మద్యం సేవించొద్దన్నందుకు.. అర్ధరాత్రి పోలీస్‌ని చితకబాదిన NRI బాబు
విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్‌పై నలుగురు యువకులు దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. మద్యం మత్తులో ఉన్న యువకులు బహిరంగంగా మద్యం సేవిస్తుండగా వారిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని హెడ్ కానిస్టేబుల్ కృష్ణ సూచించారు. దీంతో వాగ్వాదం చోటుచేసుకుని చివరకు యువకులు కానిస్టేబుల్‌పై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు..

హైదరాబాద్, జులై 9: హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం మత్తులో నలుగురు యువకులు రెచ్చిపోయారు. విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్‌పై దాడికి పాల్పడి తీవ్రంగా గాయపరిచిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో గాయపడిన హెడ్ కానిస్టేబుల్ కృష్ణను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కేసు నమోదు చేసిన ఓయూ పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చగా, న్యాయస్థానం వారికి రిమాండ్ విధించింది
పోలీసుల వివరాల ప్రకారం.. ఆదివారం తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో ఐఎఫ్‌ఎల్‌యూ (EFLU) గేట్ సమీపంలో ఓ కారుపై కూర్చుని నలుగురు యువకులు బహిరంగంగా మద్యం సేవిస్తున్నారు. ఆ సమయంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ కృష్ణ వారిని ప్రశ్నించి అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారు.
అయితే ఇటీవల ఆస్ట్రేలియా నుంచి భారత్‌కు వచ్చిన సాయికృష్ణ అనే యువకుడు పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. ఫారిన్‌లో రోడ్లపై ఏ సమయంలోనైనా మద్యం తాగినా ఎవరూ అడగరు.. ఇక్కడ పోలీసులు ఎందుకు ప్రశ్నిస్తున్నారు? అంటూ హెడ్ కానిస్టేబుల్‌తో దురుసుగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. అనంతరం అతనితో పాటు ఉన్న మరో ముగ్గురు స్నేహితులు కూడా కానిస్టేబుల్‌పై దాడికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. దాడిలో హెడ్ కానిస్టేబుల్ కృష్ణకు తీవ్ర గాయాలు కావడంతో సహచర పోలీసులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అనంతరం వారిని కోర్టులో హాజరుపర్చగా రిమాండ్‌కు తరలించారు.
