AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: 31వేల జనన, మరణ ధృవీకరణ పత్రాలు రద్దు.. GHMC సంచలన నిర్ణయం.. ఎందుకంటే..

నకిలీ బర్త్‌, డెత్‌ సర్టిఫికెట్లను సృష్టిస్తున్నారు. ఇంది ఎక్కడో కాదు మన హైదరాబాద్‌ మహా నగరంలో.. గ్రేటర్‌ పరిధిలో విచ్చలవిడిగా నకిలీ బర్త్‌, డెత్‌ సర్టిఫికెట్లు జారీ చూస్తున్నట్లుగా గుర్తించారు.

Hyderabad: 31వేల జనన, మరణ ధృవీకరణ పత్రాలు రద్దు.. GHMC సంచలన నిర్ణయం.. ఎందుకంటే..
Fake Certificates Racket
Sanjay Kasula
|

Updated on: Mar 06, 2023 | 6:26 PM

Share

నకిలీ.. నకిలీ.. నకిలీ.. నకిలీ పాలు, నకిలీ నీళ్లు, నకిలీ మద్యం.. ఇలా మహానగరంలో అన్నింటిలో నకిలీ మకిలీ అంటుకుంది. ఈజీ మనీ కోసం ఎంతకైన తెగిస్తున్నారు. చివరికి  నకిలీ బర్త్‌, డెత్‌ సర్టిఫికెట్లను సృష్టిస్తున్నారు. ఇంది ఎక్కడో కాదు మన హైదరాబాద్‌ మహా నగరంలో.. గ్రేటర్‌ పరిధిలో విచ్చలవిడిగా నకిలీ బర్త్‌, డెత్‌ సర్టిఫికెట్లు జారీ చూస్తున్నట్లుగా గుర్తించారు జీహెచ్చ్ఎంసీ అధికారులు. ఇలా జారీ చేసిన 31 వేల సర్టిఫికెట్లు రద్దు చేసినట్లుగా జీహెచ్చ్ఎంసీ ప్రకటించింది. జీహెచ్చ్ఎంసీ రద్దు చేసినవాటిలో 27 వేల బర్త్‌, 4 వేల డెత్ సర్టిఫికెట్లు ఉన్నట్లుగా తేల్చి చెప్పారు. మీసేవ సెంటర్లలో ఇష్టారాజ్యంగా జారీ చేస్తున్నట్టు గుర్తించారు. ఇందులో మెహిదీపట్నం, చార్మినార్, బేగంపేట్, సికింద్రాబాద్‌‌లోని మీ సేవ సెంటర్లను అధికారులు గుర్తించారు.

ఎలాంటి నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా సర్టిఫికెట్లు జారీ చేస్తున్న మీ సేవ సెంటర్లు గుర్తింపు రద్దు చేసి వారిపై కేసులు నమోదు చేశారు. గత డిసెంబర్లో పలు మీసేవ సెంటర్ల పై సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో నకిలీ జనన ధ్రువీకరణ పత్రాలను తయారీ చేసి, అవసరమైన వ్యక్తులకు విక్రయిస్తున్న నలుగురు సభ్యులున్న ముఠాను గత ఏడాది డిసెంబర్ 23న దక్షిణ మండలం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 243 నకిలీ జనన ధ్రువీకరణ పత్రాలు, తంబ్‌ స్కానర్‌, సీపీయూ, మొనిటర్‌, ప్రింటర్‌, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను దక్షిణ మండలం డీసీపీ, టాస్క్‌ఫోర్స్‌ అదనపు డీసీపీ సాయి చైతన్య, గుమ్మీ చక్రవర్తి అందించారు.

హైదరాబాద్ అడ్డగా ..

ఓ ముఠాగా ఏర్పడి దందాకు తెరలేపారు. ముఠా సభ్యుల్లోని ప్రధాన నిందితుడు మహ్మద్‌ ఇబ్రహీంకు తలాబ్‌కట్ట ప్రాంతంలో ఐఏ ఖిద్మతే పేరుతో మీ సేవా కేంద్రం  నిర్వహిస్తున్నాడు. మీ సేవా కేంద్రానికి జనన ధ్రువీకరణ పత్రాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు చాలా మంది రావడాన్ని గమనించి క్యాష్ చేసుకున్నాడు. సరైన ఆధారాలు, పత్రాలు లేకపోవడంతో సర్టిఫికెట్లు పొందలేకపోవడాన్ని పసిగట్టిన ఇబ్రహీం.. జనన ధ్రువీకరణ పత్రాలు, అవసరమైన డాక్యుమెంట్లు తయారు చేసి ఇవ్వాలని ప్లాన్ వేసినట్లుగా పోలీసులు తెలిపారు.

