AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆర్డర్ పిక్ చేసుకునేందుకు లేటుగా వచ్చాడని డెలివరీ బాయ్‌ను చితకబాదారు

కేవలం పది నిమిషాలు ఆలస్యంగా వచ్చాడనే కారణంతో హైదరాబాద్‌లో ఓ ఫుడ్ డెలివరీ బాయ్‌పై ఐదుగురు హోటల్ సిబ్బంది దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

ఆర్డర్ పిక్ చేసుకునేందుకు లేటుగా వచ్చాడని డెలివరీ బాయ్‌ను చితకబాదారు
Food Delivery Boy(A representative image )
Lakshmi Praneetha Perugu
| Edited By: |

Updated on: May 30, 2026 | 9:03 PM

Share

హైదరాబాద్‌లో ఓ ఫుడ్ డెలివరీ బాయ్‌పై హోటల్ సిబ్బంది దాడి చేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. కేవలం పది నిమిషాలు ఆలస్యంగా వచ్చాడనే కారణంతో ఐదుగురు హోటల్ ఉద్యోగులు అతడిపై విచక్షణారహితంగా దాడి చేయడం ఆగ్రహానికి దారి తీసింది.

వివరాల్లోకి వెళ్తే.. నగరంలోని ఓ ప్రముఖ రెస్టారెంట్‌కు ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్‌ను పికప్ చేసేందుకు డెలివరీ ఎగ్జిక్యూటివ్ వెళ్లాడు. అయితే ట్రాఫిక్ రద్దీ కారణంగా అతడు హోటల్‌కు చేరుకోవడంలో సుమారు పది నిమిషాలు ఆలస్యమైంది. ఇదే విషయాన్ని కారణంగా చూపుతూ రెస్టారెంట్ సిబ్బంది అతనితో వాగ్వాదానికి దిగారు. మాటామాటా పెరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆగ్రహానికి గురైన ఐదుగురు సిబ్బంది కలిసి డెలివరీ బాయ్‌పై దాడి చేసినట్లు తెలుస్తోంది. నడిరోడ్డుపైనే అతడిని కొట్టడంతో బాధితుడు గాయాల పాలయ్యాడు.

ఈ ఘటనను అక్కడే ఉన్న కొందరు స్థానికులు తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరించారు. అనంతరం ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. కేవలం పది నిమిషాల ఆలస్యానికి ఇంత దారుణంగా ప్రవర్తించడంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డెలివరీ సిబ్బంది భద్రతపై కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తీవ్రంగా గాయపడిన బాధితుడిని అతని సహచరులు సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. దాడికి పాల్పడిన ఐదుగురు హోటల్ సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు.

బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇటువంటి ఘటనలను ఉపేక్షించబోమని, నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ రంగంలో పనిచేసే యువకులు ఎండ, వాన, ట్రాఫిక్ ఇబ్బందులను ఎదుర్కొంటూ వినియోగదారులకు సేవలు అందిస్తున్నారు. అలాంటి కార్మికులపై దాడులు జరగడం ఆందోళన కలిగించే విషయమని, వారి భద్రత కోసం మరింత కఠిన చర్యలు అవసరమని పలువురు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us