాద్ లోని రద్దీ ప్రాంతాల్లో ప్రయాణికుల సౌకర్యార్థం పండల్స్, షామియానాలు, కుర్చీలు, పబ్లిక్ అడ్రస్ సిస్టం, తాగునీటి సదుపాయం, మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది.

రాష్ట్ర ప్రభుత్వ మహాలక్ష్మి పథకంలో భాగంగా సంక్రాంతికి నడిపే పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరి, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు రవాణా సదుపాయం అమల్లో ఉంటుందని తెలిపింది. తమ ప్రయాణ సమయంలో మహిళలు విధిగా జీరో టికెట్లను తీసుకోవాలని వివరించింది.

ప్రైవేట్‌ వాహనాల్లో ప్రమాదకర ప్రయాణం చేయొద్దని ప్రజలకు సూచించింది. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారు టీజీఎస్ఆర్టీసీ ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల్లో సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని కోరింది.

ప్రత్యేక బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ ను www.tgsrtcbus.in వెబ్ సైట్ లో చేసుకోవాలని పేర్కొంది. ప్రత్యేక బస్సులకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033 సంప్రదించాలని సూచించింది.