కౌన్ బనేగా బల్దియా బాద్‌షా… అధికార పార్టీలో మేయర్ ఎన్నిక సందడి.. ఆశావహుల ప్రయత్నాలు ముమ్మరం..

వచ్చే నెల మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అధికార టీఆర్ఎస్ పార్టీలో ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

  • Balaraju Goud
  • Publish Date - 9:50 pm, Fri, 22 January 21
కౌన్ బనేగా బల్దియా బాద్‌షా... అధికార పార్టీలో మేయర్ ఎన్నిక సందడి.. ఆశావహుల ప్రయత్నాలు ముమ్మరం..

Hyderabad mayor Race : హైదరాబాద్ మహానగర బల్దియా పీఠంపై నిన్నటి వరకు కొనసాగుతున్న ఉత్కంఠకు తెరదించింది రాష్ట్ర ఎన్నికల సంఘం. వచ్చే నెల మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అధికార టీఆర్ఎస్ పార్టీలో ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు..పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దగ్గర గట్టిగా పైరవీలు చేస్తున్నారు…

ఎన్నికల ఫలితాలు విడుదలైన నెల రోజుల తర్వాత ఎన్నికల సంఘం.. సభ్యులతో గెజిట్ విడుదల చేసింది. దాని వెంటనే ఫిబ్రవరి 11 లేదా 12 న మేయర్ ఎన్నికకు నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది ఎస్ఈసీ. దీంతో సొంతంగా మేయర్ పీఠం ఎక్కుతామా లేదా ఫ్రెండ్లి పార్టీ ఎంఐఎం తో కలిసి వెళ్తామా అనేది టీఆర్ఎస్‌లో ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. అయితే, బల్ధియా పీఠం ఎవరికి దక్కుతుందన్నదీ ఇప్పుడు ఆసక్తిగా మారింది.

గ్రేటర్ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా గులాబీ దళం అవతరించింది. అయితే, మేయర్, డిప్యూటీ మేయర్ స్థానాలను కైవసం చేసుకునేందుకు వీలుగా మెజార్టీ స్థానాలు దక్కించుకోలేక పోయింది. ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిసి కూడా పూర్తి మెజారిటీ దక్కించుకునే అవకాశం లేకుండా ఫలితాలు వచ్చాయి. దీంతో మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు ఎవరిని వరిస్తాయన్నది ఆసక్తి రేపుతున్నాయి. టీఆర్ఎస్ 56 వార్డుల్లో విజయం సాధించింది. మిగిలిన రాజకీయ పార్టీల కంటే అధికార పార్టీకి ఎక్స్అఫిషియో ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంది. ఎక్స్ అఫీషియో ఓటర్లతో కలిపి అధికార పార్టీ వంద స్థానాల లోపుకే పరిమితం అవుతోంది. అయితే, తాజాగా రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయడంతో అధికార పార్టీ నేతల్లో ఉత్కంఠగా మొదలయింది..

ఈసారి హైదరాబాద్ మహానగర మేయర్ స్థానం జనరల్ మహిళకు రిజర్వ్ కావడంతో అధికార పార్టీ తరఫున మహిళలు పెద్ద ఎత్తున ఈ స్థానం కోసం పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో భారతీనగర్ మంచి విజయం సాధించిన సింధు ఆదర్శ్ రెడ్డి, ఖైరతాబాద్ నుంచి విజయం సాధించిన మాజీ మంత్రి పీజేఆర్ కూతురు విజయా రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతల కనకారెడ్డి కోడలు చింతల విజయశాంతి రెడ్డి, సీనియర్ నేత కేకే కూతురు గద్వాల్ విజయలక్ష్మితో పాటు ప్రస్తుత మేయర్ బొంతు రామ్మోహన్ సతీమణి బొంతు శ్రీదేవిల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

ఇదిలావుంటే, బొంతు శ్రీదేవి ఇప్పటికే యాదవ కమ్యూనిటికి చెందిన కార్పొరేటర్ల మద్దతుతో కూడిన లేఖను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు అందించిన్నట్టు సమాచారం. ఇక, డిప్యూటీ మేయర్ కోసం మరోమారు ప్రస్తుత డిప్యూటీ మేయర్ బాబా ఫషీయోద్దీన్ పావులు కదుపుతున్నట్లు సమాచారం. గులాబీ పెద్దలు కూడా బాబాకు మరో ఛాన్స్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. మేయర్ పీఠం ఎలాగో కొత్తవారికి ఇస్తారు.. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అనుభవం ఉన్న బాబా జీహెచ్ఎంసీ పాలక మండలిలో కీలక పాత్ర పోషిస్తాడని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

మరోవైపు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అనూహ్యాంగా 48 స్థానాలు సాధించింది. అయితే, పొత్తు పెట్టుకోవడానికి కలిసి వచ్చే పార్టీలు లేకపోవడం, సరిపడా మెజారిటీ రాకపోవడంతో మేయర్ పోటీకి దూరంగా ఉండాలని అనుకుంటుంది. ఈ మేరకు ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటన కూడా చేశారు. ప్రజలు ప్రతిపక్ష హోదాలో ఉండమన్నారు. మేము ప్రతిపక్షంలోనే ఉంటామని చెప్తున్నారు. అయితే, టీఆర్ఎస్ – ఎంఐఎం మద్దతు లేకుండా మేయర్ పీఠం దక్కించుకునే ఛాన్స్ లేదని బీజేపీ భావిస్తోంది. ఎంఐఎం ఎలాంటి సహకారం తీసుకున్న దాన్ని ఎత్తి చూపే ప్రయత్నం చేయాలని అనుకుంటుంది బీజేపీ.

Read Also… Budget 2021: కొత్త బడ్జెట్‌పై స్టార్టప్ కంపెనీల ఆశలు.. కార్పొరేట్‌ రంగానికి ఉపశమనం కలిగించేనా..?