Hyderabad: బాబోయ్ ఇన్ని ఆస్తులా..! జాయింట్ సబ్‌రిజిస్ట్రార్ గుట్టు రట్టు చేసిన ఏసీబీ
రంగారెడ్డి జిల్లాలో సస్పెండ్ అయిన జాయింట్ సబ్‌రిజిస్ట్రార్ కందడి మధుసూదన్ రెడ్డిపై తెలంగాణ ఏసీబీ దాడులు నిర్వహించింది. కాప్రాలోని నివాసంతో పాటు బంధువులు, సన్నిహితులకి చెందిన ఎనిమిది ప్రాంతాల్లో జరిగిన సోదాల్లో రూ.7.83 కోట్ల విలువైన మించిన లెక్కచూపని ఆస్తులు వెలుగులోకి వచ్చాయి.

తెలంగాణ అవినీతి నిరోధక శాఖ శుక్రవారం రంగారెడ్డి జిల్లాలో భారీ దాడులు నిర్వహించింది. సస్పెండ్ అయిన జాయింట్ సబ్‌రిజిస్ట్రార్ కందడి మధుసూదన్ రెడ్డి అక్రమంగా సంపాదించిన ఆస్తులపై ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు చేపట్టారు. ఈ దాడుల్లో దాదాపు రూ.7.83 కోట్ల విలువైన అక్రమ ఆస్తులు వెలుగులోకి వచ్చినట్లు ఏసీబీ తెలిపింది. కాప్రాలోని మధుసూదన్ రెడ్డి నివాసంతో పాటు అతని బంధువులు, సన్నిహితుల పేరిట ఉన్న మొత్తం ఎనిమిది ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో కాప్రా, ఈసీఐఎల్ పరిధిలోని భవానీనగర్ కాలనీలో ఉన్న జీ+2 ట్రిప్లెక్స్ ఇల్లు, ఇబ్రహీంపట్నం మండలం చింతపల్లి గూడ గ్రామంలో ఓపెన్ ప్లాట్, పారిగి మండలం నస్కల్ గ్రామంలో 27 ఎకరాల వ్యవసాయ భూమి బయటపడింది.
అలాగే ఇబ్రహీంపట్నం మండలం మంగళపల్లి గ్రామంలో ఒక ఎకరం కమర్షియల్ ల్యాండ్, పరిగి మండలం నస్కల్ గ్రామంలో రూ.1.24 కోట్ల విలువ కలిగిన స్విమ్మింగ్ పూల్‌తో కూడిన ఫామ్‌హౌస్ ఉన్నట్లు గుర్తించారు. వీటితో పాటు సుమారు రూ.9 లక్షల నగదు, 1.2 కిలోల బంగారు ఆభరణాలు, ఇన్నోవా ఫార్చునర్, వోల్వో XC60 B5, వోక్స్వాగన్ టైగన్ GT ప్లస్ కార్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.ఇంతేకాకుండా ARK స్పిరిట్స్ అనే మద్యం వ్యాపారంలో రూ.80 లక్షలు పెట్టుబడి పెట్టినట్లు, భార్యా పిల్లల పేర్లతో రెండు షెల్ కంపెనీలు ఏర్పాటు చేసినట్లు ఏసీబీ వెల్లడించింది. డాక్యూమెంట్స్ విలువతో పోలిస్తే మార్కెట్ విలువ మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మధుసూదన్ రెడ్డిపై అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇంకా ఇతర ఆస్తులపై కూడా విచారణ కొనసాగుతోందని ఏసీబీ స్పష్టం చేసింది.
ప్రభుత్వ ఉద్యోగులు లంచాలు అడిగితే ప్రజలు భయపడకుండా ఫిర్యాదు చేయాలని ఏసీబీ కోరింది. ఇందుకు టోల్‌ఫ్రీ నంబర్ 1064, వాట్సాప్ 9440446106, తెలంగాణ ఏసీబీ ఫేస్‌బుక్ పేజీ లేదా అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని సూచించింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
