AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Heavy Rain: నగరంలో నాలుగు గంటలు నాన్‌స్టాప్‌ వర్షం.. రాత్రంతా వాన నీటిలోనే నానిన మహా జనం..

నాలుగు గంటల ఎడతెరపిలేని వాన.. నదుల్లా రోడ్లు... నట్టేట మునిగిన కాలనీలు.. పిల్లా పెద్ద కంటిమీద కునుకులేదు. వరదనీటితో కాలరాత్రిలా మారిన కన్నీటి కష్టాలు. వర్షం సృష్టించిన బీభత్సానికి.. రాత్రంతా లోతట్టు కాలనీల జనానికి జాగారమే.

Heavy Rain: నగరంలో నాలుగు గంటలు నాన్‌స్టాప్‌ వర్షం.. రాత్రంతా వాన నీటిలోనే నానిన మహా జనం..
Heavy Rain
Sanjay Kasula
|

Updated on: Oct 13, 2022 | 7:37 AM

Share

గ్రేటర్ హైదరాబాద్‌లో రాత్రి వర్షం దంచి కొట్టింది. నగరంలో మబ్బులు విరిగిపడ్డాయా? లేదంటే ఉన్న పళంగా వరుణుడు దండెత్తాడా అనే రేంజ్‌లో.. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. ఓటర్ రింగ్ రోడ్డు పరిధిలో వాన బీభత్సం సృష్టించింది. నగరంలోని అన్ని ప్రాంతాలను భారీ వర్షం ముంచెత్తింది.  కూకట్ పల్లి నుంచి మొదలు కొహెడ వరకు.. సికింద్రాబాద్ నుంచి శంషాబాద్ వరకు.. ఏ ఒక్క ప్రాంతాన్నీ వరుణుడు వదిలిపెట్టలేదు. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ఆరు జోన్లలోనూ భారీ వర్షం కురిసింది. రాత్రి 8 గంటల ప్రాంతంలో స్టార్ట్ అయిన వాన అర్ధరాత్రి 12 వరకు కురిసింది. దీంతో ముంపు కాలనీలు గజగజా వణికిపోయాయి. అత్యధిక వర్షపాతం 10 సెంటిమీటర్లు దాటగా.. సరాసరి 5 సెంటిమీటర్లకు పైగా వర్షం కురిసింది.

తినడానికి తిండి, పడుకోవాడానికి కాసింత జాగా కూడా లేకుండా ఇంట్లోని అందరికి కాలరాత్రిని మిగిల్చింది రాత్రి కురిసిన వాన. ఇంట్లోకి చేరిన వాన నీటిలో ఓ కుటుంబం రాత్రంతా వరద నీటిలో నిలబడే ఉంది. ఇంకెన్నాళ్లు మాకీ నరకయాతన అంటూ లోతట్టు ప్రాంతాల ప్రజలు ఆవేదనలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు.

అయితే, బాలానగర్ సమీపంలోని చింతల్, జీడిమెట్ల, గాజులరామారం సైడ్ ముంపు కాలనీలు నట్టేట మునిగాయి. నాలాల్లో పారాల్సిన నీరు.. రోడ్లపై పరిగెడుతూ ఇళ్లలో దూరింది. చింతల్ మెయిన్ రోడ్డు ఓ మహానదినే తలపించింది.

బాలానగర్‌, కూకట్‌పల్లిలో అత్యధికంగా 10.4 సెం.మీ వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత తిరుమలగిరిలో 9.55 సెం.మీ.. బొల్లారంలో 9.43 సెం.మీ.. వెస్ట్ మారేడుపల్లి 9.33 సెం.మీ.. కుత్బుల్లాపూర్ 9.20 సెం.మీ.. ఆర్సీపురం 9.08 సెం.మీ.. భగత్ సింగ్ నగర్ 8.85 సెం.మీ వర్షపాతం కురిసింది.

సికింద్రాబాద్‌, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, అమీర్‌పేట్‌, బోరబండ, రహ్మత్‌నగర్‌, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ కాలనీ, నిజాంపేట్‌, ప్రగతినగర్‌, నాంపల్లి, లక్డీకపూల్‌ ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. రోడ్లపైకి భారీగా వరద చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. ఎర్రగడ్డ మెట్రో స్టేషన్‌ కింద భారీగా వరద నీరు చేరడంతో ఇరువైపులా కిలో మీటర్‌ మేర వాహనాలు ఆగిపోయాయి.

బోరబండలో అపార్ట్‌మెంట్‌ సెల్లార్లలోకి వరద నీరు చేరింది. బోరబండలో వరద ప్రవాహంలో ఆటోలు, బైక్‌లు కొట్టుకుపోయాయి. ఇళ్లముందు పార్క్‌ చేసిన వాహనాలు కూడా వరదలో కొట్టుకుపోయాయి. రహమత్ నగర్, బోరబండలోని లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. రసూల్‌పురాలోనూ ఇళ్లలోకి నీరు చేరింది.

ఇంత పెద్ద వర్షం వచ్చినా మాన్ సూన్ బృందాలు, డీఆర్‌ఎఫ్ టీమ్స్, జీహెచ్ఎంసీ సిబ్బంది ఎక్కడా కనిపించలేదు. లోతట్టు కాలనీలను అప్రమత్తం చేయడం కానీ, వారికి సహాయం అందించలేదని బాధితులు ఆరోపిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం