తెలుగు పద్యానికి తొలి పునాది.. అద్ధంకిలో 1200 ఏళ్ల నాటి ఈ శాసనం గురించి మీకు తెలుసా?
తెలుగు భాషా చరిత్రలోనే అత్యంత విలక్షణమైన ఘట్టానికి ప్రకాశం జిల్లాలోని అద్దంకి వేదికగా నిలిచింది. మనకు లభించిన ఆధారాల ప్రకారం తెలుగులో మొట్టమొదటి పద్య రూపాన్ని సంతరించుకున్న చారిత్రాత్మక 'పండరంగని పద్యశాసనం' దాదాపు 1200 సంవత్సరాల క్రితం ఇక్కడే ఆవిర్భవించింది. వేంగి చాళుక్యుల విజయోత్సాహానికి, మన దేశీయ ఛందస్సు వైభవానికి ప్రతీకగా నిలిచిన ఈ శాసనం తెలుగు సాహిత్య ప్రయాణంలో ఒక మైలురాయిగా భాసిల్లుతోంది.

తెలుగు భాష అనగానే ప్రతి ఒక్కరికీ ముందుగా గుర్తుకువచ్చేది పద్య సౌందర్యం. సీస పద్యాలు, తేటగీతులు, ఉత్పలమాలలతో అలరారిన మన అమృత భాషకు అసలు పద్య రూపం ఎక్కడ, ఎప్పుడు రూపుదిద్దుకుందో తెలుసా? అది ప్రకాశం జిల్లాలోని అద్దంకి పుణ్యభూమిలోనే! ఏకంగా 1200 ఏళ్ల కిందట తెలుగు పద్యానికి ప్రాణం పోసిన ఆ చారిత్రక సాక్ష్యమే ‘పండరంగని పద్యశాసనం. క్రీస్తు శకం 848 (శాక సంవత్సరం 770) నాటి ఈ శాసనానికి గొప్ప చారిత్రక నేపథ్యం ఉంది. వేంగి చాళుక్య రాజ్యాన్ని ఏలుతున్న గుణగ విజయాదిత్యుని కాలంలో, ఆయన నమ్మకస్తుడైన దండనాయకుడు, సేనాపతి పండరంగుడు ఈ శాసనాన్ని చెక్కించారు.
నాటి బోయ రాజులతో జరిగిన యుద్ధంలో పండరంగుడు 12 బోయ కోటలను గెలుచుకుని, కందుకూరును ఆక్రమించి వేంగి సింహాసనానికి విజయాన్ని చేకూర్చాడు. ఈ అద్భుత విజయానికి గుర్తుగా అద్దంకిలోని ఆదిత్య భట్టారకునికి భూదానం చేస్తూ పండరంగుడు ఈ శాసనాన్ని వేయించారు. మనకు లభించిన మొట్టమొదటి తెలుగు పద్య శాసనం ఇదే కావడం దీని ప్రత్యేకత. ఇందులో మన దేశీయ ఛందస్సు అయిన తరువోజ పద్యంలో రచన సాగింది.
పట్టంబు గట్టిన ప్రథమంబు నేణ్డు బలమెచ్ఛి వేంగిళు రక్షించనెత్తి.. అంటూ సాగే ఈ పద్యం, తెలుగు సాహిత్యంలో పద్య నిర్మాణానికి నాంది పలికిన అద్భుత ఘట్టంగా చరిత్రలో నిలిచిపోయింది. కాలగర్భంలో కలసిపోతున్న ఈ అపూర్వ సంపదను అద్దంకి గ్రామాధికారి కాకాణి కోటయ్య వేయిస్తంభాల గుడి పరిసరాల్లో కనుగొన్నారు. 1905లో అలెన్ బటర్ వర్త్, వేణుగోపాల శెట్టి తమ గ్రంథంలో దీనిని మొదటిసారిగా ప్రచురించినట్టు ఆయన కనుగొన్నారు. ఇది తరువోజ’ పద్యమని ప్రముఖ చారిత్రక పరిశోధకులు కొమర్రాజు లక్ష్మణరావు పంతులు స్పష్టం చేశారు.
ఈ శాసనాన్ని భద్రపరచడంలో సాహిత్య దిగ్గజం వేటూరి ప్రభాకరశాస్త్రి కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం ఈ శాసన మూల ప్రతికృతి చెన్నై ప్రభుత్వ మ్యూజియంలో భద్రంగా ఉంది. దాని జ్ఞాపకంగా నార్కేట్‌పల్లి – అద్దంకి హైవే పక్కనే ఉన్న కాళికా సమేత కామేశ్వర స్వామి దేవస్థాన ప్రాంగణంలో ఒక అందమైన స్థూపం ఏర్పాటు చేశారు. ఇందులో శాసన యథాతథ పాఠం, అర్థంతో కూడిన వివరణలను భక్తులు, పర్యాటకులు చదువుకోవడానికి వీలుగా తీర్చిదిద్దారు.
తెలుగు భాషాభిమానులు, చరిత్ర ప్రేమికులు ప్రతి ఒక్కరూ తప్పక సందర్శించాల్సిన ప్రదేశం అద్దంకి. తెలుగు పద్యానికి జన్మనిచ్చిన ఈ శాసనం మన సంస్కృతికి, భాషా వైభవానికి నిలువెత్తు సాక్ష్యం.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
