Hyderabad: ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా..? ఏబీవీపీ మహిళా కార్యకర్తను జుట్టు పట్టి
హైదరాబాద్‌లో దారుణ ఘటన వెలుగుచూసింది. మహిళా కానిస్టేబుల్స్. స్కూటీపై వెళ్తూ.. పరుగెడుతున్న యువతి జుట్టు పట్టుకుని లాగారు. యువతి కింద పడ్డా వదలలేదు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

హైదరాబాద్, జనవరి 24: తెలంగాణలో ఫ్రెండ్లీ పోలీసింగ్.. ఇది తరచుగా పోలీస్ ఉన్నతాధికారులు చెప్పేమాట. మరి కిందిస్థాయి సిబ్బంది ఏం చేస్తున్నారు? జుట్టుపట్టి లాగి కిందపడేస్తున్నారు.. కనికరం, దయ లేకుండా పోలీస్ మార్క్ ట్రీట్‌మెంట్‌ను కళ్లకు కడుతున్నారు. హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో ఆందోళన చేస్తోన్న ఏబీవీపీ కార్యకర్తలపై మహిళా పోలీసుల దురుసు ప్రవర్తన అందర్నీ నివ్వెరపోయేలా చేసింది. వ్యవసాయ ఉద్యాన వర్సిటీ భూముల జీవో నెంబర్ 55ను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని విద్యార్థులు ఆందోళనకు దిగారు. వారికి మద్దతు పలుకుతూ ఏబీవీపీ కార్యకర్తలు ఆందోళనలో పాల్గొన్నారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న ఏబీవీపీ మహిళా కార్యకర్తపై లేడీ కానిస్టేబుల్స్ వ్యవహరించిన తీరు షాక్‌కి గురిచేసింది.
పరుగెడుతున్న మహిలా కార్యకర్తను బైక్‌పై ఫాలో అవుతూ ఆమె జుట్టుపట్టి కిందపడేశారు లేడీ కానిస్టేబుళ్లు. జాలి, దయ లేకుండా జుట్టు పట్టి లాక్కెళ్లే ప్రయత్నం చేశారు. వద్దూ వద్దని ప్రాధేయపడ్డా పోలీసులు కనికరించలేదు. ఈ దృశ్యాన్ని గమనించిన తోటి కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో కొద్దిసేపు పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
సాటి మహిళ అని కూడా చూడకుండా లేడీ కానిస్టేబుల్ వ్యవహరించిన తీరు.. సభ్య సమాజం అవాక్కయ్యేలా చేసింది. ఆందోళన చేస్తే అణచివేస్తారా..? అణచివేయాలనుకుంటే ఇలా నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తారా.. అని ప్రశ్నిస్తున్నారు ఏబీవీపీ కార్యకర్తలు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే అర్థం ఇదేనా అని నిలదీస్తున్నారు. వ్యవసాయ ఉద్యాన వర్సిటీకి చెందిన దాదాపు వంద ఎకరాలను.. హైకోర్ట్ భవనాలకు కేటాయిస్తూ ప్రభుత్వం జీవో నెంబర్ 55ను తీసుకొచ్చింది. ఈ జీవోను వెనక్కి తీసుకోవాలని విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలోనే పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. ఈ ఘటనపై పోలీస్ ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…
