Hyderabad: హైదరాబాదీస్ బీ అటెన్షన్.! 18 గంటలు మంచినీటి సరఫరా బంద్.. ఎక్కడెక్కడంటే.?
హైదరాబాదీలు బీ అటెన్షన్.! సిటీలోని పలు ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం కలగనుంది. మరి ఆ ప్రాంతాలు ఏంటి.? ఏయే రోజుల్లో నీటి సరఫరా బంద్ కానుంది.? ఆ వివరాలు ఏంటి.? ఈ స్టోరీలో ఓ సారి చూసేద్దాం. ఓ లుక్కేయండి మరి.

హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ) ఆధ్వర్యంలో ప్యారడైజ్ జంక్షన్ నుంచి డెయిరీ ఫార్మ్ రోడ్ వరకు(NH–44) నిర్మాణంలో ఉన్న ఎలివేటెడ్ కారిడార్ పనుల భాగంగా, ప్యారడైజ్ జంక్షన్ వద్ద ఉన్న జలమండలికి చెందిన 800 మిమీ డయా ఎంఎస్ పైప్‌లైన్ విస్తరణ పనులను హెచ్ఎండీఏ చేపడుతోంది. ఈ నేపథ్యంలో, మారేడ్‌పల్లి నుంచి కంట్రోల్ రూమ్ వరకు ఉన్న ఎంఎస్ పైప్‌లైన్‌ను కొత్తగా వేసిన పైప్‌లైన్‌తో స్పోర్ట్స్ గ్రౌండ్, లీ-రాయల్ జంక్షన్, బాలంరాయి వద్ద అనుసంధానం చేయడానికి హెచ్ఎండీఏ జంక్షన్ పనులను చేపడుతోంది. ఈ పనులు 27వ తేదీ, సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 28వ తేదీ మంగళవారం ఉదయం 6 గంటల వరకు మొత్తం 18 గంటల పాటు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. కాబట్టి ఈ 18 గంటల వరకు కింద ఉన్న రిజర్వాయర్ల పరిధిలో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుంది.
అంతరాయం ఏర్పడే ప్రాంతాలు:
1. నల్లగుట్ట, ప్రకాశ్‌నగర్, మేకలమండి, బౌద్ధనగర్, శ్రీనివాసనగర్, పాటిగడ్డ రిజర్వాయర్ పరిధి ప్రాంతాలు.
2. భోలక్ పూర్, కవాడిగూడ, సీతాఫల్ మండి ప్రాంతాలు.
3. హస్మత్‌పేట్, ఫీరోజ్‌గూడ, గౌతమ్‌నగర్ ప్రాంతాలు.
4. బల్క్ వినియోగదారులు: సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్(SCR), మిలిటరీ ఇంజినీరింగ్ సర్వీసెస్(MES), బేగంపేట్ విమానాశ్రయం.
5. బాలంరాయి పంప్‌హౌస్, బాలంరాయి చెక్‌పోస్ట్, బోయిన్‌పల్లి మరియు AOC రైల్వే కాలనీ(SCB పరిధిలోని ప్రాంతాలు).
నీటి సరఫరాలో అంతరాయం కలగనున్న ప్రాంతాల్లోని వినియోగదారులు నీటి వాడకంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జలమండలి అధికారులు ప్రకటన విడుదల చేశారు.
