90 ml ఎంత పని చేసింది.. ముంబైలో మోగిన అలారం.. కట్ చేస్తే హైదరాబాద్‌లో..
జూబ్లీహిల్స్‌లో మద్యం మత్తులో ఏటీఎంను పగలగొట్టేందుకు యత్నించిన వ్యక్తి టెక్నాలజీ అలర్ట్‌తో వెంటనే పోలీసులకు చిక్కాడు. “90 రూపాయల కోసం వచ్చాను” అన్న నిందితుడి సమాధానం ఆశ్చర్యానికి గురిచేసింది. పూర్తి వివరాల కథనం లోపల తెలుసుకుందాం పదండి .. .. ..

నగరంలోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మెట్రో స్టేషన్ కింద అడ్డా కూలీగా పని చేసే ఓ వ్యక్తి, మద్యానికి బానిసై ఏటీఎంను పగలగొట్టేందుకు యత్నించాడు. ఈ ఘటన రోడ్ నంబర్-5 వద్ద ఉన్న చెక్‌పోస్ట్ సమీపంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం, కొత్తపల్లి వేణునంద అనే వ్యక్తి మద్యం మత్తులో ఏటీఎం వద్దకు వెళ్లి దానిని ధ్వంసం చేయడానికి ప్రయత్నించాడు. అయితే, ఏటీఎంలో అమర్చిన ఆధునిక సెక్యూరిటీ వ్యవస్థ వెంటనే స్పందించి అలర్ట్‌ను ముంబైలోని బ్యాంక్ ప్రధాన కార్యాలయానికి పంపింది. అక్కడి నుంచి సమాచారం అందుకున్న అధికారులు తక్షణమే స్థానిక పోలీసులను అప్రమత్తం చేశారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
విచారణలో నిందితుడు చెప్పిన సమాధానం ఆశ్చర్యానికి గురిచేసింది. “90 మిల్లీలీటర్ల మద్యం కోసం 90 రూపాయలు తీసుకోవాలనుకున్నాను” అని చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. అనంతరం అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనతో, నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఏటీఎం భద్రతా వ్యవస్థలు ఎంత వేగంగా స్పందిస్తున్నాయో మరోసారి స్పష్టమైంది. చిన్న సమయంలోనే హెడ్‌క్వార్టర్స్‌కు సమాచారం చేరి, స్థానికంగా చర్యలు తీసుకోవడం టెక్నాలజీ సమర్థతకు నిదర్శనంగా నిలిచింది.
