Hyderabad: అసలుకే ఎసరొచ్చింది.. డబ్బు పోయిందని ఫిర్యాదు చేసిన వ్యాపారి.. సీన్ కట్ చేస్తే వెలుగులోకి అసలు విషయం
హైదరాబాద్ వనస్థలిపురం దోపిడీ కేసు అనూహ్య మలుపు తిరిగింది. దోపిడి కేసులో నిందితుడిని పట్టుకున్న పోలీసులు.. అతను చెప్పిన సమాచారంతో హవాలా లింకులన్నీ బయటపెట్టారు.

హైదరాబాద్ వనస్థలిపురం దోపిడీ కేసు అనూహ్య మలుపు తిరిగింది. దోపిడి కేసులో నిందితుడిని పట్టుకున్న పోలీసులు.. అతను చెప్పిన సమాచారంతో హవాలా లింకులన్నీ బయటపెట్టారు. రెండుకోట్ల రూపాయలు దోపిడీ చేసేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించాడని, ఈ ఘర్షణలో పాతికలక్షల కట్ట కిందపడిందని.. మిగతా కోటీ 75లక్షలతో నిందితుడు పారిపోయాడని వెంకట్రామిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంకట్రామిరెడ్డి కదలికలు తెలిసిన వ్యక్తే దోపిడీ చేసినట్లు హైదరాబాద్ పోలీసులు ఊహించారు. అదే నిజమైంది. వెంకట్రామిరెడ్డి తెలిసిన వ్యక్తే దోపిడీ చేశాడు. అతన్ని పట్టుకుని విచారిస్తే పోలీసులకు మైండ్ బ్లాంక్ అయ్యే ఆన్సర్స్ వచ్చాయి. వెంకట్రామిరెడ్డి హవాలా వ్యవహారాలు నడుపుతారని, ఆ డబ్బు కొట్టేసినా ఎవరికీ చెప్పుకోలేరనే ధైర్యంతోనే దోపిడీ చేసినట్లు సమాచారం. ఈలోగా మరో ట్విస్ట్ ఇచ్చాడు వెంకట్రామిరెడ్డి. పోయిన డబ్బు కోటీ 75లక్షలు కాదని, కేవలం 50లక్షలు అని ఫిర్యాదు మార్చాడు. నిందితుడు ఇచ్చిన సమాచారం, వెంకట్రామిరెడ్డి ఫిర్యాదులో మార్పుతో పోలీసుల్లో కొత్త అనుమానాలు మొదలయ్యాయి. ఈ ఉదయం నుంచి వెంకట్రామిరెడ్డి ఇంట్లో సోదాలు మొదలు పెట్టారు అధికారులు.
ఈ క్రమంలో ఫిర్యాదుదారు వెంకట్రామిరెడ్డి ఇంట్లో రూ.2.85కోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇంట్లో దొరికిన డైరీ ఆధారంగా పోలీసులు కూపీ లాగుతున్నారు. అతన్ని వాహనంలో ఎక్కించి డైరీ లింకులను పోలీసులు ఛేదిస్తున్నారు. డైరీలో ఉన్న సమాచారం ఆధారంగా మరోచోట రూ.కోటి స్వాధీనం చేసుకున్నారు. వెంకట్రామిరెడ్డికి ఫరూఖ్ అనే వ్యక్తితో హవాలా సంబంధాలు ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. దారిదోపిడీగా మొదలైన వ్యవహారంలో ఫిర్యాదుదారు వెంకట్రామిరెడ్డి పాత్రే ఇప్పుడు అత్యంత కీలకం. డబ్బు పోయిందని కంప్లైంట్ చేస్తే అసలుకే ఎసరొచ్చింది. మొత్తం హవాలా గుట్టు అంతా వీడుతోంది.
రెండు రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు అందగా.. పిర్యాదు చేసిన వెంకట్రామిరెడ్డి ఇంట్లోనే పోలీసులు సోదాలు నిర్వహించారు. ఆ డబ్బురు రెండు బార్‌షాపులు, ల్యాండ్ సంబంధిత మనీగా వెంకట్రామిరెడ్డి చెప్పాడు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దోపిడీదారుడిని పోలీసులు పట్టుకున్నారు. ఆ తర్వాత నిందితుడు వెంకట్రామిరెడ్డి హవాలా వ్యవహారాలను బయటపెట్టడంతో అసలు వివరాలు వెలుగులోకి వచ్చాయి.




మరిన్ని తెలంగాణ వార్తల కోసం..
