Green India: గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఈ స్ఫూర్తి.. సీడ్ గణపతి పంపిణీ చేసిన ఎంపీ సంతోష్‌కుమార్..
పర్యావరణ అవగాహన, పచ్చదనం పెంపులో వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్, వినాయక చవితి సందర్భంగా సీడ్ గణేషాను పంపిణీ చేస్తోంది. ఈ కార్యక్రమాన్ని రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్ లాంఛనంగా ప్రారంభించారు.
హైదరాబాద్‌లోని పంజాగుట్ట సమీపంలో ఉన్న నెక్ట్స్ గలేరియా మాల్‌లో సందర్శకులకు ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్ చేతులు మీదుగా విత్తణ గణపతులను పంపిణీ చేశారు. పూర్తిగా పర్యావరణహితంగా గణేష్ ప్రతిమలను తయారు చేయటం ద్వారా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఈ స్ఫూర్తివంతమైన కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు ప్రకటించారు. స్వచ్చమైన మట్టి, కొబ్బరి నాచు ను వాడి ప్రతిమలను తయారు చేశారు. ఈసారి గణేష్ ప్రతిమలతో పాటు వివిధ రకాల విత్తనాలును మట్టిలో పొందుపరిచారు. హరిత తెలంగాణ సాధనలో చింత, వేప చెట్లను విరివిగా పెంచాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయం మేరకు ఆ విత్తనాలతో కూడిన మట్టి గణేషులను తయారు చేసి, పంపిణీ చేస్తున్నట్లు ఎం.పీ సంతోష్ కుమార్ వెల్లడించారు.
పెద్ద సంఖ్యలో ఔషధ మొక్కల అవసరాన్ని గుర్తించి, వాటి విత్తనాలతో కూడా సీడ్ గణపతి తయారీ, పంపిణీ కొనసాగుతుందన్నారు. ముఖ్యంగా పెరుగుతున్న కాలుష్యం తద్వారా జరుగుతున్న పర్యావరణ నష్టాన్ని తగ్గించాలన్న తలంపుతో విత్తన గణపతుల పంపిణీకి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ముందుకు వచ్చినట్లు సంతోష్‌కుమార్ తెలిపారు.
ప్రతీయేటా ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తామని, ప్రజలు-భక్తులు వీలైనంత వరకు మట్టి ప్రతిమలను కొలిచేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు. తద్వారా వాటి తయారీదారులకు ఉపాధి, పర్యావరణహితం అనే రెండు లక్ష్యాలు నెరవేరుతాయని ఎంపీ అభిప్రాయపడ్డారు.
పచ్చదనం పెంపుతో పాటు, పర్యావరణ రక్షణకు వీలైనన్ని చర్యలు తీసుకోవటంలో ప్రతీ ఒక్కరూ తగిన అవగాహనతో వ్యవహరించాలని కోరారు. నెక్ట్స్ గలేరియాలో ఈ కార్యక్రమం నిర్వహణకు ముందుకు వచ్చిన మాల్ మేనేజ్‌మెంట్‌ను ఎంపీ సంతోష్ అభినందించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా సంతోష్‌కుమార్ ఇప్పటికే ఎన్నో పర్యావరణహిత కార్యక్రమాలు నిర్వహించారు.
ఇవి కూడా చదవండి: Driving License at Home: ఇంట్లో కూర్చొని మీ డ్రైవింగ్ లైసెన్స్‌ను రెన్యూవల్ చేసుకోండి.. జస్ట్ ఇలా చేయండి.. అంతే..
నల్లధనం తెప్పించారా.. అకౌంట్‌లో వేశారా.. బీజేపీపై మంత్రి హరీష్ రావు ప్రశ్నల వర్షం..