AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వీడెక్కడి మొగుడండీ బాబూ.. నిద్రపోతుంటే భార్య మెడలో తాళి ఎత్తుకెళ్లాడు..!

తెలుగు లోగిళ్లలో భార్యభర్తల కీచులాటలు ఒక్కోసారి తెగ నవ్వుతెప్పిస్తాయి. తాజాగా ఓ మొగుడు గారికి డబ్బు అవసరమైంది. భార్యను అడిగితే ఇవ్వనని తెగేసి చెప్పింది. దీంతో అతగాడి కన్ను ఆమె మెడలో దగదగ మెరిసిపోతున్న మంగళసూత్రంపై పడింది. అంతే భార్యను నిద్రపోనిచ్చి ఆమెకు తెలియకుండా నెమ్మదిగా దాన్ని చోరీ చేశాడు. చేసిన చోరీ ఎక్కడ బయపడుతుందోనన్న భయంతో కొత్త నాటకమాడి అడ్డంగా దొరికిపోతాయాడు..

వీడెక్కడి మొగుడండీ బాబూ.. నిద్రపోతుంటే భార్య మెడలో తాళి ఎత్తుకెళ్లాడు..!
Husband stolen mangalsutra from wife
Srilakshmi C
|

Updated on: Apr 17, 2025 | 12:35 PM

Share

హైదరాబాద్‌, ఏప్రిల్ 17: భార్యభర్తల కీచులాటలు అన్నీఇన్నీ కావు. కొందరు గుట్టుగా గడప దాటకుండా కాపురం చేస్తే.. మరికొందరు వీధంతా ఊరేగుతారు. తాజాగా వ్యసనాలకు అలవాటు పడ్డ ఓ పతిదేవుడు భార్య నిద్రపోతుంటే గుట్టుచప్పుడు కాకుండా వచ్చి ఆమె మెడలో కట్టిన తాళినే చోరీ చేశాడు. ఆనక దొంగోడు వచ్చి భార్య తాళి తెంచుకొని వెళ్లాడంటూ నాటకమాడసాగాడు. తీర పోలీసు బాబాయ్‌లు రావడంతో మొగుడుగారి అసలు బండారం బయటపడింది. ఈ విచిత్ర ఘటన హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీలో మంగళవారం (ఏప్రిల్‌ 15) చోటు చేసుకుంది. కేపీహెచ్‌బీ డీఐ రవికుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం..

తెలంగాణ రాష్ట్రంలోని మెదక్‌ జిల్లా వల్లూరుకు చెందిన ఆంజనేయులు, భాగ్యమ్మ దంపతులు. ఉపాధి కోసం హైదరాబాద్‌కు వచ్చిన ఈ దంపతులు కేపీహెచ్‌పీలోని వసంతనగర్‌ రోడ్డు నంబరు 6లోని ఓ ఇంట్లో కాపలాదారులుగా పని చేస్తున్నారు. అయితే మంగళవారం తెల్లవారుజామున ఓ దొంగ గోడదూకి వచ్చి.. నిద్రిస్తున్న భాగ్యమ్మ మెడలోంచి తాళి తెంచి పారిపోబోయాడని, తాను చూసి అడ్డుకోబోతే.. తనపై దాడి చేసి గోడ దూకి పారిపోయాడని ఆంజనేయులు లబోదిబోమన్నాడు. అనంతరం ఇంటి యజమానులను, చుట్టుపక్కల వారిని నిద్రలేపి హడావుడి చేశాడు.

దీంతో ఇంటి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా అసలు సంగతి బయటపడింది. తొలుత ఆంజనేయులు, భాగ్యమ్మ కాపలా ఉంటున్న భవన ప్రాంగణంలోకి అసలు ఎవరూ రాలేదని నిర్ధారించుకున్న పోలీసులు తెగ బాధపడిపోతున్న ఆంజనేయులిపై కన్నేశారు. దీంతో దంపతులు ఇద్దరినీ స్టేషన్‌కు తీసుకెళ్లి లోతుగా విచారించగా ఆంజనేయులు నిజం నిదానంగా చెప్పాడు. భార్య నిద్రిస్తుంటే తానే తాళి తెంచానని ఆంజనేయులు నేరం అంగీకరించాడు. భార్యను డబ్బు అడిగితే ఇవ్వలేదని, అందుకే వ్యక్తిగత అవసరాల కోసం డబ్బు అవసరమై చోరీ చేశానని పోలీసుల ఎందుట నేరం ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు నిందుతుడు ఆంజనేయులుని అరెస్ట్‌ చేసి బుధవారం (ఏప్రిల్ 16) రిమాండ్‌కు తరలించినట్లు కేపీహెచ్‌బీ డీఐ రవికుమార్‌ తెలిపారు. ఇక దొంగమొగుడి దొంగ నాటకాలు చూసిన భాగ్యమ్మ షాక్‌తో నోట మాటరాక ఉండిపోయింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.