Hyderabad: భాగ్యనగరంలో భారీ వర్షం.. విరిగిపడ్డ చెట్లు.. రోడ్లపైకి వరద నీరు.. భారీగా స్తంభించిన ట్రాఫిక్!
హైదరాబాద్‌లో మరోసారి భారీ వర్షం దంచికొట్టింది. కుండపోత వానతో పలు ప్రాంతాల్లో రోడ్లు జలమయం అయ్యాయి. అటు.. వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అలర్ట్ అయింది. రోడ్లపై భారీగా వరద నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. పోలీసులు ట్రాఫిక్ మళ్లించి.. డీఆర్ఎఫ్ టీమ్‌తో కలిసి సహాయ చర్యలు చేపట్టారు.

హైదరాబాద్‌లో మరోసారి భారీ వర్షం దంచికొట్టింది. కుండపోత వానతో పలు ప్రాంతాల్లో రోడ్లు జలమయం అయ్యాయి. అటు.. వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అలర్ట్ అయింది.
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలను వర్షం మళ్లీ ముంచెత్తింది. నగరంలోని పలు ప్రాంతాల్లో చిరు జల్లులతో ప్రారంభమైన వర్షం క్రమంగా ఎక్కువైంది. గచ్చిబౌలి, మాదాపూర్, బోరబండ, ఎస్సాఆర్‌నగర్, రహ్మత్‌నగర్, ఎర్రగడ్డలోనూ భారీ వర్షం కురిసింది. చందానగర్, మియాపూర్, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, పటాన్‌చెరు, అమీన్‌పూర్, బీహెచ్ఈఎల్ ప్రాంతాల్లో వాన పడింది. లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి కింద భారీగా వరద నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. పోలీసులు ట్రాఫిక్ మళ్లించి.. డీఆర్ఎఫ్ టీమ్‌తో కలిసి సహాయ చర్యలు చేపట్టారు.
అటు.. బషీర్‌బాగ్, హిమాయత్‌నగర్, అబిడ్స్, నాంపల్లి, మలక్‌పేట, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్, వనస్థలిపురం, ఉప్పల్ పరిసరాల్లోనూ భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షానికి ఎల్బీనగర్‌లో చెట్లు విరిగిపడడంతో ట్రాఫిక్ జామ్ అయింది. ఘటనాస్థలానికి చేరుకుని విరిగిపడిన చెట్లను తొలగించారు డీఆర్ఎఫ్ సిబ్బంది. ఎల్బీనగర్-సాగర్ రోడ్డు వరద నీటితో చెరువును తలపించింది. అలాగే.. హస్తినాపురం సంతోషిమాత టెంపుల్ రోడ్డు జలమయమైంది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షానికి పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపడడంతో.. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
ఇక.. భారీ వర్షం కారణంగా రోడ్లపైకి వరద నీరు చేరడంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. సాయంత్రం వేళ నగరవాసులు ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో అవస్థలు పడ్డారు. మరోవైపు.. వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అలర్ట్ అయింది. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సహాయక చర్యలు చేపట్టాలని సూచించింది. ఇక.. రెండు రోజుల క్రితం కూడా హైదరాబాద్‌లో కుండపోత వర్షం కురిసింది. భారీ వర్షానికి మహానగరంలో జనజీవనం స్థంభించిపోయింది. వరద నీరు భారీగా చేరి రోడ్లు చెరువులను తలపించాయి.
బంగాళాఖాతంలో వాయుగుండం
మరోవైపు బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడినట్లు విశాఖ వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో కోస్తాంధ్రకు అతి భారీ వర్ష సూచన జారీ చేసింది. ఈ నెల 22 నాటికి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని తెలిపింది. మే 24 నాటికి వాయుగుండంగా ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. కోస్తాంధ్ర, తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇదిలావుంటే,దక్షిణ అండమాన్ సముద్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…
