మహారాష్ట్ర టు హైదరాబాద్.. ఓ మహిళ ఇచ్చిన చిన్న క్లూతో వేట.. కట్ చేస్తే..
పేరుకు ల్యాబ్..! లోపల మాత్రం డ్రగ్స్ డెన్.! యస్.. ఇన్నాళ్లూ డ్రగ్స్ మాత్రమే పట్టుబడింది. కానీ ఇప్పుడు ఏకంగా డ్రగ్స్ సామ్రాజ్యమే వెలుగు చూసింది. ఇది ఎక్కడో కాదు. మన హైదరాబాద్ అడ్డగానే డ్రగ్స్ ప్రాసెస్ జరుగుతోంది. మహారాష్ట్రలో ఒక చిన్న క్లూతో మొదలైన వేట... హైదరాబాద్‌లో భారీ డ్రగ్స్ ఫ్యాక్టరీ బండారం బట్టబయలు చేసింది.

ఇన్నాళ్లూ డ్రగ్స్ అంటే.. గోవా బీచ్‌లలో.. పార్టీల్లో.. పబ్‌లలో.. లేదా విదేశాల నుంచి అక్రమంగా వచ్చే సరుకు! కానీ, ఇప్పుడు ట్రెండ్ మారింది. దందా స్టైల్ మారింది. డ్రగ్స్ మాఫియా కొత్త రూటు పట్టింది. నేరుగా మన హైదరాబాద్‌లోనే ఫ్యాక్టరీ పెట్టి… డ్రగ్స్ తయారు చేస్తున్నారు. మహారాష్ట్ర పోలీసుల బిగ్ ఆపరేషన్‌లో ఈ డ్రగ్స్ డెన్ బయటపడింది. హైదరాబాద్‌లో భారీ డ్రగ్స్ తయారీ సిండికేట్‌ను మహారాష్ట్రలోని మిరా-భయందర్ పోలీసులు ఛేదించారు. చర్లపల్లిలోని వాగ్దేవి ల్యాబ్స్ కెమికల్ ఫ్యాక్టరీ నుంచి 32 వేల లీటర్ల రా మెటీరియల్ స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో దీని విలువల అక్షరాల 12 వేల కోట్ల.. ఈ ఆపరేషన్‌లో 13 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే మొదట 200 గ్రాముల ఎండీ డ్రగ్స్‌ను మాత్రమే పట్టుకున్నారు. వాటి విలువ 25 లక్షల రూపాయలు. లోతుగా దర్యాప్తు చేయడంతో ఈ భారీ డ్రగ్ సిండికేట్ వెలుగులోకి వచ్చింది.
సీక్రెట్ టీమ్‌తో స్పెషల్ ఆపరేషన్
మహారాష్ట్రకు చెందిన మిరా-భయందర్ పోలీసులు కొన్నాళ్లుగా ఓ డ్రగ్స్ ముఠాపై నిఘా పెట్టారు. తమ సీక్రెట్ టీమ్‌ను రంగంలోకి దించి వారాల పాటు రహస్య ఆపరేషన్ నిర్వహించారు. ముఠా మూలాలు హైదరాబాద్‌లోని చర్లపల్లిలో ఉన్నట్లు పక్కా సమాచారం అందుకున్న పోలీసులు, స్థానిక ఫ్యాక్టరీపై మెరుపుదాడి చేశారు. ఫ్యాక్టరీలో తయారైన డ్రగ్స్‌ను దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అత్యంత ప్రమాదకరమైన మోలీ, ఎక్స్‌టీసీ డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు తేల్చారు. మిథైలెనెడియాక్సీ మెథాంఫెటమైన్ ముడి పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ఈ ముఠా పెద్ద నెట్‌వర్క్‌ను నడుపుతుంది. డ్రగ్స్ తయారీ కోసం ఆధునిక మెషిన్లు ఉపయోగించినట్లు గుర్తించారు.
కస్టడీలోకి వాగ్దేవి ల్యాబ్ డైరెక్టర్ శ్రీనివాస్..
మహారాష్ట్రకు సప్లై అవుతున్న డ్రగ్స్ లింక్‌లపై ఫోకస్ చేయడంతో వాగ్దేవి ల్యాబరేటరీ బాగోతం బయటికొచ్చింది. వాగ్దేవి ల్యాబ్ డైరెక్టర్ శ్రీనివాస్‌ను ముంబై యాంటీ నార్కోటిక్ టీమ్ కస్టడీలోకి తీసుకుంది. చర్లపల్లిలో వాగ్దేవి ల్యాబ్స్ పేరుతో డ్రగ్స్ ఫ్యాక్టరీ నిర్వహిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు.. ఫ్యాక్టరీని సీజ్ చేశారు. శ్రీనివాస్‌తో పాటు తానాజీ పండరినాథ్ ను అరెస్టు చేశామని తెలిపారు. ఈ కేసులో మొత్తం 13 మందిని అరెస్ట్ చేశారు. అయితే.. డ్రగ్స్ తో పట్టుబడిన ఓ బంగ్లాదేశీ మహిళ ఇచ్చిన సమాచారంతో మహారాష్ట్ర పోలీసులు భారీ ఆపరేషన్ ను నిర్వహించారు. చిన్న లింక్ ద్వారా భారీ రాకెట్ ను పోలీసులు తెలిపారు.
ఇంత పెద్ద నెట్‌వర్క్ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తుండటం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ కేసులో ఇంకా ఎవరెవరికి సంబంధాలున్నాయనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




