Telangana: ఏసీబీకి చిక్కిన మరో అవినీతి తిమింగలం.. ఆస్తుల విలువ తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
తెలంగాణను అవినీతి రహిత రాష్ట్రంగా మార్చాలనే ఉద్దేశంతో ఏసీబీ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా అవినీతి అధికారుల అంతు తేల్చేందుకు వరుస దాడులు చేస్తున్నారు. తాజాగా జరిగిన దాడుల్లో మరో అవినీతి అధికారిని ఏసీబీ అధికారులకు పట్టుకున్నారు.

తెలుగురాష్ట్రాల్లో వరుసగా అవినీతి అధికారుల బండారాలు బయటకొస్తున్నాయి. తాజాగా ACB అధికారుల దాడుల్లో మరో అవినీతి అధికారికి సంబంధించి భారీ అక్రమాస్తులు బయటపడ్డాయి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆర్డీవో కార్యాలయంలో డివిజనల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గా పనిచేస్తున్న తహసీల్దార్ దేశాని శ్రీనివాస్‌రెడ్డికి సంబంధించిన ఏడు ప్రాంతాల్లో గురువారం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో అధికారిక లెక్కల ప్రకారం సుమారు రూ.6.87 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించినట్లు ఏసీబీ వెల్లడించింది.
అవినీతి, అనుమానాస్పద మార్గాల్లో ఆదాయానికి మించిన ఆస్తులను కూడబెట్టినట్లు ఆరోపిస్తూ శ్రీనివాస్‌రెడ్డిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసినట్లు ఏసీబీ తెలిపింది. కర్మన్‌ఘాట్‌లోని రెండు రెసిడెన్షియల్ ఫ్లాట్లకు సంబంధించిన పత్రాలను అధికారులు గుర్తించారు. వీటి విలువ సుమారు రూ.2.60 కోట్లు కాగా, అదే ప్రాంతంలో ఉన్న జీ+3 పెంట్‌హౌస్ విలువ రూ.1.60 కోట్లుగా గుర్తించారు.
అలాగే యాచారం మండలం నల్లవెల్లి గ్రామంలో 10 ఎకరాల వ్యవసాయ భూమికి సంబంధించిన పత్రాలు కూడా లభించాయి. దీని విలువ సుమారు రూ.25 లక్షలుగా అధికారులు పేర్కొన్నారు. నగర పరిధి, శివారు ప్రాంతాల్లో పలు చోట్ల ఉన్న ఎనిమిది ఓపెన్ ప్లాట్లకు సంబంధించిన పత్రాలను కూడా ఏసీబీ స్వాధీనం చేసుకుంది. వీటి విలువ సుమారు రూ.62 లక్షలుగా తేలింది. బాలాపూర్‌లోని నరేంద్ర బార్ అండ్ రెస్టారెంట్‌లో ఇతర భాగస్వాములతో కలిసి శ్రీనివాస్‌రెడ్డి రూ.86 లక్షలు పెట్టుబడి పెట్టినట్లు ఏసీబీ గుర్తించింది.
అయితే అధికారికంగా లెక్కించిన విలువ కంటే ఈ ఆస్తుల మార్కెట్ విలువ మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఆస్తుల పత్రాలతో పాటు రూ.4 లక్షల నగదు, 680 గ్రాముల బంగారు ఆభరణాలు లభించాయి. వీటి విలువ సుమారు రూ.5.85 లక్షలుగా ఏసీబీ పేర్కొంది. బ్యాంకు ఖాతాల్లో రూ.8.60 లక్షల డిపాజిట్లు ఉన్నట్లు గుర్తించారు. అలాగే బైక్, కారు కలిపి సుమారు రూ.59 లక్షల విలువైన వాహనాలు ఉన్నట్లు తేలింది.
ఇంట్లో రూ.11 లక్షల విలువైన గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులను కూడా అధికారులు గుర్తించారు. ఇదే సమయంలో 46 తులాల బంగారాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టి శ్రీనివాస్‌రెడ్డి గోల్డ్ లోన్ తీసుకున్నట్లు ఏసీబీ వెల్లడించింది. సోదాల్లో లభించిన పత్రాలు, ఆస్తులకు సంబంధించి మరింత లోతుగా పరిశీలన కొనసాగుతోందని అధికారులు తెలిపారు. అదనపు ఆస్తులు ఏమైనా ఉన్నాయా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.
శ్రీనివాస్‌రెడ్డిపై గతంలోనూ ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదైనట్లు ఏసీబీ తెలిపింది. 2009లో మహేశ్వరం మండల తహసీల్దార్ ఆఫీసులో మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న సమయంలో ఆయనపై డీఏ కేసు నమోదైంది. తాజాగా మరోసారి భారీగా ఆస్తులు గుర్తించడంతో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
