GHMC-BJP: గ్రేటర్ హైదరాబాద్ బీజేపీలో గందరగోళం.. 10నెలలుగా జరగని ఫ్లోర్ లీడర్ ఎంపిక
గ్రేటర్ హైదరాబాద్ భారతీయ జనతా పార్టీలో గందరగోళం నెలకొంది. అర్ధ సెంచరీకి చేరువలో కార్పోరేటర్లు గెలిచినా, కలిసి పనిచేసే పరిస్థితి లేదు.
GHMC BJP Floor leader Election: గ్రేటర్ హైదరాబాద్ భారతీయ జనతా పార్టీలో గందరగోళం నెలకొంది. అర్ధ సెంచరీకి చేరువలో కార్పోరేటర్లు గెలిచినా, కలిసి పనిచేసే పరిస్థితి లేదు. ఇప్పటికీ వాయిస్ వినిపించే నేతను ఎన్నుకోలేదంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. గతేడాది జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సత్తా చాటారు కమలనాథులు. అర్ధ సెంచరీకి చేరువలో గెలుపొందారు కార్పొరేటర్లు. అయితే, స్థానిక సమస్యలను కార్పొరేటర్లు బల్దియా దృష్టికి తీసుకెళ్లేందుకు కౌన్సిల్ సమావేశాల్లో ఫ్లోర్ లీడర్ వాయిస్ వినిపించాల్సి ఉంటుంది. ఈ ఫ్లోర్ లీడర్ ఎంపికపై 10 నెలలుగా గ్రేటర్ బీజేపీ కన్‌ఫ్యూజన్‌లో ఉంది. బల్దియాలో ప్రతిపక్షపార్టీ ఫ్లోర్ లీడర్‌గా ఎవరికి అవకాశం దక్కితే, తర్వాత వారికి ఎమ్మెల్యే టికెట్ దొరికే ఛాన్స్ అనే ప్రచారం జరుగుతోంది. ఈ నెపథ్యంలో బీజేపీలోని 47 మంది కార్పొరేటర్లలో ఫ్లోర్ లీడర్ పోస్ట్ పై చాలామంది ఆశలు పెట్టుకున్నారు.
ఇదిలావుంటే, గ్రేటర్‌లో బీజేపికి మంచి ఫలితాలు రావడంతో ఫ్లోర్ లీడర్ పదవికి కూడా పోటీ ఎక్కువైంది. దీంతో అప్పుడే ఎందుకులే అని ఫ్లోర్ లీడర్ ఎంపికను పక్కనపెట్టారు రాష్ట్ర నేతలు. ఫలితంగా ప్రజాసమస్యలపై బీజేపీ కార్పోరేటర్లు పట్టించుకోవడం లేదనే వాదన వినిపిస్తోంది. ఎవరో ఒకరు నాయకత్వం వహించి ముందుకెళ్తే జీహెచ్ఎంసీలో తమ గళం వినిపించే అవకాశం ఉంటుందని కొత్తగా కార్పోరేటర్లుగా గెలిచిన వారు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల టీఆర్ఎస్ ప్లీనరీ ఫ్లెక్సీల విషయంలో బుద్ధభవన్ వద్ద ఆందోళనకు పట్టుమని పదిమంది కార్పోరేటర్లు రాలేదు. ఆ తర్వాత కౌన్సిల్ సమావేశ ఏర్పాటు కోసం మేయర్‌ను కలిసేందుకు రావడంలో కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది.
మరోవైపు, కార్పోరేటర్లలో సమన్వయం కూడా సమస్యగా మారింది. అయితే, ఫ్లోర్ లీడర్ రేసులో ముగ్గురి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. చంపాపేట్ కార్పొరేటర్ మధుసూదన్ రెడ్డి, గుడిమల్కాపూర్ కార్పొరేటర్ దేవర కరుణాకర్, మైలార్‌దేవ్‌పల్లి కార్పోరేటర్ శ్రీనివాస్ రెడ్డి పేర్లు వినపడుతున్నాయి. ఇందులో మధుసూదన్ రెడ్డికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర పార్టీ ప్రెసిడెంట్ బండి సంజయ్ ఆశీస్సులు ఉన్నాయని, శ్రీనివాస్ రెడ్డి వైపు పార్టీ జాతీయ వైస్ ప్రెసిడెంట్ డీకే అరుణ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. సీనియర్‌గా తనకే అవకాశం దక్కుతుందని ఆశలు పెట్టుకున్నారు దేవర కరుణాకర్.