Karakkaya Scam: కరక్కాయ పొడి బ్యాచ్‌కి రంగు పడింది.. సొమ్మును రికవరీ చేసిన హైదరాబాద్ పోలీసులు..
అవసరానికి నాలుగు రాళ్లు కలిసి వస్తాయనే సామాన్యుల ఆశను క్యాష్ చేసుకునే కంత్రీగాళ్లు ఇంకెందరో. కరక్కాయ, దీపం వత్తులు అంటూ మాయచేసే ఇలాంటి కేటుగాళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
Karakkaya Scheme Fraud: సామాన్య, మధ్య తరగతి కుటుంబాలే టార్గెట్‌గా కరక్కాయ బ్యాచ్ అప్పట్లో మాయాజాలం చేసింది. వెయ్యి రూపాయలకు కేజీ కరక్కాయలను కంపెనీ సప్లయ్ చేస్తోంది. కొన్నవాళ్లు మిక్సర్‌లో వేసి పొడి చేసుకు తీసుకురావాలి. అలా చేస్తే కొన్న వెయ్యితో పాటు అదనంగా 3వందల కమీషన్. వెయ్యికి 3వందలు.. పదివేలకు 3 వేలు.. భలేమంచి గిట్టుబాటు బేరమని చాలా మంది క్యూ కట్టారు. ఈ సమయంలో మరో ఆఫర్ కూడా ఇచ్చారు కంపెనీ వాళ్లు. ఎవర్నయినా ఈ స్కీమ్‌లో చేర్పిస్తే ఏజెంట్లకు అదనపు కమీషన్. రెండు రకాల లాభమని చాలా మంది వేలు, లక్షలు పెట్టుబడి పెట్టారు. ఇంకా తెలిసిన వాళ్లతో పెట్టించారు. రెండు మూడు నెలలు కమీషన్ చేతిలో పడింది. ఆ తరువాతే తెలిసిందే ఇదో పెద్ద మోసమని. కరక్కాయలాగా తమ ఆశలను పొడి అయ్యాయయని. న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్ దగ్గర బారులు తీరిన బాధితులు తమ ఆవేదనను కళ్లకు కట్టారు.
ఎవర్నీ కదిలించిన కన్నీటి గాథలే. చన్నీళ్లకు వేన్నీళ్లన్నట్టు ఇంటి ఖర్చులకు కలిసి వస్తుందని ఆశ పడితే.. మొదటికే మోసం వచ్చింది. కొందరు అప్పులు చేసి పెట్టుబడి పెట్టగా.. ఇంకొందరు నగలమ్మారు. పిల్లల చదువు కోసం దాచుకున్న డబ్బును కరక్కాయల కోసం ఖర్చు చేశారు. మిక్సీ చేసి పౌడర్ ఇస్తే చాలు 3వందల కమీషన్ వస్తుంది కదా అన్న చిన్న ఆశ.. చివరకు కన్నీరు మిగిల్చేలా చేసింది. అలా ఒకరా ఇద్దరా కరక్కాయ పొడిని నమ్మి మోసపోయిన బాధితులెందరో. తమకు న్యాయం చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోర్టులను ఆశ్రయించారు.
అయితే.. కరక్కాయ బాధితుల పోరాటం ఎట్టకేలకు ఫలించింది. పోలీసుల దర్యాప్తు, కోర్టు ఆదేశాలతో కరక్కాయ బాధితుల కన్నీటి కథలకు ఊరట దొరికింది. 281 మంది బాధితులకు న్యాయం జరిగింది. వారి ఖాతాల్లో వారికి రావాల్సిన డబ్బు జమ అయింది. మొత్తంగా రూ.73 లక్షల 53 వేలను సదరు సంస్థ నుంచి పోలీసులు రికవరీ చేశారు.
ఏపీకి చెందిన మల్లికార్జున్ సాఫ్ట్ ఇంటిగ్రేట్ మల్టీ టూల్స్ పేరిట 2018లో హైదరాబాద్ కేపీహెచ్‌బీలో కరక్కాయ దందా షురూ చేశాడు . 15 రోజుల్లోనే పెట్టుబడికి అదనంగా రూ.300 వస్తాయని ఆశపడి దాదాపు 423 మంది కరక్కాయలు కొన్నారు. మొత్తంగా రూ.3.75 కోట్లు వసూలు చేసిన మల్లికార్జున్. మూడు నెలల్లోనే బిఛాణా ఎత్తేశాడు. బస్వరాజు అనే వ్యక్తి ఒక్కడే రూ.40 లక్షల కరక్కాయలు కొన్నాడు. అతని ఫిర్యాదుతోనే కేపీహెచ్‌బీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తరువాత బాధితులు ఒకరెనక ఒకరు క్యూ కట్టారు. కూపీలాగితే డేటా బయటపడింది. పది మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
కోర్టు ఆదేశాలతో సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర కాంపిటెంట్ అథారిటిగా, విశ్రాంత సీనియర్ న్యాయమూర్తి జె. సాంబశివ్, డీసీపీలు కల్మేశ్వర్, కవిత సభ్యులుగా వేలం కమిటీ ఏర్పాటు చేశారు. ఆన్లైన్లో ఆ ఆస్తులను వేలం వేశారు. ఈఓడబ్ల్యూ అధికారులు కసరత్తు చేసి 281 మంది బాధితుల కేవైసీ వివరాలు సేకరించి కోర్టుకు సమర్పించారు. వేలంలో వచ్చిన రూ. 73 లక్షల 53 వేల రూపాయిలను ప్రోరేట్ ప్రకారం 281మంది బాధితులకు వచ్చేలా చేశారు. ఈ మేరకు కమిషనరేట్లో 12మంది బాధితులకు సీపీ స్టీఫెన్ రవీంద్ర చెక్కులను అందజేశారు. ఈఓడబ్ల్యూ డీసీపీ కవిత, ఏసీపీ రామ్చంద్రారెడ్డి, ఇన్ స్పెక్టర్ ఎండీ వహీదుద్దీన్లను కమిషనర్ ప్రశంసించారు. సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్స్ వింగ్-ఆర్థిక నేరాల పరిశోధన విభాగం చొరవతో తమకు న్యాయం జరిగిందని బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తలు చదవండి