Hyderabad: ఎంఎంటీఎస్ రైళ్లల్లో ఉచిత ప్రయాణంపై మరో అప్డేట్.. అమల్లోకి అప్పటినుంచేనా..?
హైదరాబాద్ వాసులకు శుభవార్త. జూన్ 2 నుంచి ఎంఎంటీఎస్ రైళ్లల్లో ఉచిత జర్నీ అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నాలను ప్రభుత్వం ముమ్మరం చేసింది. దీని వల్ల నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఇప్పటికే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమల్లో ఉంది.

హైదరాబాద్ ప్రజలకు రేవంత్ సర్కార్ త్వరలో గుడ్ న్యూస్ అందించనుంది. త్వరలో నగరంలో సర్వీసులు అందిస్తున్న ఎంఎంటీఎస్ రైళ్లల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. మహిళలు, పురుషులందరికీ ఉచిత జర్నీ అవకాశం కల్పించేందుకు కసరత్తులు చేస్తోంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2వ తేదీ నుంచి ఈ పథకాన్ని ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించిన చర్చలు కూడా తుది దశకు చేరుకున్నాయి. దక్షిణ మధ్య రైల్వేతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉంటుంది. దీంతో ఇప్పటికే ఎంవోయూను ప్రభుత్వం సిద్దం చేసింది. ప్రస్తుతం ఆర్దికశాఖ, న్యాయశాఖ, సీఎంవో ఆమోదానికి పంపించారు.
తగ్గనున్న ట్రాఫిక్ రద్దీ
రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆమోదం లభించాక ఈ ఎంవోయూను రైల్వే బోర్డుకు పంపించనున్నారు. రైల్వే బోర్డు ఆమోదించాక రేవంత్ ప్రభుత్వం ఎంఎంటీఎస్ రైళ్లలో ఉచిత ప్రయాణ స్కీమ్‌ను ప్రవేశపెట్టనుంది. ఇందుకయ్యే మొత్తం ఖర్చును దక్షిణ మధ్య రైల్వేకు ప్రభుత్వం చెల్లించనుంది. ఈ పథకం అమలుకు కొన్ని టెక్నికల్ ప్రాబ్లంలు గుర్తించారు. వీటిని పరిష్కరించేందుకు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. గతంలో ఈ పథకం అమలుపై అవకాశాలను పరిశీలించాల్సిందిగా రైల్వేశాఖకు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. అయితే దీనికి కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నట్లు ప్రభుత్వానికి రైల్వేశాఖ తెలిపింది. వాటిని పరిష్కరించిన అనంతరం ఉచిత జర్నీని అమలు చేయనున్నారు. దీని వల్ల నగరంలో కొంతమేర ట్రాఫిక్ తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఉచిత ప్రయాణం వల్ల ఎక్కువమంది ప్రయాణించే వీలు ఉంటుంది. దీని వల్ల ట్రాఫిక్ రద్దీ తగ్గుతుందని భావిస్తున్నారు.
ఆర్టీసీ షటిల్ సర్వీసులు
ప్రస్తుతం ఎంఎంటీఎస్ సేవల ద్వారా రైల్వేశాఖకు ఏడాదికి రూ.10 కోట్ల ఆదాయం వస్తుంది. ఇప్పుడు ఉచిత ప్రయాణం వల్ల ప్రయాణికుల సంఖ్య పెరిగినా అందుకు సమానమైన మొత్తాన్ని ప్రభుత్వం భరించేందుకు సిద్దమవుతోంది. కరోనాకు ముందు రోజు 1.20 లక్షల మంది ఎంఎంటీఎస్‌లో ప్రయాణించేవారు. ఇప్పుడు అది 50 వేలకు తగ్గింది. ఇప్పుడు ఫ్రీ జర్నీ వల్ల పూర్వవైభవం వస్తుందని రైల్వేశాఖ భావిస్తోంది. దీని వల్ల ట్రాఫిక్ సమస్యతో పాటు కాలుష్యం తగ్గుతుందని అధికారులు భావిస్తు్న్నారు. ఇక ఎంఎంటీఎస్ సర్వీసులు ఎక్కువ నడపాలని రైల్వేశాఖను ప్రభుత్వం కోరుతోంది. ఇక ఎంఎంటీఎస్ స్టేషన్ల వద్ద ఆర్టీసీ షటిల్ బస్సులను నడపనున్నారు. ఇక బస్సుల కోసం రైల్వే స్టేషన్ పరిసరాల్లో స్థలం కేటాయించనున్నారు. దీని వల్ల ఎంఎంటీఎస్ స్టేషన్‌లో దిగగానే ప్రయాణికులు సులువుగా తమ గమ్యస్థానాలకు చేరుకునే అవకాశం ఉంటుంది.
