Hyderabad MMTS Trains: హైదరాబాద్ ప్రజలకు శుభవార్త.. ఈ రోజు నుంచి పరుగులు పెట్టనున్న ఎంఎంటీఎస్ రైళ్లు
Hyderabad MMTS Trains: హైదరాబాద్ ప్రజలకు గుడ్‌న్యూస్. ఎంతగానో ఎదురు చూస్తున్న ఎంటీఎస్ రైళ్లు పట్టాలు ఎక్కనున్నాయి. కోవిడ్ మహమ్మారి కారణంగా భాగ్యనగరంలో ఎంఎంటీఎస్..
Hyderabad MMTS Trains: హైదరాబాద్ ప్రజలకు గుడ్‌న్యూస్. ఎంతగానో ఎదురు చూస్తున్న ఎంటీఎస్ రైళ్లు పట్టాలు ఎక్కనున్నాయి. కోవిడ్ మహమ్మారి కారణంగా భాగ్యనగరంలో ఎంఎంటీఎస్ రైళ్లు సుమారు 15 నెలలుగా నిలిచిపోయిన విషయం తెలిసిందే. కరోనా కారణంగా లాక్ డౌన్ విధించడంతో ఎంఎంటీఎస్ రైళ్ల నిలిచిపోయాయి. ఇప్పుడు కరోనా కేసులు తగ్గడంతో రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ ఎత్తేశారు. దీంతో ఈ రోజు నుంచి (జూన్ 23) నుంచి ఎంఎంటీఎస్ రైళ్లు కూడా ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి.
అయితే ప్రస్తుతం 10 ఎంఎంటీఎస్ రైళ్లను మాత్రమే అందుబాటులోకి తీసుకువచ్చారు అధికారులు. మొదటి విడతగా లింగంపల్లి నుంచి ఫలక్ నుమా, ఫలక్ నుమా నుంచి లింగంపల్లి వరకు వీటిని నడపనున్నారు. క్రమంగా ఎంఎంటీఎస్ సర్వీసులను పెంచనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రస్తుతానికి ప్రతి రోజూ 10 ఎంఎంటీఎస్ రైళ్లు మాత్రమే నేటి నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి.
ఫలక్‌నుమా నంచి లింగంపల్లికి 3 ఎంఎంటీఎస్ రైళ్లు, లింగంపల్లి నుంచి ఫలక్‌నుమాకు 3, హైదరాబాద్ నుంచి లింగంపల్లికి 2, లింగంపల్లి నుంచి హైదరాబాద్‌కు 2 ఎంఎంటీఎస్ రైళ్లు. ఇలా 10 ఎంఎంటీఎస్ రైళ్లు నడవనున్నాయి. రైళ్లను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేసేలా ఏర్పాట్లు చేశారు. ప్రయాణికులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని నిబంధనలు విధించారు. రైళ్లలో భౌతిక దూరం కూడా తప్పనిసరిగా పాటించాలన్నారు. ఎంఎంటీఎస్ సేవలను పునఃప్రారంభించడానికి అంగీకరించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌కు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.