పైకేమో అందాల భామ.. చేసే పనులేమో అయ్యబాబోయ్ అనేలా.. అసలు కథ తెలిస్తే మైండ్ బ్లాంకే..
గంజాయి కేసులో లేడీ డాన్ సంగీతాసాహూని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. ధూల్‌పేట్ గంజాయ్ గ్యాంగ్ ఇచ్చిన సమాచారంతో ఒడిశాలో అదుపులోకి తీసుకున్నారు. గంజాయి అక్రమ రవాణాకు సంబంధించి సంగీతాసాహూ నుంచి కీలక విషయాలు రాబట్టే అవకాశాలు ఉన్నాయని పోలీసులు పేర్కొంటున్నారు.

ఒడిశాకు చెందిన గంజాయి గ్యాంగ్ లేడీ డాన్ సంగీతాసాహూ అలియాస్ గీతాసాహూ ఎట్టకేలకు హైదరాబాద్ పోలీసులకు అడ్డంగా బుక్కయింది. ఒడిశా కుర్థా జిల్లా కాళీకోట్ గ్రామానికి చెందిన సంగీతా సాహూ.. గత నాలుగేళ్లుగా హోల్‌సేల్ గంజాయి వ్యాపారం చేస్తోంది. భువనేశ్వర్‌కు దగ్గరగా ఉండడంతో అనేక రాష్ట్రాల గంజాయి వ్యాపారులతో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకుని వారికి గంజాయి సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. తెలంగాణలో ఐదు కేసుల్లో నిందితురాలిగా ఉన్న సంగీతా సాహూను అరెస్టు చేసేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ కమలాసస్‌రెడ్డి ఓ ప్రత్యేక టీమ్‌ను ఒరిస్సాకు పంపించారు. దాంతో.. నంద్యాల అంజిరెడ్డి సారథ్యంలో ఒడిశా కాళీకోట్ వెళ్లిన స్పెషల్ టాస్క్‌ఫోర్స్ టీమ్ అక్కడి పోలీసుల సహకారంతో సంగీతాసాహును అరెస్టు చేసి తెలంగాణకు తీసుకొవచ్చారు.
ధూల్‌పేట్‌లో 29 కేజీలు, 11.3 కేజీలతో పట్టుబడ్డ రెండు కేసుల్లోని నిందితులకు సంగీతాసాహు గంజాయి సరఫరా చేసినట్లు తేల్చారు. ధూల్‌పేట్‌లో శీలాబాయ్, నేహబాయ్, ఇష్‌కాసింగ్‌తోపాటు మరికొందరికి గంజాయి సప్లై చేసినట్లు పట్టుబడిన నిందితులు ఇచ్చిన సమాచారంతో ఆమెపై ధూల్‌పేట్ ఎక్సైజ్ పోలీసులు కేసులు నమోదు చేశారు.
అలాగే.. 2022లో హైదరాబాద్‌కు గంజాయి తీసుకొస్తూ సికింద్రాబాద్ రైల్వే పోలీసులకు పట్టుబడి.. జైలుకు వెళ్లి వచ్చింది. గంజాయి వినియోగం ఎక్కడ ఉంటే అక్కడి వెళ్లి గంజాయి వ్యాపారులతో ఒప్పందాలు కుదుర్చుకుంటుందని పోలీసులు తెలిపారు. గంజాయి లేడీ డాన్ సంగీతా సాహును ఒడిశాలో అరెస్ట్ చేసి తీసుకొచ్చిన టాస్క్‌ఫోర్స్ టీమ్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ కమలాసన్‌రెడ్డి అభినందించారు.
ఇక.. సంగీతాసాహు ఇన్‌స్టాగ్రామ్‌లో సినీ నటిలా వీడియోలు పోస్టు చేస్తుందని పోలీసులు వెల్లడించారు. ఈ క్రమంలోనే.. కొంతకాలంగా తప్పించుకు తిరుగుతున్న ఆమెను ఎట్టకేలకు హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఆమె దందాపై ఆరా తీస్తున్నారు.. విచారణలో కీలక విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉందని పోలీసులు పేర్కొంటున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..