NCS పోర్టల్‌తో స్విగ్గీ జోడీ.. రాబోయే యేళ్లలో యువతకు 12 లక్షల కొత్త ఉద్యోగాలు!
దేశంలో ఉద్యోగ ఎంపికలు, నియామకాల్లో విప్లవాత్మక మార్పులను తీసుకురావడంతో NCS పోర్టల్ బలమైన వేదికగా మారనుంది. రాబోయే రెండు మూడు సంవత్సరాలలో ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫాం స్విగ్గీ ఒక్కటే 10 నుంచి 12 లక్షల కొత్త ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తుందని కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ అంచనా వేసింది..

దేశంలోనే అతిపెద్ద ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫాంలలో ఒకటైన స్విగ్గీతో కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాల ద్వారా ఉపాధి అవకాశాలను బలోపేతం చేసే విస్తృత చొరవలో భాగంగా ఈ అవగాహనా ఒప్పందం చేసుకున్నారు. దేశ వ్యాప్తంగా 500కి పైగా నగరాల్లో స్విగ్గీ సేవలు అందిస్తుంది. పలు రంగాల్లో నిరుద్యోగ యువతకు ఉపాధిని సృష్టించడంలో స్విగ్గీ కీలక పాత్ర పోషిస్తోంది. దాదాపు 5 కోట్ల ఉద్యోగాలు ఈ ప్లాట్‌ఫామ్ అందిస్తుంది. లేబర్ మార్కెట్‌లో డిమాండ్, సరఫరా మధ్య అంతరాన్ని తగ్గించడానికి మంత్రిత్వ శాఖ ప్రైవేట్ ఏజెన్సీలతో కుదుర్చుకుంటున్న ఒప్పందాల శ్రేణిలో భాగంగా ఈ అవగాహన ఒప్పందం చేసుకుంది.
దీనిపై కేంద్ర కార్మిక, పర్యావరణ మంత్రి మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ.. నేషనల్ కెరీర్ సర్వీస్ (NCS) పోర్టల్ ఉద్యోగార్ధులకు సింగిల్-విండో వ్యవస్థగా అభివృద్ధి చెందుతోంది. ప్రస్తుతం శ్రమ్ పోర్టల్‌లో నమోదు చేసుకున్న 31 కోట్లకు పైగా వ్యక్తుల డేటా ఇందులో ఉంది. కంపెనీల యజమానులు బాహ్యంగా ఉద్యోగ ప్రకటనలు చేయాల్సిన అవసరం లేకుండా లేబర్ కోసం ఇందులో నేరుగా ఎంపికలు చేసుకునే వెసులుబాటు కల్పిస్తుంది. NCS పోర్టల్ నియామక ప్రక్రియను క్రమబద్ధీకరిస్తుంది. నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలకు సమగ్ర వేదికగా పనిచేస్తుందని మంత్రి మాండవీయ పేర్కొన్నారు. ఆయా కంపెనీల యజమానులు NCS పోర్టల్‌ను యాక్సెస్ చేయవచ్చు.
తద్వారా వారికి అవసరమైన అర్హత కలిగిన అభ్యర్థులను తక్షణమే గుర్తించడానికి అవకాశం ఉంటుంది. ఇది దేశంలో ఉద్యోగ ఎంపికలు, నియామకాల్లో విప్లవాత్మక మార్పులను తీసుకువస్తుందని ఆయన అన్నారు. రాబోయే రెండు మూడు సంవత్సరాలలో స్విగ్గీ ఒక్కటే 10 నుంచి 12 లక్షల కొత్త ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తుందని అంచనా వేశారు. ఇలాంటి అవగాహన ఒప్పందాలపై సంతకం చేయడానికి మరిన్ని సంస్థలు సిద్ధంగా ఉన్నాయన్నారు. దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా NCS పోర్టల్ ప్రముఖ వేదికగా మారుతుందని, లక్షలాది మంది యువతకు ఉపాధిని అందిస్తూనే యజమానులు తమ శ్రామిక శక్తి అవసరాలను తీర్చడంలో ఈ పోర్టల్ సహాయపడుతుందని మంత్రి మాండవీయ తెలిపారు.
స్విగ్గీలో ఆపరేషన్స్ ఇన్-ఛార్జ్ సల్బ్ శ్రీవాస్తవ మాట్లాడుతూ.. NCSలో భాగం కావడం తమ అదృష్టంగా భావిస్తున్నానన్నారు. గత దశాబ్దంలో స్విగ్గీ లక్షలాది ఉద్యోగాలను సృష్టించింది. ఈ భాగస్వామ్యం ద్వారా మరింత నైపుణ్యం కలిగిన వ్యక్తులతో కనెక్ట్ అవ్వగలుగుతాం. NCS ఖచ్చితంగా నియామక ప్రయత్నాలను స్కేల్ చేయడానికి, దేశవ్యాప్తంగా ఉపాధి కల్పనను పెంచడానికి మాకు సహాయపడుతుందని ఆనందం వ్యక్తం చేశారు. NCS ప్లాట్‌ఫామ్ ద్వారా మరింత మంది నైపుణ్యం కలిగిన కార్మికులను ఏకీకృతం చేయాలని స్విగ్గీ యోచిస్తున్నట్లు శ్రీవాస్తవ అన్నారు. రాబోయే కొన్నేళ్లలో 10 నుంచి 12 లక్షల కొత్త ఉద్యోగాలు స్విగ్గీలో లభిస్తాయని అంచనా వేశారు. దేశంలో కార్మిక పర్యావరణ వ్యవస్థను మరింత సమర్థవంతంగా అందుబాటులోకి తీసుకురావడంతోపాటు, యాజమన్యాలను కలుపుకొనిపోయేలా చేయడమే లక్ష్యంగా ఉపాధి సేవలతో సాంకేతికతను అనుసంధానించడంలో ఎన్‌సీఎస్ కీలమైన ముందడుగు వేసింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.