GRMB: కేంద్రప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్ పై అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసిన గోదావరి నదీ యాజమాన్య బోర్డు
కేంద్రప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్‌పై అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది గోదావరి నదీ యాజమాన్య బోర్డు. ఆగస్టు 9 తేదీన హైదరాబాద్‌లోని జలసౌధలో సమావేశం ఉంటుందని
Godavari River Management Board: కేంద్రప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్‌పై అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది గోదావరి నదీ యాజమాన్య బోర్డు. ఆగస్టు 9 తేదీన హైదరాబాద్‌లోని జలసౌధలో సమావేశం ఉంటుందని జీఆర్ఎంబీ స్పష్టం చేసింది. ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా ఏపీ, తెలంగాణాలకు జీఆర్ఎంబీ సభ్య కార్యదర్శి బీపీ పాండే సమాచారం ఇచ్చారు. ఇదిలాఉండగా, కృష్ణానది జలాల జలజగడంపై రివర్‌బోర్డు సభ్యులు రేపు(గురువారం) రాయలసీమలో పర్యటించనున్నారు. పోతిరెడ్డిపాడు దగ్గర రాయలసీమ ఎత్తిపోతల పనులను పరిశీలిస్తారు. బృందంలో తెలంగాణకు చెందినవారు ఎవరూ ఉండకూడదని బోర్డుకు ఏపీ సర్కార్ షరతు విధించింది. ఈ మేరకు KRMBకి ఏపీ ప్రభుత్వం సమాచారం ఇచ్చింది.
గతంలో పలుమార్లు సందర్శించాలని భావించినా ఏపీ ప్రభుత్వం సహకరించలేదన్న ఆరోపణలు వచ్చాయి. దాంతో పలు మార్లు వాయిదా పడుతూ రాగా.. ప్రస్తుతం జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆదేశాలతో.. KRMB బృందం పర్యటించబోతోంది. ఎత్తిపోతల పథకంపై తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభ్యంతరాల నేపథ్యంలో క్షుణ్ణంగా పరిశీలించి NGT నివేదికను ఇవ్వనుంది. ఇప్పటికే కృష్ణారివర్‌బోర్డు సభ్యులు తమ టూర్‌పై ఏపీ ప్రభుత్వానికి సమాచారం అందించారు. శ్రీశైలంలో నీటిమట్టం 854 అడుగులకు చేరుకుంటే కానీ సాగునీరు, తాగునీటి అవసరాలకోసం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా నీటిని తీసుకునే అవకాశం ఉండదని ఏపీ గట్టిగా వాదిస్తోంది. చెన్నైకు తాగునీటి సరఫరాతో పాటు రాయలసీమలోని నాలుగు జిల్లాలకు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి వెళ్లే నీళ్లే ఆధారమని అంటోంది.
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనేది కొత్తది కాదని, తమ వాటా ప్రకారమే వాడుకుంటామని ఏపీ ప్రభుత్వం అంటుండగా.. తెలంగాణ మాత్రం తప్పుపడుతోంది. అది అక్రమ ప్రాజెక్టుగా ఆరోపిస్తోంది. పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకం ద్వారా.. దక్షిణ తెలంగాణ ఎడారిగా మారే ప్రమాదం ఉందని అంటోంది. ఈ నేపథ్యంలో కృష్ణా రివర్ బోర్డు.. ఆ ప్రాంతాన్ని సందర్శించి ఎలాంటి నివేదికను ఇస్తుందన్న దానిపై ఆసక్తి నెలకొంది.