Hyderabad: పాతబస్తీ మెట్రో ప్రాజెక్టులో కీలక ముందడుగు.. వారందరికీ పరిహారం చెక్కులు
హైదరాబాద్ పాతబస్తీలో మెట్రో పరుగులు పెట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. పాతబస్తీ మెట్రో ప్రాజెక్ట్ భూసేకరణలో కీలక ఘట్టానికి సోమవారం తెర లేవనుంది. మెట్రో విస్తరణలో ఆస్తులు కోల్పోతున్న వారికి నష్ట పరిహారం అందించే కార్యక్రమంతో ప్రాజెక్ట్ పట్టాలెక్కుతోంది. పూర్తి డీటేల్స్ తెలుసుకుందాం పదండి...
హైదరాబాద్ పాతబస్తీలో మెట్రో ట్రైన్… కూ చుక్‌చుక్ అని వెళ్లడానికి లైన్ క్లియర్ అవుతోంది. ఇన్నాళ్లు రెండడుగులు ముందుకి, మూడడుగులు వెనక్కి అన్నట్లు సాగిన వ్యవహారంలో కీలక ముందడుగు పడింది. ఈ ప్రాంతంలో మెట్రో విస్తరణలో ఆస్తులు కోల్పోతున్నవారికి చెక్కులు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీంతో.. ఆ ఆస్తులు ఇకపై.. హైదరాబాద్ మెట్రోకు సొంతం కానున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో భాగ్యనగరంలో మెట్రో మూడో దశ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా.. ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణ గుట్ట మార్గంలో భూ సేకరణ పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు. పాత నగరానికి మెట్రో విస్తరించాలని, అక్కడి చారిత్రక ప్రాంతాలకు పర్యాటకుల రాకపోకలకు మార్గం సుగమం చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. దాంతో పాటే.. ఆ ప్రాంతాన్ని మిగతా నగరంతో మెట్రో ద్వారా అనుసంధానించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
చదరపు గజానికి రూ. 81 వేల పరిహారం
ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు నిర్మించనున్న 7 కిలోమీటర్ల మెట్రో రైలు మార్గంలో ఇప్పటివరకు 1,100కు పైగా ప్రభావిత ఆస్తులను అధికారులు గుర్తించారు. వీటి స్వాధీనానికి హైదరాబాద్ జిల్లా కలెక్టర్ నోటిఫికేషన్ జారీ చేయడంతో, ఆయా ఆస్తుల యాజమానులతో హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో లిమిటెడ్ చర్చలు జరిపింది. ఆస్తులను అప్పగించిన వారికి చదరపు గజానికి రూ.81 వేలు ఇచ్చేందుకు అధికారులు నిర్ణయించగా.. యజమానులతో సంప్రదింపులు జరుపుతున్నారు. దీనిలో భాగంగా.. ఇప్పటికే ఆస్తులను స్వాధీనం చేసేందుకు అనుమతి పత్రాలు సమర్పించిన 169 మందికి రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం కింద చెక్కుల్ని అందజేయనుంది. ఆస్తుల యజమానులకు.. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ చెక్కుల్ని అందజేయనున్నారు.
చెక్కులు ఇచ్చాక కూల్చివేతలు షురూ
ఆస్తుల స్వాధీనానికి అనుమతి పత్రాలు సమర్పించి, నష్టపరిహార చెక్కుల్ని అందుకున్న తర్వాత.. ఆయా స్థలాల్లోని నిర్మాణాల్ని కూల్చే పనుల్ని ప్రారంభించనున్నట్లు హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ మెట్రో అథారిటీ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. భూసేకరణ చట్టం ప్రకారమే స్థలాల సేకరణ, నష్టపరిహారం చెల్లింపులు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. కాగా.. ఈ ప్రాంతంలోని మతపరమైన, సున్నిత ప్రాంతాలకు ఎలాంటి హాని కలగకుండానే మెట్రో నిర్మాణం చేపడతామని ప్రకటించిన NVS రెడ్డి.. మెట్రో రైల్ నిర్మాణంతో ఓల్డ్ సిటీకి కొత్త అందాలు వస్తాయన్నారు. దీనితో పాటు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని, పాత నగరం…కాలుష్య రహితంగా తయారవుతుందని ఆయన తెలిపారు.