Inspiration Story: క్యాన్సర్‌తో పోరాడుతూనే ఇంటర్‌లో సత్తా చాటిన బాలిక.. ఎన్ని మార్కులొచ్చాయో చూశారా?
10వ తరగతి చదివుతున్నప్పుడే ఆ విద్యార్ధినికి ఉన్నట్లుండి బాగా గొంతునొప్పి వచ్చింది. మాట్లాడటం కూడా ఇబ్బందిగా మారింది. ఆ మరుసటి రోజే తీవ్ర జ్వరం కూడా వచ్చింది. దీంతో తల్లిదండ్రులు హాస్పిటల్‌కి తీసుకెళ్లగా.. డాక్టర్లు రకరకాల పరీక్షలు చేసి చివరికి ఆసలు కారణం కనిపెట్టేశారు. ప్రాణాలను హరించే క్యాన్సర్ మహమ్మారి ఒంట్లో తిష్టవేసినట్లు చెప్పారు..

కర్నూల్, ఏప్రిల్ 15: రెండేళ్ల క్రితం నుంచి బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతోంది ఆ విద్యార్ధిని. క్యాన్సర్ మహమ్మారి వేధిస్తున్నా ఆమె మాత్రం తన కల వీడలేదు.. భయపడి వెరవలేదు. ఓవైపు చికిత్స తీసుకుంటూనే చదువుపై అసక్తి పెంచుకుంది. డాక్టర్ కావాలనే లక్ష్యంతో పట్టుదలతో ముందుకు అడుగులు వేస్తుంది. తాజాగా వెలువడిని ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఇంటర్ బైపీసీ ఫస్ట్ ఇయర్ పరీక్షల్లో మొత్తం 440 మార్కులకుగానూ ఏకంగా 420 సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది కర్నూలు జిల్లా గోనెగండ్లకు చెందిన సృజనామృత.
10వ తరగతి చదివుతున్నప్పుడు అంటే.. 2023 సెప్టెంబరులో ఓ రోజు సృజనామృతకు ఉన్నట్లుండి బాగా గొంతునొప్పి వచ్చింది. మాట్లాడటం కూడా ఇబ్బందిగా మారింది. ఆ మరుసటి రోజే తీవ్ర జ్వరం కూడా వచ్చింది. దీంతో తల్లిదండ్రులు హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. డాక్టర్లు రకరకాల పరీక్షలు చేసి చివరికి ఆసలు కారణం కనిపెట్టేశారు. గొంతు, గుండె, పొట్ట ప్రాంతాల్లో క్యాన్సర్ గడ్డలు ఉన్నాయనీ, వెంటనే కీమోథెరపీ చేయకపోతే బతకడం కష్టమని గుండెలు బద్ధలయ్యే విషయం చెప్పారు. ఎంతో ఆరోగ్యంగా కళ్ల ముందు తిరుగుతున్న కుమార్తెను క్యాన్సర్ ఆవహించడంతో తల్లిదండ్రులు ఎంతో వేదన అనుభవించారు. ధైర్యం పుంజుకుని గత ఏడాది 10వ తరగతి పరీక్షల సమయంలోనే వారానికి 5 రోజుల చొప్పున నాలుగు వారాల పాటు రేడియేషన్ చికిత్స చేయించారు. ఉదయం పరీక్ష రాసి మధ్యాహ్నం హాస్పిటల్‌కి వెళ్లి చికిత్స తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.
కీమోథెరపీ బాధను భరించలేక బాధతో విలవిల్లాడేది సృజనామృత. అయినా ఆసుపత్రికి కూడా పుస్తకాలను వెంటే తీసుకునిమరీ చదువుకుంది. ఇలా టెన్త్ పరీక్షల్లో 600 మార్కులకు గానూ 493 సాధించింది. అనంతరం ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో చేరిన తర్వాత కూడా కీమోలు, రేడియేషన్ల చికిత్స చేయించుకుంటూనే ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు కూడా రాసింది. తాజాగా ఆ ఫలితాలు వెల్లడవడంతో మొత్తం 440 మార్కులకు ఏకంగా 420 మార్కులు సాధించింది. బోటనీ, జువాలజీల్లో 60కి 60 మార్కులు వచ్చాయి. ఆరోగ్యం సహకరించకపోయినా.. తల్లిదండ్రుల సహకారంతో ధైర్యం తెచ్చుకుని తన కల వైపు అడుగులు వేస్తున్నట్లు సృజనామృత చెబుతోంది. ఆమె కల నెరవేరాలని మనం కూడా కోరుకుందాం..
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.