AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ‘ఆపరేషన్ తెలంగాణ’.. ఆ 7 రోజులు కాంగ్రెస్ గేమ్‌ ప్లాన్ ఇదే.. కీలక నేతలంతా..!

పోలింగ్ చివరి వారం కాంగ్రెస్‌కి కలిసి రానుందా.? ఆ 7 రోజులు కాంగ్రెస్ కీలక నేతలంతా తెలంగాణలో ఉండనున్నారా.? ఆపరేషన్ తెలంగాణ పేరుతో సునీల్ కనుగొలు కొత్త అస్త్రాన్ని వదలనున్నారా.? తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా అధిష్టానం కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండటంతో తామే గెలుస్తామనే..

Telangana: 'ఆపరేషన్ తెలంగాణ'.. ఆ 7 రోజులు కాంగ్రెస్ గేమ్‌ ప్లాన్ ఇదే.. కీలక నేతలంతా..!
Ts Congress
Follow us
TV9 Telugu

| Edited By: Ravi Kiran

Updated on: Oct 30, 2023 | 12:24 PM

పోలింగ్ చివరి వారం కాంగ్రెస్‌కి కలిసి రానుందా.? ఆ 7 రోజులు కాంగ్రెస్ కీలక నేతలంతా తెలంగాణలో ఉండనున్నారా.? ఆపరేషన్ తెలంగాణ పేరుతో సునీల్ కనుగొలు కొత్త అస్త్రాన్ని వదలనున్నారా.? తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా అధిష్టానం కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండటంతో తామే గెలుస్తామనే కాన్ఫిడెన్స్‌లో ఉన్నారు హస్తం నేతలు. మరోవైపు కాంగ్రెస్ జాతీయ స్థాయి అగ్రనేతలు సైతం తెలంగాణలో పాగా వేసేందుకు నేరుగా రంగంలోకి దిగుతున్నారు. ఇప్పటికే అగ్రనేత రాహుల్ గాంధీ పలుమార్లు తెలంగాణలో పర్యటించడంతో పాటు ఇటీవలే మూడు రోజుల పాటు పార్టీ బలహీనంగా ఉన్న ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పర్యటించి క్యాడర్‌లో కొత్త జోష్ తీసుకొచ్చారు. తెలంగాణకి ఎంత సమయం ఇవ్వడానికైనా తాను సిద్ధమని రాహుల్ ప్రకటించారు. మరోవైపు రాష్ట్ర నేతలు సైతం డోర్ టూ డోర్ ప్రచారంలో భాగంగా ఆరు గ్యారెంటీ స్కీమ్స్‌ను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత తమకి అనుకూలంగా మారుతుండడంతో ప్రజల్లోకి మరింత బలంగా దూసుకెళ్లేందుకు కాంగ్రెస్ నేతలు వ్యూహాలు రచిస్తున్నారు.

ఇప్పటికే మొదటి దశ బస్సు యాత్రతో జోష్‌లో ఉన్న కాంగ్రెస్ నాయకులు.. 28న రెండవ విడత బస్సు యాత్రకి శ్రీకారం చుట్టారు. ఈ బస్సు యాత్రలో ఇప్పటికే రాహూల్ గాంధీతో పాటు డీకే శివకుమార్ పాల్గొనగా.. ప్రియాంక గాంధీ, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య కూడా పాల్గొనబోతున్నట్టు సమాచారం. ఉమ్మడి మెదక్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఈ యాత్ర ఉండేలా సునీల్ అండ్ టీం రూట్ మ్యాప్ సిద్ధం చేశారు.

మరోవైపు 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఆ 5 రాష్ట్రాలపై కూడా కాంగ్రెస్ ఫోకస్ చేస్తోంది. అన్ని రాష్ట్రాల పోలింగ్ అయిపోయిన వారం తర్వాత తెలంగాణ పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఆ వారం రోజులను తెలంగాణ కాంగ్రెస్ వాడుకోవాలని వ్యూహాలను రచిస్తోంది. చివరి వారం రోజుల ఆపరేషన్‌పై అధిష్టానం ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తోంది. నవంబర్ 23న రాజస్థాన్‌లో ఎన్నికలు ముగియనున్నాయి. 21తో ఆ రాష్ట్రంలో ప్రచారం ముగుస్తుండడంతో 22 నుంచి ఏఐసీసీ పెద్దలంతా తెలంగాణలోనే ఉండనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ, ఖర్గేలతో పాటు కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రులు, వివిధ రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రులు, మాజీ కేంద్ర మంత్రులు మొత్తం తెలంగాణలోనే మకాం వేసేలా అధిష్టానం రూట్‌మ్యాప్ చేస్తోంది.

కీలక నేతలందరితో చివరి వారం రోజులు అన్ని నియోజకవర్గాలను కవర్ చేసేలా సునీల్ అండ్ టీం ఆధ్వర్యంలో రూట్ మ్యాప్ సైతం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వారం రోజులు కాంగ్రెస్ అగ్రనేతలు తెలంగాణాలోనే ఉండడం తమ విజయానికి ఉపయోగపడుతుందని హస్తం నేతలు భావిస్తున్నారు. అభ్యర్థుల ప్రకటన అలస్యంతో ప్రచారంలో వెనకబడ్డ కాంగ్రెస్ చివరి వారం రోజుల పాటు దాన్ని అధిగమిస్తుందనే ఆలోచనలో హస్తం నేతలు ఉన్నారు. ఇక ఈ ఆపరేషన్ తెలంగాణ ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..