Hyderabad: ప్రియుడు… భర్తను సజీవ దహనం చేస్తుంటే.. వీడియో కాల్ లైవ్‌లో చూసిన భార్య
జగద్గిరిగుట్ట జిమ్ ట్రైనర్ జయకృష్ణ అనుమానాస్పద మృతి కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను భార్య హత్య చేసింది. భర్త సజీవ దహనం అవుతుంటే వీడియో కాల్ లైవ్‌లో చూసి ఆనందించింది.
జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ కమల ప్రసన్న నగర్‌లో ఈ నెల 10వ తేదీన మృతి చెందిన జిమ్ కోచ్ జయకృష్ణ కేసు మిస్టరీని పోలీసులు చేధించారు. అది పక్కా హత్యే అని తేల్చేశారు. అక్రమ సంబంధం నేపథ్యంలో మరో జిమ్ కోచ్ అడ్డాల చిన్న, మృతుడి భార్య దుర్గాభవానితో కలిసి హత్యకు పాల్పడినట్లు గుర్తించారు. హత్య అనంతరం అగ్నిప్రమాదంలో అతడు మృతి చెందినట్లు సీన్ క్రియేట్ చేశారు. కానీ జయకృష్ణ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయగా చిన్న, దుర్గాభవానిల చీకటి బాగోతం బట్టబయలు అయ్యింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కృష్ణా జిల్లా మట్లం గ్రామానికి చెందిన జయకృష్ణ, దుర్గభవానిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ముగ్గురు సంతానం. అతడు ఫ్యామిలీతో కలిసి హైదరాబాద్ వచ్చి.. జగద్గిరిగుట్ట పరిధిలో జిమ్ రన్ చేస్తున్నాడు. జయకృష్ణకు తోటి జిమ్ కోచ్ అయిన అడ్డాల చిన్నతో స్నేహం ఏర్పడింది. ఆ పరిచయంతో జయకృష్ణ ఇంటికి వచ్చి వెళ్లేవాడు చిన్న. ఈ క్రమంలోనే 2018 నుండి జయకృష్ణ భార్య దుర్గాభవానితో అక్రమ సంబంధం నెరపుతున్నాడు. ఈ నెలలో ఇల్లు ఖాళీ చేసి సొంత గ్రామానికి వెళ్ళిపోదాం అని నిశ్చయించుకున్నాడు జయకృష్ణ. కొద్దిరోజుల క్రితం భార్య పిల్లలను ఊరికి పంపించి వేశాడు. జయకృష్ణ ఉంటే తాము ఇక కలుసుకోలేమని, అతడిని అడ్డు తొలగించేందుకు చిన్న, దుర్గ భవానిలు పన్నాగం పన్నారు. ఈ నెల 10వ తేదీన జయకృష్ణకు ఫుల్లుగా మద్యం తాపించిన చిన్న, అతడు మత్తులోకి జారుకోగానే, బెడ్రూంలో మంచంపై పడుకోపెట్టి పెట్రోల్ పోసి నిప్పంటించి, అగ్నిప్రమాదంలో ప్రమాదవశాత్తూ మృతి చెందినట్లు పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టి హత్యకు పాల్పడిన దుర్గాభవాని, చిన్నలను అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు.
అయితే నిందితుల విచారణలో దిమ్మతిరిగే విషయాలు వెలుగులోకి వచ్చాయి. భర్త సజీవ దహనం అవ్వడాన్ని వీడియో కాల్ లైవ్‌లో చూసి ఆనందించింది భార్య దుర్గాభవాని. పోలీసులకు దొర్కకుండా హత్య చేయాలని ప్రియుడికి పలు సలహాలు కూడా ఇచ్చినట్లు తెలిసింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.