Hyderabad: అనుమానాస్పదంగా ఫుడ్ డెలివరీ బాయ్.. అదుపులోకి తీసుకుని అతడి బ్యాగ్ చెక్ చేయగా
మత్తుగాళ్లు క్రియేటివ్ ఐడియాస్‌తో చెలరేగిపోతున్నారు. అంతుచిక్కని మార్గాల్లో రహస్యంగా గంజాయి రవాణా చేస్తున్నారు.
మత్తు పదార్థాల సప్లైను నేరగాళ్లు కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. పోలీసుల తనిఖీలు ఎక్కువవ్వడంతో.. సరికొత్త మార్గాలను అన్వేశిస్తున్నారు. తాజాగా వినియోగదారులకు గంజాయి సరఫరా చేస్తున్న ఫుడ్ డెలివరీ బాయ్‌ను తుకారాంగేట్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. అతడి నుంచి 600 గ్రాముల గంజాయి, బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నేరేడ్‌మెట్‌లో నివాసముంటున్న చుంచు నితీష్ చంద్ర (20) ఫుడ్ డెలివరీ కంపెనీలో పనిచేస్తూ.. ఫుడ్ క్యారీయింగ్ బ్యాగ్‌లో ఉంచి వినియోగదారులకు గంజాయి సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు.
“నితీష్ జవహర్‌నగర్‌కు చెందిన రాహుల్ నుండి గంజాయిని సేకరించాడు. అతని సూచనల మేరకు నగరంలోని వివిధ ప్రాంతాల్లోని వినియోగదారులకు ఈ మత్తు పదార్థాన్ని సరఫరా చేశాడు. తనిఖీల్లో పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు రెండు గంజాయి ప్యాకెట్లను తన వద్ద ఉంచుకుని అనుమానం రాకుండా ఆహార ప్యాకెట్లతో పాటు తీసుకెళ్లేవాడు’ అని గోపాలపురం ఏసీపీ ఎన్ సుధీర్ తెలిపారు. పక్కా సమాచారంతో తుకారాంగేట్ వద్ద సరుకును ఓ వ్యక్తికి అందించేందుకు వచ్చిన అతడిని పోలీసులు పట్టుకున్నారు. నితీష్ అరెస్ట్‌తో రాహుల్ కూడా పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు.
దాదాపు 30 మంది కస్టమర్లకు నితీష్ గంజాయి ప్యాకెట్లు సరఫరా చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులపై NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి.. దర్యాప్తు జరుపుతున్నారు. జొమాటో సంస్థలో ఉద్యోగం చేస్తూ.. అధిక డబ్బుకు ఆశపడి గంజాయి సరఫరా చేసినట్లు ప్రాథమిక విచారణలో నితీష్ ఒప్పుకున్నాడు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం