వర్షాకాలంలో తప్పక తినాల్సిన ఆరోగ్య సంజీవని.. ఇన్ఫెక్షన్లకు చెక్ పెట్టే అమృతం!
30 May 2026
Jyothi Gadda
వర్షాకాలం వస్తూనే మనకు వేడి వాతావరణం నుండి ఉపశమనం కలిగిస్తుంది. కానీ, అదే సమయంలో అనేక రకాల ఇన్ఫెక్షన్లు, వైరల్ జ్వరాలు, జీర్ణ సంబంధిత సమస్యలను కూడా తెచ్చిపెడుతుంది.
వర్షా కాలంలో మనల్ని మనం ఆరోగ్యంగా ఉంచుకోవడానికి రోగనిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాలను తీసుకోవడం ఎంతో ముఖ్యం. అలాంటి ఒక అద్భుతమైన ఆకుకూర ఎర్ర తోటకూర.
ఎర్ర తోటకూరలో విటమిన్-సి, ఎ విపరీతంగా ఉంటాయి. ఇవి శరీరంలో తెల్ల రక్తకణాల ఉత్పత్తిని పెంచి, వర్షాకాలంలో వేధించే దగ్గు, జలుబు, జ్వరాలు, ఇతర సీజనల్ ఇన్‌ఫెక్షన్ల నుండి శరీరాన్ని సమర్థవంతంగా రక్షిస్తాయి.
ఈ కాలంలో జీర్ణవ్యవస్థ కాస్త మందగించడం సహజం. తోటకూరలో పీచు పదార్థం అత్యధికంగా ఉంటుంది. ఇది ప్రేగుల కదలికలను సులభతరం చేసి, గ్యాస్, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తుంది.
ఎర్ర తోటకూరలో ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచడానికి, రక్తహీనత సమస్యతో బాధపడేవారికి ఒక సహజ ఔషధంగా పనిచేస్తుంది. మహిళలు, గర్భిణీలకు ఎంతో అవసరం.
ఎముకల పుష్టికి క్యాల్షియం నిధి. ఇందులో క్యాల్షియం పుష్కలంగా ఉండటం వల్ల ఎముకలు, దంతాలు బలంగా మారతాయి. ఆర్థరైటిస్ లేదా కీళ్ల నొప్పులతో బాధపడేవారికి ఇది మేలు చేస్తుంది.
ఇందులో క్యాలరీలు, కొవ్వు పదార్థాలు చాలా తక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారు దీనిని తమ డైట్‌లో చేర్చుకోవచ్చు. అలాగే, ఇందులో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రణలో ఉంచి, గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.
వర్షాకాలంలో తోటకూర కొనేటప్పుడు అది తాజాగా ఉందో లేదో చూసుకోవాలి. ఆకుకూరలపై క్రిములు లేదా ధూళి ఉండే అవకాశం ఉంది కాబట్టి, వండే ముందు ఉప్పు లేదా కొద్దిగా పసుపు వేసిన నీటిలో ఆకులను బాగా కడిగి, ఉడికించి తీసుకోవాలి.