Hyderabad Police: మేమున్నాం బాధపడొద్దు.. స్టేషన్‌కు వెళ్ళకుండానే ఇలా ఫిర్యాదు చేయండి..
హైదరాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో సైబర్ నేరాల బాధితులకు అండగా నిలిచేలా ‘సైబర్ మిత్ర (C-మిత్ర)’ పేరుతో నూతన కార్యక్రమాన్ని ప్రారంభించారు. బషీర్బాగ్‌లోని సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (CCS) కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక సెల్‌ను హైదరాబాద్ సీపీ సజ్జనార్ ప్రారంభించారు.

హైదరాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో సైబర్ నేరాల బాధితులకు అండగా నిలిచేలా ‘సైబర్ మిత్ర (C-మిత్ర)’ పేరుతో నూతన కార్యక్రమాన్ని ప్రారంభించారు. బషీర్బాగ్‌లోని సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (CCS) కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక సెల్‌ను హైదరాబాద్ సీపీ సజ్జనార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అడిషనల్ సీపీ (క్రైమ్స్) శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు. సైబర్ నేరాలు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో బాధితులు తక్షణ సహాయం పొందడంలో ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చినట్లు హైదరాబాద్ పోలీసులు తెలిపారు. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో లేదా 1930 హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేసిన అనంతరం చాలా మంది బాధితులు నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నట్లు గుర్తించారు. ముఖ్యంగా వయస్సు ఎక్కువైనవారు, ఉద్యోగాలు లేదా ఇతర కారణాలతో సమయం కేటాయించలేని వారు ఫిర్యాదు పూర్తి చేయకుండానే వదిలేస్తున్న పరిస్థితి ఉందని అధికారులు తెలిపారు. అంతేకాకుండా కొంత మంది పరువు పోతుందని.. బంధువుల దగ్గర తలెత్తుకోలేమంటూ బాధపడుతుంటారు..
ఈ సమస్యకు పరిష్కారంగా సైబర్ మిత్ర సెల్‌ను ఏర్పాటు చేశారు. కమిషనరేట్ పరిధిలో నమోదైన సైబర్ నేరాల కేసుల్లో బాధితులను సెల్ సిబ్బంది స్వయంగా ఫోన్ ద్వారా సంప్రదించి ఫిర్యాదు వివరాలు సేకరిస్తారు. అవసరమైతే ఫిర్యాదును పోస్టు ద్వారా లేదా డ్రాప్ బాక్స్ ద్వారా కూడా స్వీకరిస్తారు. అలాగే బాధితులు తమకు సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో కూడా ఫిర్యాదు అందజేయవచ్చని స్పష్టం చేశారు.
సైబర్ మిత్ర సెల్‌లో జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి సంబంధిత పోలీస్ స్టేషన్‌కు పంపిస్తారు. ఆపై ఆయా పోలీస్ స్టేషన్లు 24 గంటల్లోపు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, దాని కాపీని బాధితులకు అందజేస్తాయి. ఈ విధానంతో ఫిర్యాదు ప్రక్రియ సులభమవుతుందని, బాధితులు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదని అధికారులు చెబుతున్నారు.
సైబర్ నేరాల బాధితులు ఎలాంటి సంకోచం లేకుండా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని, పోలీసులే నేరుగా సహాయం చేసేలా ఈ కార్యక్రమం రూపొందించామని హైదరాబాద్ పోలీసులు తెలిపారు. సైబర్ మిత్ర ద్వారా బాధితులకు నమ్మకం కల్పించి, వేగంగా న్యాయం అందించడమే లక్ష్యమని వారు స్పష్టం చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
