AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

New Auto Rules: డ్రైవరన్నలకు అలర్ట్.. హైదరాబాద్‌లో మారిన ఆటో రూల్స్.. ఇవి తెలుసుకోండి..

హైదరాబాద్ నగరంలో ఆటో రిక్షాల వినియోగంలో కీలక మార్పులు రానున్నాయి. ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్‌) లోపల సరికొత్త సీఎన్‌జీ, ఎల్‌పీజీ, విద్యుత్ ఆటో రిక్షాలకు అనుమతిస్తూ రవాణా శాఖ కమిషనర్ సురేంద్ర మోహన్ ఆదివారం (జులై 6న) ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విడుదల చేసిన ప్రభుత్వ ఉత్తర్వు (జీవో) ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. మారిన రూల్స్ ఇలా ఉన్నాయి..

New Auto Rules: డ్రైవరన్నలకు అలర్ట్.. హైదరాబాద్‌లో మారిన ఆటో రూల్స్.. ఇవి తెలుసుకోండి..
New Auto Rules In Hyderabad
Bhavani
|

Updated on: Jul 07, 2025 | 9:49 PM

Share

ఓఆర్‌ఆర్‌ లోపల నివసిస్తూ, ఆటో లైసెన్స్ కలిగి ఉన్న డ్రైవర్లు మాత్రమే ఈ అనుమతులకు అర్హులు. ఒక వ్యక్తి ఒకే ఆటోను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. తన పేరుపై మరే ఆటో లేదని దరఖాస్తుదారు తప్పనిసరిగా ధ్రువీకరణ పత్రం సమర్పించాలి. దరఖాస్తులు చేసుకున్నవారికి “ముందుగా వచ్చిన వారికి ముందు” అనే ప్రాతిపదికన అనుమతులు లభిస్తాయి. అనుమతి పొందిన తేదీ నుండి 60 రోజుల్లోపు సంబంధిత రవాణా శాఖ కార్యాలయంలో ఆటోను తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఈ గడువును దాటితే అనుమతి రద్దవుతుంది. ఈ అనుమతి పొందిన వాహనాలను రాష్ట్రంలోని ఏ ఆటో రిక్షా డీలర్ వద్దైనా కొనుగోలు చేయవచ్చు.

డీలర్ల బాధ్యతలు, సూచనలు:

ఆటో డీలర్లు కొనుగోలుదారుల పత్రాలను, డ్రైవింగ్ లైసెన్స్ వివరాలను నిశితంగా పరిశీలించి, ప్రభుత్వ నిబంధనల మేరకు తమ ఆన్‌లైన్ పోర్టల్‌లో నమోదు చేయాలి.

వాహనం అమ్మకపు ధరకంటే ఎక్కువ మొత్తానికి కొనుగోలుదారులకు విక్రయించకూడదు. అనుమతుల పేరుతో అదనపు రుసుములు వసూలు చేయడం, బ్లాక్ మార్కెట్‌లో అమ్మకాలు జరపడం వంటివి చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటారు.

నూతన ఈవీ పాలసీ: విద్యుత్ వాహనాలకు భారీ ప్రోత్సాహం!

కాలుష్య నియంత్రణ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన నూతన విద్యుత్ వాహనాల (ఈవీ) పాలసీతో ఈవీల కొనుగోలుదారులకు పెద్ద ఊరట లభించింది.

100% రాయితీ: రోడ్ పన్ను, వాహన రిజిస్ట్రేషన్ ఫీజుపై నూటికి నూరు శాతం మినహాయింపు ఇస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.

సంఖ్యపై పరిమితి లేదు: గతంలో ఈవీ పాలసీలో వాహనాల సంఖ్యపై పరిమితులు ఉండేవి. అయితే, ప్రస్తుత ప్రభుత్వం ఈ పరిమితులను పూర్తిగా ఎత్తివేసింది.

ఎవరికి వర్తింపు?: ఈ రాయితీ పథకం తెలంగాణ రాష్ట్ర పరిధిలో 2026 డిసెంబర్ 31 వరకు రిజిస్టర్ అయ్యే అన్ని రకాల విద్యుత్ వాహనాలకు (ద్విచక్ర వాహనాలు, కార్లు, వాణిజ్య ప్రయాణీకుల వాహనాలైన ట్యాక్సీలు, టూరిస్ట్ క్యాబ్‌లు, మూడు చక్రాల ఆటో రిక్షాలు, తేలికపాటి గూడ్స్ వాహనాలు, ట్రాక్టర్లు, బస్సులు) వర్తిస్తుంది. అవసరమైతే ఈ గడువును పొడిగించే అవకాశం ఉంది.

అదనపు పన్ను రద్దు: ఒక వ్యక్తి రెండో ఎలక్ట్రిక్ వాహనం కొనుగోలు చేస్తే చెల్లించాల్సిన అదనపు 2 శాతం పన్నును కూడా ఈ పాలసీలో మినహాయించారు.

జీవో జారీ: ఈవీ పాలసీ – 2025కి సంబంధించిన జీవో 41ని రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ జారీ చేశారు. భవిష్యత్ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏటా వందల కోట్ల రూపాయల ఆదాయాన్ని కోల్పోవడానికి సిద్ధపడినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.