ఇందుకు రాజేంద్రనగర్‌లో ఆన్‌లైన్‌ సెంటర్‌ను నిర్వహిస్తున్న షేక్‌ అమీర్‌, కాలాపత్తర్‌లో ఆన్‌లైన్‌ సెంటర్‌ను నిర్వహిస్తున్న ఎండీ షహబాజ్‌, కామాటీపురలో ఆన్‌లైన్‌ సెంటర్‌ను నిర్వహిస్తున్న మహ్మద్‌ షానవాజ్‌ను గ్యాంగ్‌ ఏర్పాటు చేసుకుని దందా మొదలు పెట్టారు. జనన ధ్రువీకరణ పత్రాల కోసం జీహెచ్‌ఎంసీలో దరఖాస్తు చేసుకునేందుకు అసరమయ్యే పత్రాల వివరాలను సేకరించారు. ఈ ముఠా సభ్యులు నిర్వహిస్తున్న కేంద్రాలకు జనన ధ్రువీకరణ పత్రాల కోసం వస్తున్న ప్రజల నుంచి వివరాలు సేకరిస్తున్నారు.

పోలీసుల చర్యలతో దిగివచ్చిన..

పోలీసులు చేపట్టిన చర్యలతో నమ్మకు నీరెత్తినట్లుగా ఉన్న జీహెచ్ఎంసీ అధికారుల్లో కదలిక వచ్చింది. వెంటనే హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న మీసేవ సెంటర్లలో అధికారుల తనిఖీలు నిర్వహించారు. ఇలాంటి సెంటర్లను  మెహదీపట్నం, చార్మినార్ బేగంపేట్ సికింద్రాబాద్ సర్కిల్లలో కూడా గుర్తించారు. వీరు తయారు చేసి 31 వేల సర్టిఫికట్లు రద్దు చేస్తున్నట్లుగా అధికారులు ప్రకటించారు. ఇక ఫలక్‌నుమా సర్కిళ్లలో 31 వేల ఫేక్‌ సర్టిఫికెట్లు రద్దు చేశారు.

మెహిదీపట్నం, చార్మినార్‌, ఫలక్‌నుమా, సికింద్రాబాద్‌, బేగంపేట, మలక్‌పేట, ముషీరాబాద్‌, గోషామహల్‌ తదితర జీహెచ్‌ఎంసీ సర్కిళ్లు ఈ సర్టిఫికెట్‌ జారీ చేసిన జాబితాలో అగ్రస్థానంలో నిలిచాయి.  ఆధార్ కార్డ్, పాస్‌పోర్ట్, పాన్ కార్డ్, రేషన్ కార్డ్ మరియు ఇతర సర్టిఫికేట్‌లను పొందేందుకు జనన ధృవీకరణ పత్రాలు కీలకమైన పత్రాలు, అయితే బీమా, ఆస్తి బదిలీ మొదలైన వాటిని క్లెయిమ్ చేయడానికి మరణ ధృవీకరణ పత్రాలు కీలకమని అధికారులు తెలిపారు.

అస్తవ్యస్తంగా మారాయని మీసేవా సెంటర్లు..

జీహెచ్‌ఎంసీ అధికారులు తగు జాగ్రత్తలు లేకుండా సర్టిఫికెట్లు జారీ చేయడంతో పాటు మీసేవా కేంద్రాలే ఈ దారుణానికి కారణమని ఆరోపిస్తున్నారు. ఇలా సర్టిఫికెట్లు పొందిన కొందరు ప్రభుత్వ శాఖల్లో తమ పత్రాలు అంగీకరించకపోవడంతో.. స్థానిక మున్సిపల్ కార్యాలయాల్లో వీరు గుట్టుచప్పుడు కాకుండా తీసుకోవడంతో అసలు కథ వెలుగులోకి వచ్చింది.

పాస్‌పోర్ట్ కార్యాలయాలు, బీమా ఏజెన్సీలు జనన, మరణ ధృవీకరణ పత్రాలను ప్రామాణీకరణ కోసం GHMC కార్యాలయానికి పంపుతాయి. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సూచించిన పౌర రిజిస్ట్రేషన్ సిస్టమ్ ప్రకారం అధికారిక రిజిస్ట్రీలో నమోదు కానందున అన్ని సర్టిఫికెట్లు పరీక్షలో విఫలమయ్యాయి.

మార్చి, డిసెంబర్ 2022 మధ్య తప్పనిసరి రెవెన్యూ డివిజనల్ అధికారి (RDO) ప్రొసీడింగ్‌లను పరిగణనలోకి తీసుకోని మీ సేవా కేంద్రాల ద్వారా ఈ మోసపూరిత ధ్రువపత్రాల జారీ జరిగింది. వీటిలో చాలా వరకు ఎలాంటి డాక్యుమెంటరీ రుజువు లేకుండా జారీ చేయబడ్డాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం