Hyderabad: ఒక్కరు.. ఇద్దరు కాదు.. ఏకంగా 148 మందితో నెట్‌వర్క్.. తీగ లాగితే డొంకే కదిలింది..
వంద మందికి పైగా వినియోగదారులతో విస్తరించిన భారీ డ్రగ్స్ నెట్‌వర్క్‌ను హైదరాబాద్ పోలీసులు ఛేదించారు. డిసెంబర్ 12న లంగర్‌హౌస్ పరిధిలో గంజాయి విక్రయంపై అందిన నమ్మదగిన సమాచారం మేరకు పోలీసులు ప్రత్యేక దాడులు చేపట్టారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా గుర్తించిన వికుంతరావును అదుపులోకి తీసుకుని విచారించగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఎన్ని సీరియస్ వార్నింగ్‌లు ఇస్తున్నా.. ఎంత మందిని అరెస్టు చేస్తున్నా.. ఎంతగా నిఘా పెడుతున్నా డ్రగ్స్ కేసులు మాత్రం ఆగడం లేదు. ఇటీవల పలువురు వ్యక్తులతోపాటు.. ముఖ్యంగా కాలేజీ స్టూడెంట్స్ డ్రగ్స్ కేసుల్లో పట్టుబడడం ఆందోళన కలిగిస్తోంది. అయితే.. హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ వినియోగం ఎంత లోతుగా పాతుకుపోయిందో లంగర్‌హౌస్ పోలీసుల తాజా దాడులతో బహిర్గతమైంది. కేవలం కొద్దిమందితోనే కాదు.. వంద మందికి పైగా వినియోగదారులతో విస్తరించిన భారీ డ్రగ్స్ నెట్‌వర్క్‌ను పోలీసులు ఛేదించారు. డిసెంబర్ 12న లంగర్‌హౌస్ పరిధిలో గంజాయి విక్రయంపై అందిన నమ్మదగిన సమాచారం మేరకు పోలీసులు ప్రత్యేక దాడులు చేపట్టారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా గుర్తించిన వికుంతరావును అదుపులోకి తీసుకుని విచారించగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అతడి మొబైల్ ఫోన్ కాంటాక్ట్ లిస్ట్‌లో రాజ్ గౌడ్, సాగర్ సహా మొత్తం 148 మంది డ్రగ్స్ వినియోగదారుల వివరాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీరిలో అమ్మాయిలు కూడా ఉన్నట్లు సమాచారం..
మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీలో అద్దె గదిని కేంద్రంగా చేసుకుని ఈ డ్రగ్స్ దందా కొనసాగుతున్నట్లు దర్యాప్తులో తేలింది. అక్కడి నుంచి 5 కిలోల గంజాయి, 5 కిలోల హాష్ ఆయిల్, 227 హాష్ ఆయిల్ సీసాలు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ ప్యాకింగ్‌కు ఉపయోగించే పరికరాలు, డిజిటల్ తూకపు యంత్రం, మొబైల్ ఫోన్లు, నగదు కూడా లభ్యమయ్యాయి. ఈ నెట్‌వర్క్‌లో డెలివరీ బాయ్‌గా పనిచేసిన వ్యక్తితో పాటు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సహా పలువురు వినియోగదారులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. డ్రగ్స్‌ను ఒడిశా నుంచి తీసుకువచ్చి హైదరాబాద్, సైబరాబాద్ ప్రాంతాల్లో సప్లై చేసినట్లు నిర్ధారించారు. 148 మంది వినియోగదారుల వివరాలు లభించడంతో కేసు పరిధి మరింత అవకాశముందని పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకుని, పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు కొనసాగుతోంది.
ఈ నేపథ్యంలో హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. డ్రగ్స్ వినియోగదారులను పిలిపించి కేవలం చట్టపరమైన చర్యలకే పరిమితం కాకుండా కౌన్సెలింగ్ కార్యక్రమం నిర్వహించారు. డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే శారీరక, మానసిక, సామాజిక నష్టాలపై వినియోగదారులకు అవగాహన కల్పించారు. అదే సమయంలో వినియోగదారుల తల్లిదండ్రులను కూడా కౌన్సెలింగ్‌కు పిలిపించారు. పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పిల్లల ప్రవర్తనలో అకస్మాత్తుగా వచ్చే మార్పులు, ఒంటరిగా ఉండడం, మూడ్ స్వింగ్స్, అనవసర ఖర్చులు వంటి లక్షణాలను ఎలా గుర్తించాలో వివరించారు. పిల్లలతో నిరంతరం సంభాషణ, స్నేహపూర్వక వాతావరణం, మానసిక ఒత్తిడిని పంచుకునే అవకాశం కల్పించాలంటూ సూచించారు. డ్రగ్స్ వినియోగం కేవలం వ్యక్తిగత సమస్య కాదు.. కుటుంబాలను, సమాజాన్ని కుదిపేసే ప్రమాదమని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ ఘటన నగరంలో డ్రగ్స్ ముప్పు ఎంత తీవ్రమైందో మరోసారి స్పష్టంగా చూపిస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
