Hyderabad: పండుగకు మీరు కొనేది స్వీట్లు కాదు.. పాయిజన్.. ఇవిగో డీటేల్స్..!
దీపావళి పండుగకు స్వీట్లు కొంటున్నారా..? బీ కేర్ ఫుల్..! మీరు కొనేది స్వీట్లు కాదు.. పాయిజన్ అని తేల్చారు అధికారులు. ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి కల్తీ నెయ్యి, నాన్-ఫుడ్ గ్రేడ్ ఫాయిల్, ప్రమాదకర సింథటిక్ రంగులతో స్వీట్లు తయారు చేస్తున్న షాపులపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. పండుగ పేరుతో నాసిరకమైన పదార్థాలతో తయారైన స్వీట్లు మార్కెట్‌లోకి రావడంపై అధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

దీపావళి పండుగను ఆసరాగా చేసుకొని ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న స్వీట్స్ తయారీ కేంద్రాలు, షాపులపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. తెలంగాణ వ్యాప్తంగా దీపావళి పండుగ వేళ ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. స్వీట్ షాపుల్లో తనిఖీలు నిర్వహించి, నాణ్యతలేని, కల్తీ స్వీట్ల విక్రయాలపై ప్రజలకు షాక్ ఇచ్చారు. సుమారు 95 స్వీట్ షాపులను తనిఖీ చేయగా, అనేక చోట్ల ప్రమాదకర సింథటిక్ ఫుడ్ కలర్స్ వినియోగిస్తున్నట్లు తేలింది. స్వీట్లపై అలంకరణకు వాడే సిల్వర్ ఫాయిల్ కూడా నాన్-ఫుడ్ గ్రేడ్ నాణ్యతతో ఉందని, ఇది ఆరోగ్యానికి అత్యంత హానికరమని తేల్చారు.
చాలా తయారీ కేంద్రాల్లో అపరిశుభ్ర వాతావరణంలో, కల్తీ నెయ్యి, ఒకటికి పదిసార్లు వాడిన నూనెతో స్వీట్లు తయారు చేస్తున్నట్లు వెల్లడైంది. ముఖ్యంగా కోవా, జిలేబి, లడ్డూ వంటి పాల పదార్థాల్లో రసాయనాలను ఉపయోగించినట్లు గుర్తించారు. పలు చోట్ల గడువు ముగిసిన పదార్థాలు స్వీట్ల తయారీలో వాడుతున్నట్లు గుర్తించారు. స్వీట్ షాప్‌లలో అమ్మే వస్తువులకు ఎలాంటి లేబెల్, ఎక్స్ పైరీ డేట్ లేదని అధికారులు తెలిపారు. వంటశాలలు అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించారు. దీపావళి గిరాకీ ఎక్కువగా వస్తుందని నాసిరకంగా టన్నుల కొద్దీ స్వీట్స్ తయారు చేస్తుండటంతో ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉందని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు హెచ్చరించారు. నిబంధనలు పాటించని స్వీట్ షాప్స్ కి నోటీసులు, భారీ పెనాల్టీలు విధించినట్లు తెలిపారు. తనిఖీల్లో 60 కిలోల స్వీట్లు, 40 కిలోల బ్రెడ్ సీజ్ చేశారు.




