AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీ సర్కార్ మరో గుడ్‌న్యూస్.. కొత్త పథకానికి శ్రీకారం.. నేరుగా ఖాతాల్లో రూ.25 వేల జమ!

ఆంధ్రప్రదేశ్‌లో చేనేత రంగానికి మరింత ఊతమివ్వాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక సంక్షేమ పథకాన్ని అమలు చేయనుంది. 'నేతన్న సేవలో' పేరుతో రూపొందించిన ఈ పథకాన్ని ఆగస్టు 7 నుంచి ప్రారంభించాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను ఇప్పటికే విడుదల చేయగా, అర్హులైన ప్రతి చేనేత కుటుంబానికి సంవత్సరానికి రూ.25,000 చొప్పున నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు.

ఏపీ సర్కార్ మరో గుడ్‌న్యూస్.. కొత్త పథకానికి శ్రీకారం.. నేరుగా ఖాతాల్లో రూ.25 వేల జమ!
Ap Nethanna Sevalo Scheme
Balaraju Goud
|

Updated on: Jul 31, 2026 | 9:03 AM

Share

ఆంధ్రప్రదేశ్‌లో చేనేత రంగానికి మరింత ఊతమివ్వాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక సంక్షేమ పథకాన్ని అమలు చేయనుంది. ‘నేతన్న సేవలో’ పేరుతో రూపొందించిన ఈ పథకాన్ని ఆగస్టు 7 నుంచి ప్రారంభించాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను ఇప్పటికే విడుదల చేయగా, అర్హులైన ప్రతి చేనేత కుటుంబానికి సంవత్సరానికి రూ.25,000 చొప్పున నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు.

ఈ పథకం ప్రత్యేకత ఏమిటంటే, ఒక కుటుంబంలో ఎన్ని మగ్గాలు ఉన్నాయన్నది, ఎంతమంది చేనేత కార్మికులు ఉన్నారన్నది ప్రమాణీకం కాదు. అర్హత కలిగిన ప్రతి చేనేత కుటుంబానికి ఒక్కసారిగా వార్షిక ఆర్థిక సాయం అందజేయనున్నారు. ప్రస్తుతం చేనేత వృత్తిలో కొనసాగుతూ, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలు ఈ పథకానికి అర్హులు. రాష్ట్రవ్యాప్తంగా తొలి విడతలో సుమారు 51,952 చేనేత కుటుంబాలు లబ్ధి పొందనున్నట్లు ప్రభుత్వం గుర్తించింది.

పథకం అమలులో పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తూ గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అర్హుల జాబితాలను సిద్ధం చేయనున్నారు. కొత్త అర్హులను చేర్చడం, వివరాల్లోని పొరపాట్లను సవరించడం, జాబితాలను ప్రజల పరిశీలన కోసం సచివాలయాల్లో ప్రదర్శించడం వంటి ప్రక్రియలు చేపట్టనున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ల ఆమోదంతో తుది లబ్ధిదారుల జాబితా ఖరారు కానుంది. ఈ ఏడాది ఉచిత విద్యుత్ పథకానికి ఎంపికైన చేనేత కార్మికుల జాబితాను ప్రామాణికంగా ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది.

చేనేత రంగంలో ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించి, పవర్‌లూమ్ రంగంతో పోటీపడేలా నేతన్నలకు ఆర్థిక బలం కల్పించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశం. అందే సాయంతో నూలు కొనుగోలు, మగ్గాల మరమ్మతులు, కొత్త మగ్గాల ఏర్పాటు, రంగులు తదితర అవసరాలను తీర్చుకునే అవకాశం ఉంటుంది. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు నెలకు 200 యూనిట్లు, పవర్‌లూమ్ కార్మికులకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కూడా అందిస్తోంది. ఈ పథకం ద్వారా చేనేత కుటుంబాలపై విద్యుత్ వ్యయం గణనీయంగా తగ్గుతుండగా, రాష్ట్రవ్యాప్తంగా లక్షకు పైగా కుటుంబాలు ప్రయోజనం పొందుతున్నాయి.

అదనంగా, చేనేత కార్మికులకు కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఈ-పెహచాన్ కార్డులు జారీ చేస్తున్నారు. ఈ కార్డు ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలను సులభంగా పొందే అవకాశం ఉంటుంది. అర్హులైన చేనేత కార్మికులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుని, ధ్రువీకరణ అనంతరం ఈ-పెహచాన్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. చేనేత వృత్తిని పరిరక్షించడం, నేతన్నలకు స్థిరమైన ఆదాయం కల్పించడం, సంప్రదాయ చేనేత పరిశ్రమకు కొత్త ఊపునివ్వడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్యలను చేపడుతోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us